అతిథి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, అమృతారావు, ఆశిష్ విద్యార్ధి, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, నాజర్, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు, అజయ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. సురేందర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత జి రమేష్ బాబు నిర్మించారు.
కథ
అతిధి (మహేష్ బాబు) ఒక అనాధ. ఏడేళ్ళ వయసులో ఢిల్లీలో ఒక జంట అతడిని అక్కున చేర్చుకుని, అల్లారు ముద్దుగా పెంచుతారు. ఆ జంటను ఒక దుర్మార్గుడు పెద్ద కారణం లేకుండానే చంపుతాడు. అతను అతిధి చేతిలో రివాల్వర్ ఉంచి పరారవుతాడు. ఆ దంపతుల సొంత కుమార్తె చిన్నారి అమృత ( అమృతారావు) తన తలిదండ్రులను అతిథే చంపాడని అనుకుంటుంది.
పద్నాలుగేళ్ళ తర్వాత అతిధి జైలు నుంచి విడుదల అవుతాడు. తనను పెంచుకున్న జంటను కాల్చి చంపిన వారిని పట్టుకోవడం అతని ధ్యేయం. అతని వద్ద హంతకుడి ఫోటో మాత్రమే ఉంటుంది. ఇతర క్లూలు ఏమీ ఉండవు. పనిలో పనిగా హీరోగారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన అమృతకు నోటి ద్వారా ఆక్సిజన్ పంప్ చేసి రక్షిస్తాడు.తనను పెంచుకున్న జంట కుమార్తే ఈ అమృత అని అతిధి తెలుసుకుంటాడు. అదే సమయంలో అమృతను చంపడానికి కైజర్ (కొత్త నటుడు) అనే మాఫియా డాన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తలిదండ్రులను చంపిన వాడే ఈ అతిధి అని తెలుసుకోడానికి అమృతకు ఎంతో సమయం పట్టదు. ఈ దశలో సినిమా మంచి రసపట్టులో పడుతుంది. కైజర్ ను అంతమొందించడం హీరోగారి పరమ లక్ష్యంగా మారుతుంది. లక్ష్య సాధనలో హీరో ఎన్ని ఇబ్బందులు పడి, చివరికి ఎలా విజయం సాధిస్తాడో తెరమీద చూడాల్సిందే.