జైబోలో తెలంగాణ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్, మీరానందన్, గౌరీశంకర్, గద్దర్, వేదకుమార్, దేశపతి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య, డా.శ్రవణ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత-దర్శకుడు: ఎన్.శంకర్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
ప్రత్యేక తెలంగాణా కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న కుటుంబం బందగి గోపన్న(జగపతిబాబు)ది. ఆయన కూడా పోరాటంలో పాల్గొని ప్రాణాలు వదులుతాడు. ప్రస్తుతం ఆయన కొడుకు వర్షిత్ (సందీప్) తరం నడుస్తూంటుంది. వర్షిత్ తన తల్లి జయమ్మ(స్మృతి ఇరానీ) తో కలిసి ఉంటూంటాడు. తండ్రి, తాతల్లాగే ఆశయం కోసం మరణించం ఇష్టపడని అతను చదువుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఆ క్రమంలో అతనికి విజయవాడకు చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన ఆంద్రా అమ్మాయి సహజ (మీరా నందన్) పరిచయమవుతుంది. పరిచయం ప్రేమదాకా పోతుంది. అయితే ఈ లోగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన అతనికి తెలంగాణా పల్లె జనం పడుతున్న కష్టాలు, కన్నీళ్ళు తెలిసి వస్తాయి. దాంతో తన ప్రేమను పణంగా పెట్టి ఉద్యమంలోకి దూకుతాడు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ జంట ఒకటయ్యారా...ఉద్యమం వారికి ఏమి మిగిల్చింది అనేది మిగతా కధ.