పవన్ కళ్యాణ్ వల్ల మరో డైరెక్టర్ బలయ్యాడంటూ ప్రచారం!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పై ప్రచారంలోకి వచ్చిన ఓ వార్త అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. చిలవలు పలవలుగా వెలువడుతున్న సదరు పుకార్లను ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ వల్ల మరో డైరెక్టర్ కెరీర్ పరంగా బలవుతున్నాడనేది ఆ వార్తల సారాంశం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' గత రెండేళ్లుగా ఈ చిత్రం ప్రారంభానికి నోచుకోకుండా ఊగిసలాడుతూనే ఉంది. సంపత్ నంది దర్శకుడిగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. పలు కారణాలతో సినిమా ప్రారంభం కాకముందే సంపత్ నంది ఆ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చారు. సంపత్ నంది స్టోరీ, స్క్రిప్టు వర్కు నచ్చకనే ఆయన్ను తీసేసినట్లు టాక్. దీంతో అదే స్టోరీతో సంపత్ నంది రవితేజతో ‘బెంగాల్ టైగార్' ప్లాన్ చేసుకున్నాడు.

తర్వాత ‘పవర్' ఫేం బాబీ గబ్బర్ సింగ్ 2 చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యారు. పవన్ కళ్యాణే స్వయంగా స్టోరీ సమకూర్చారు. స్క్రిప్టు వర్కు మాత్రం బాబీకి అప్పగించాడు. అయితే బాబీ కూడా పవన్ కళ్యాణ్‌ని మెప్పించలేక పోయాడని టాక్. దీంతో బాబీ కూడా ఈ ప్రాజెక్టు నుండి ఔట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తీరుతో బాబీ బలవుతున్నాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఖాళీ గ్యాపులో దాసరి నారాయణరావు నిర్మాణ సంస్థలో సినిమా చేయాలని పవర్ స్టార్ ఆలోచన చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. అయితే ఇంత కాలం పవన్ కళ్యాణ్ సినిమా కారణంగా ఇతర సినిమాలను వదులుకున్న బాబీ కెరీర్ అయోమయంలో పడిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











