అల్లు అర్జున్ రియల్ హీరో: అభిమాని కోరిక తీర్చి...రూ. 10 లక్షల సహాయం!
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చావు బ్రతుకులతో పోరాడుతున్న అభిమానిని కలిసి అతడి కోరికను తీర్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. అంతే అతడి చికిత్స కోసం రూ. 10 లక్షల సహాయం చేస్తానని కూడా బన్నీ ప్రకటించడం విశేషం.
వివరాల్లోకి వెళితే... విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన దేవసాయి గణేష్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరాభిమాని. కొంతకాలంగా దేవసాయి గణేష్ బోన్ కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. చావు బ్రతుకులతో పోరాడుతున్నాడు. పరిస్థితి ఇలా ఉండటంతో తాను ఎంతగానో ఇష్టపడే హీరోను చూస్తానో లేదో అని బెంగపెట్టుకున్నాడు.

బన్నీని కలవాలన్న తమ్ముడి కోరికను తీర్చేందుకు.... ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశాడు దేవసాయి గణేష్ సోదరుడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అనకాపల్లి వెళ్లి అభిమానిని పరామర్శించారు. త్వరలోనే కోలుకుంటావని ధైర్యం చెప్పారు. అంతేకాదు చికిత్స నిమిత్తం 10 లక్షలు ఆర్థిక సాయం కూడా చేస్తానని హామీ ఇచ్చారు.
స్వయంగా అల్లు అర్జున్ తమ ఇంటికి రావడంతో దేవసాయి గణేష్ కుటుంబంలో ఆనందం నెలకొంది. బన్నీ అభిమానిని పరామర్శించడంతో పాటు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడంపై హర్షం వ్యక్తం అవుతోంది, ఆయన కేవలం సినిమా హీరో కాదని, రియల్ హీరో అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











