For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాణం ఎలా ఉంది?

  By Staff
  |

  నారా రోహిత్ హీరోగా పరిచయమవుతూ వచ్చిన 'బాణం' చిత్రం బిలో యావరేజి అని,బాణం గురి తప్పిందంటూ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది. అలాగే క్లారిటీ లేని కథ,ఇంపార్టెన్స్ లేని హీరోయిన్ క్యారెక్టర్,పస లేని ట్యూన్స్ ఈ సినిమాను దిగజార్చేసాయంటున్నారు. నారా రోహిత్ ..స్వయానా మాజీ ముఖ్యమంత్రి సోదరుడు రామ్మూర్తి నాయుడు సోదరుడు కుమారుడు కావటంతో మీడియా దృష్టి మొత్తం ఈ చిత్రం పైనే పెట్టింది. రిలీజైన రోజే నెగిటివ్ రివ్యూలతో టీవీ ఛానెల్స్ బెదరకొట్టాయి. కొంతమందయితే ఈ చిత్రం మల్టీ ప్లెక్స్ మూవీ అంటూ ముద్ర వేస్తూ మాట్లాడారు. అయితే వీటిన్నటిలో నిజం ఉందా..అన్నది పరిశీలిస్తే...

  బాణం కథ కథ 1989 సంవత్సరంలో జరుగుతూంటుంది. భగత్ పాణిగ్రాహి (నారా రోహిత్) ఓ మాజీ నక్సలైట్ (షయాజీ షిండే) కొడుకు. వ్యవస్ధను బాగుచేయటానికి తండ్రిలా తుపాకి పట్టుకుని అడవిలోకి వెళ్ళల్సిన పనిలేదని..తాను ఐపియస్ అయి వ్యవస్ధను లోపలినుంచే బాగుచేస్తానంటూ ఆ దిశగా కృషి చేస్తూంటాడు. ఈ లోగా అతనికి సుబ్బలక్ష్మి(వేదిక)పరిచయమవుతుంది. ఆమెది వరకట్నం కేసు. తండ్రి కట్నం ఇవ్వలేక మరణిస్తే, అత్తింటి వారు పెళ్లైన రోజు తరిమేస్తే మిగిలిపోతుంది. ఆమెను భగత్ చేరదేసి, తన లక్ష్యం ఐపియస్ కు ప్రిపేరవుతూంటాడు. అయితే పెళ్ళయిన అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే తాళికట్టిన భర్త ఒప్పుకోడు కదా..రెచ్చి పోయి రౌడిలను తీసుకుని దాడి చేస్తాడు. అక్కడ నుంచి భగత్ కి చేతి నిండా పని. వచ్చిన వాళ్ళను వచ్చినట్లే చావ చితక్కొడుతూంటే..ఆ బ్యాచ్ హెడ్ అక్కడ లోకల్ మాఫియా లీడర్ శక్తి సాహు(రణధీర్)రంగంలోకి దిగాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఆ విలన్ ని మన హీరో ఎలా ఎదిరించాడన్నది మిగతా కథ.

  వినటానికి బాగానే ఉంది కదా కథా అని ఫిక్సయి చూస్తే ఓ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సీన్లలలో ఉన్న స్పష్టత కథ,కథనంలో లేదని అదే దెబ్బ తీసిందని. కథలో తండ్రి పాత్ర ద్వారా నక్సలైట్ సమస్యను ఎత్తుకున్నట్లు చూపి ఆ వెంటనే దాన్ని వదిలేస్తాడు. అలాగే కట్నం సమస్యకు బలైన హీరోయిన్ ని చూపి దానికి పరిష్కారం చూపడు. అలాగే ప్రి క్లైమాక్స్ దాకా తండ్రి సిద్ధాంతాన్ని విభేదించి చివరలో అదే దారిలోకి వెళ్తాడు(పూర్తి స్ధాయి పోలీస్ ఆఫీసర్ కాకముందే..ఆయుధంతో విలన్స్ పై దాడి చేసి చంపుతాడు). అలా స్పష్టత లేకుండా సమస్యలను సెటప్ చేసి తనకు తోచినట్లు బాణంలా ముందుకు దూసుకుపోయాడు.దాంతో బాణం గురి తప్పినట్లే అయింది.

  అయితే మరి ఈ సినిమాను చూడటానికి ఏమన్నా ఆసక్తి ఉంటుందా అంటే..ఓ కొత్త దర్శకుడు తన తొలి ప్రయత్నాన్ని రెగ్యులర్ మసాలా కమర్షియల్ చిత్రం జోలికి పోకుండా దీన్ని నిజాయితీగా రూపొందించినందుకు అభినందించాలి. అయితే సుబ్రమణ్యపురం(తెలుగులో అనంతపురం) రేంజిలో ఊహించుకుని వెళ్ళటం అనవసరం. హీరోగా నారా రోహిత్ కూడా బాగానే చేసాడు. చాలా మంది పరిచయ హీరోల కన్నా బెటర్. హీరోయిన్ వేదిక, షాయాజి షిండే వంటి సీనియర్లు వంక పెట్టక్కర్లేని విధంగా నటించారు. కెమెరా చాలా బాగుంది. డైలాగులు కొన్ని కావాలని పేర్చినట్లున్నా సన్నివేశాలకు తగినట్లు ఇమిడాయి. అయితే దర్శకుడు స్నేహితులైన మణిశర్మ, మార్తాండ్ కె.వెంకటేష్ లు మాత్రం అన్యాయం చేసారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో చాలా సినిమాలకు వారు అద్బుతమైన పనితనం చూపారు. ఇక దర్శకుడు చైతన్య తన తర్వాత చిత్రానికైనా స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టి సరైన స్క్రిప్టు రూపొందించుకుంటే మంచి భవిష్యత్ గ్యారెంటీ. ఇక ప్రేక్షకులు ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళితే ఫరవాలేదనిపించే అవకాశం ఉంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X