»   » ‘కిల్లింగ్ వీరప్పన్’ను మళ్లీ తీయబోతున్న వర్మ, ఎందుకంటే..?

‘కిల్లింగ్ వీరప్పన్’ను మళ్లీ తీయబోతున్న వర్మ, ఎందుకంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కిల్లింగ్ వీరప్పన్' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇండియా ప్రేక్షకుల వరకు ఇది ఓకే కానీ..... ఇంటర్నేషనల్‌గా విడుదల చేయడానికి ఈ స్టాండర్డ్స్ సరిపోవని భావిస్తున్న వర్మ.... ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తగిన విధంగా ఈ చిత్రాన్ని మళ్లీ తెరకెక్కిస్తానంటున్నాడు. ఈ మేరకు అందుకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. వర్మ ప్రెస్ నోట్ వివరాలు ఇళా ఉన్నాయి...

‘వీరప్పన్ అనే వాడు ప్రపంచ నేర చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. ఎందుకంటే అతనొక టెర్రరిస్ట్ కాదు ఒక నెట్వర్క్ ఉండటానికి ... అలాగని రెబెల్ కాదు ఒక ఆర్గనైజేషన్ (సంస్థ) మద్దతు ఉండటానికి ... కేవలం ఒక మామూలు క్రిమినల్, అయిన 184 మందిని చంపాడు అందులో 96 మంది పోలీసులు. 1200 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పెర్మినెంట్గా వీరప్పన్ వేటకై 6000 చదరపు కిలోమీటర్ల ఉన్న అడవిలో నియమించబడ్డారు. తమ ధైర్య సాహసాలతో అత్యంత దారుణమైన పరిస్థితుల్ని సైతం లెక్కచేయకుండా శ్రమించినప్పటికి సుమారు 20 ఏళ్ళు పట్టింది అతణ్ణి పట్టుకోవటానికి.

వీరప్పన్ తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో ఎంతో మంది ఆఫీసర్స్ ని చంపాడు, ఎన్నో పారా మిలిటరీ ట్రక్స్ ని పేల్చేశాడు, ఇంఫార్మర్స్ తలలు నరికాడు, తన సొంత కూతురి ఏడుపు దగ్గరగా ఉన్న పోలిస్ టీమ్ కి వినపడుతుందన్న అనుమానంతో కూతురని కూడా చూడకుండ తల పగల కొట్టి చంపాడు. అసలు వీరప్పన్ ఉప్పెన లాంటి ఎదుగుదల ఎలా వచ్చింది ... దాన్ని అరికట్టలేకపోయిన సిస్టం యొక్క ఘోర వైఫల్యం .... ఆ తర్వాత ఒక అతి కిరాతకమైన వ్యూహం ద్వారా వీరప్పన్ ని ఎలా చంపారన్న అంశాల మీద ఈ కొత్త వీరప్పన్ చిత్రం నిర్మించబడుతుంది.

జీరో డార్క్ థర్టీ అనే హాలీవుడ్ చిత్రం కేవలం ఒసామా బిల్ లాడెన్ని ఎలా పట్టుకుని చంపారన్న దానిపై నిర్మించారు. అలా ఎందువల్లనంటే ఒసామా బిల్ లాడెన్ అనే వ్యక్తి ఎవరో, 9/11 సంఘటనకి కారణాలేంటో అన్న విషయాలు ప్రేక్షకులకి ముందే తెలుసునన్న ఉద్దేశంతో కేవలం అతన్ని చంపే వ్యూహాన్ని మాత్రమే చూపించారు. అదేవిధంగా నేను కిల్లింగ్ వీరప్పన్ని కన్నడలో చిత్రించినపుడు కేవలం "ఆపరేషన్ ఆఫ్ కిల్లింగ్ వీరప్పన్" మీదే దృష్టి పెట్టాను ... ఎందుకంటే కన్నడ ప్రజలకి వీరప్పన్ కి సంబంధించిన అన్ని విషయాలు ముందే తెలుసు కాబట్టి ....

కాని హిందీలో ఇదే వెర్షన్ ని రిలీస్ చేయటానికి నా మనసొప్పలేదు. ఎందుకంటే నా ఉద్దేశంలో జనాలకి వీరప్పన్ని ఎలా చంపారన్నదానికంటే ముందు అసలు వీరప్పన్ అంటే ఎవరో... అతనేం చేసి వీరప్పన్ అయ్యాడో తెలియాలి దక్షిణ భారతదేశంలో "కిల్లింగ్ వీరప్పన్" అనే సినిమా పెద్ద హిట్ అయ్యినప్పటికి ... నేను బలంగా అనుకునేదేంటంటే ఉత్తర భారతదేశంలోను అలాగే వేరే దేశాల్లో ఉన్న ప్రజలు ఈ చిత్రం చూసి అసంతృప్తి చెందుతారు. ఎందుకంటే దక్షిణంలో లాగా వీరప్పన్ గురించి వారికి పెద్దగా తెలియదు కాబట్టి .... నేను వీరప్పన్ కి సంబంధించిన పూర్తి కథని ‘కిల్లింగ్ వీరప్పన్'చూసిన ఒక దుబాయ్ బిజినెస్ మెన్ కి చెప్పినప్పుడు అతను ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతను ఖచ్చితంగా ఈ చిత్రం అంతర్జాతీయస్థాయిలో ఒక "జీవిత చరిత్రలా" తియ్యాలి కానీ వీరప్పన్ ని చంపటం అన్న ఒక్క విషయం మీదే చిత్రం పరిమితం కాకూడదని చెప్పాడు.

అతను తనతో పాటు వున్న ఒక అమెరికన్ పార్టనర్ కలిసి వీరప్పన్ జీవిత చరిత్ర మీద నాతో ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాళ్ళు నాకు పెట్టిన ఒకే ఒక షరతు ఈ చిత్రాన్ని నిర్మించే క్రమంలో నేను ఖర్చుకు వెనుకాడకుండా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించాలని కోరారు. అందుకనే అంతర్జాతీయస్థాయిలో నిర్మించనున్న ఈ వీరప్పన్ చిత్రం మళ్ళీ పూర్తిగా మొదటి నుండి చాలా మంది సరికొత్త నటులతో రిషూట్ చేస్తున్నాను. ఇది జీవిత చరిత్ర కావటం వల్ల కేవలం అతని చావుకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా, వీరప్పన్ ఎదుగుదల వెనుకనున్న కథను అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్సు అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులల్లో వైఫల్యం చెందారో చెప్పి ... తరువాత వీరప్పన్ చావు వెనక వున్న అత్యంత భీకరమైన వ్యూహరచనని చెప్పదలుచుకున్నాను. నేను తీయబోయే కొత్త వీరప్పన్ చిత్రంలోని కొన్ని దృశ్యాలు బి.ఎస్.ఎఫ్ సిబ్బంది విమానాల్లో నుండి లాండ్ అయ్యి అక్కడ నుండి కాన్వాయ్ ట్రక్కుల్లో అడవిలోని వివిధ ప్రదేశాల్లోకి ప్రయాణించడం అలాగే అసెంబ్లీ మరియు పార్లమెంట్ లలో వీరప్పన్ ని పట్టుకోవటంలో వైఫల్యం చెందుతున్న అంశం పై వేడి పుట్టించే చర్చలు చూపించడం... అంతేకాకుండా విదేశి జర్నలిస్టులు వీరప్పన్ పై రిసర్చ్ చేయటానికి, పుస్తకాలు రాయటానికి తరలిరావటం లాంటివి కూడా వుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ చిత్రంలోని ఎక్స్ ట్రీమ్ రియలిస్టిక్ ఎట్ట్మస్-ఫియర్ భారీ బడ్జెట్ ల హాలీవుడ్ చిత్రాలని తలపించేలా వుంటుంది. ఈ చిత్రంలోని మెకానికల్ ఎఫెక్ట్స్ కోసం అలాగే రియలిస్టిక్ గా కనిపించే కంప్యూటర్ గ్రాఫిక్స్ పై పనిచేయటానికి కొంతమంది విదేశి టెక్నిషియన్స్ ని పిలిపించడం జరుగుతుంది. చివరి మాటగా వీరప్పన్ జీవిత చరిత్ర మీద నిర్మించబోయే ఈ నా కొత్త ఇంటర్నేషనల్ చిత్రం నా కెరియర్ లో అంత్యంత ప్రత్యేకమైంది ... ఎందుకంటే వీరప్పన్ అనే కారక్టేరే అత్యంత ప్రత్యేకమైంది.
-రామ్ గోపాల్ వర్మ.

English summary
"Killing Veerappan" to be shot again as an international film, says Ram Gopal Varma.
Please Wait while comments are loading...