»   » సేఫ్‌ గేమ్‌ ఆడిన మాట నిజమే : వీరూపోట్ల

సేఫ్‌ గేమ్‌ ఆడిన మాట నిజమే : వీరూపోట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ :''ప్రపంచంలో ఇలాంటి కథ రాలేదు అని ఎప్పటికీ చెప్పను. అందరికీ తెలిసిన కథే. అయితే దాన్ని తెరపై చూపించడంలో కొత్తదనం ఉంది. హీరో... విలన్ ఇంట్లో చొరబడడం వరకూ పాత కథే. అయితే అక్కడ నడిపిన డ్రామా మాత్రం అందరికీ నచ్చింది. పాత జోకులే మళ్లీ వేస్తే జనం నవ్వరు. పాత కథ చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. కొత్తగా చెప్పాల్సిందే. అయితే కథ విషయంలో సేఫ్‌ గేమ్‌ ఆడిన మాట నిజమే. నేను చెప్పింది గొప్పకథ కాదు. అయితే పాత్రలను ప్రజెంట్ చేసే విషయంలో మాత్రం కొత్తదనాన్ని చూపించాను. అదే ప్రేక్షకులకు నచ్చుతోంది. చాలా మంది సినిమాను ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు'' అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు వీరూపోట్ల.

అలాగే ''వినోదం ఉంటే సినిమాని ఆస్వాదిస్తూ చూస్తారు. అయితే దానికి కథ తోడైతేనే ఆ వినోదానికి విలువ ఉంటుంది. ఆ రెండూ ఉన్నాయి కాబట్టే మా సినిమాని ఆదరిస్తున్నారు'' అంటున్నారు వీరూ పోట్ల. 'బిందాస్‌'తో ఆకట్టుకొన్న దర్శకుడీయన. నాగార్జునతో 'రగడ' చేశారు. ఇప్పుడు 'దూసుకెళ్తా' అంటూ మరోసారి వెండితెరపై వినోదాలు పంచే ప్రయత్నం చేసారు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా వీరూపోట్ల హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

''దసరా సెలవులు ముగిసిన తరవాత మా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు వసూళ్లు కాస్త నెమ్మదిగా ఉన్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ప్రతి థియేటర్లోనూ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రధమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చూసిన వాళ్లంతా చెబుతున్నారు. అయితే దానికి కారణం... ప్రధమార్థంలో సమర్థంగా కథ చెప్పగలగడమే. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, భరత్‌ వీళ్లు విష్ణుతో కలిసి పంచిన వినోదం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దానితో పాటు మానవ సంబంధాల విలువ అంతర్లీనంగా చెప్పాం. అందుకే మా ప్రయత్నాన్ని మెచ్చుకొంటున్నారు.

ఇది మనోజ్‌ కోసం రాసుకొన్న కథే అయినా... విష్ణు కోసం కొన్ని మార్పులు చేశాం. కానీ ఇద్దరూ ఇద్దరే. నటన విషయంలో ఏ ఒక్కరూ తగ్గరు. 'బిందాస్' సినిమా చేస్తున్నప్పుడే ఈ కథను మనోజ్‌కు చెప్పాను. అయితే ఆ తరువాత విష్ణు నటించిన 'దేనికైనాడీ' విడుదలైంది. మోహన్‌బాబుగారు ఈ కథవిని 'ఇది విష్ణుతో చేయెచ్చు కదా' అన్నారు. అలా మనోజ్ కోసం అనుకున్న కథను విష్ణుతో చేయడం జరిగింది అని చెప్పారు.

'దూసుకెళ్తా' అనే టైటిల్‌ పెట్టడం వెనుక 'డీ' సెంటిమెంట్‌ లేదు. యాదృచ్ఛికంగానే జరిగింది. ఈ టైటిల్ పెట్టడానికి కారణం రామజోగయ్యశాస్త్రి. ఆయన తనకు తెలిసిన వారి కోసం కొన్ని టైటిల్స్ అనుకున్నాడు. అందులో 'దూసుకెళ్తా' బాగుందని నాకు చెప్పడం జరిగింది. ఇందులోని హీరో పాత్రలో పంచ్ వుంది. అలాగే టైటిల్ ఎనర్జిటిక్‌గా వుందని భావించి టైటిల్ ఎలా వుందని విష్ణుకు చెప్పాను. చాలా బాగుంది భయ్యా అన్నాడు. అలా ఈ సినిమాకు 'దూసుకెళ్తా' అనే టైటిల్‌ను పెట్టడం జరిగింది.'' అన్నారు.

విష్ణుతో అనుకున్నపుడు అతని బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం. హీరోను బట్టి పాత్రను డిజైన్ చేస్తాం. యాక్షన్ బాగా చేయగలడనిపిస్తే యాక్షన్ కథ చేస్తాం. డైలాగ్స్ బాగా చెప్పగలడనిపిస్తే ఎక్కువ డైలాగ్‌లపై దృష్టిపెడతాం. అలాగే మనోజ్ కోసం అనుకున్న కథ కాబట్టి విష్ణు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. మనోజ్ చాలా ఎనర్జిటిక్‌గా వుంటాడు. విష్ణు కూడా అదే స్థాయి ఎనర్జితో ఈ సినిమా చేశాడు. మనోజ్ ఎంత బాగా నటించగలడో విష్ణు కూడా అంతే బాగా నటించగలడని ఈ సినిమాతో అర్థమైంది. విష్ణు ఇందులో చాలా కొత్తగా కనిపించాడు. రెండు విభిన్నమైన పార్శాలున్న పాత్రలో అద్భుతంగా నటించాడు. ఓ పక్క జిత్తులమారిగా కనిపిస్తూనే మరో పక్క సీరియస్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

తరువాతి సినిమాల గురించి చెబుతూ ''బిందాస్‌కి కొనసాగింపు చిత్రం ఉంటుంది. అయితే కథ ఇంకా సిద్ధం కాలేదు. స్టార్ హీరోల కోసం కథలు రాసుకొంటున్నా. ఎప్పటికైనా సంగీత నేపథ్యంలో ఓ ప్రేమకథ తీయాలనుకొంటున్నా. ప్రస్తుతం నా దృష్టంతా 'దూసుకెళ్తా' పైనే వుంది. ఇంకా కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. '' అన్నారు.

English summary
Director Veeru Potla says that his latest Film Doosukeltha gets good response.Doosukeltha is a 2013 Telugu film directed by Veeru Potla starring Vishnu Manchu. Lavanya Tripathi, who made her debut with Andala Rakshasi, is the leading lady in the movie and Mani Sharma composeed the tunes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu