twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ధన 51'సినిమా సమీక్ష

    By Staff
    |

    Dhana 51
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: ధన 51
    నటీనటులు: సుమంత్‌, సలోని, ముఖేష్‌ ఖన్నా, ధర్మవరపు సుబ్రమణ్యం, తనికెళ్ళ భరణి,
    రాజ్‌కుమార్‌, అలీ, కాంతారావు, ఢిల్లీ రాజేశ్వరి, రాధాకుమారి, గౌతంరాజు తదితరులు
    పాటలు: కందికొండ, భాస్కరభట్ల, రవికుమార్‌
    మాటలు: రవి
    సంగీతం: చక్రి
    స్టంట్స్‌: విజయ్‌
    సినిమాటోగ్రఫీ: ఎస్‌ అరుణ్‌ కుమార్‌
    నిర్మాత: ఎంఎల్‌ కుమార్‌ చౌదరి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌ సూర్యకిరణ్‌
    విడుదల తేదీ: 14-1-2005

    'సత్యం' సినిమాతో బ్రేక్‌ ఇచ్చిన సూర్యకిరణ్‌ దర్శకత్వంలో సుమంత్‌ నటించిన 'ధన 51' నిరాశ పరిచే చిత్రం. ఇడియట్‌ చిత్ర నిర్మాతలు ఈ సినిమాలో ఆ వాసనలు నింపి హిట్‌ కొట్టాలనుకోవడం నిరాశే అని తేలిపోయింది.

    కథ: ఓ కాలేజీలో ర్యాగింగ్‌ చేస్తూ ఆడపిల్లలను ఏడిపిస్తుంటారు సీనియర్స్‌. వారిని భరించలేక అసహాయ స్ధితిలో ధన (సుమంత్‌)ను ఆశ్రయిస్తారు జూనియర్స్‌. ధన వచ్చి అందరినీ చితకబాది పరిస్ధితి చక్కదిద్దుతాడు. కాలేజిలో అతని రోల్‌ నెంబర్‌ 51 కావడంతో సినిమా టైటిల్‌లో ఆ సంఖ్య వచ్చింది. అతను ఆ కాలేజి పాత విద్యార్ధి. అతని జీవితాశయం పోలీసు అధికారి కావాలని. కానీ లంచం ఇచ్చుకోలేక సెలక్టు కాలేకపోతాడు.

    ఓ రోజు ఆ కాలేజిలో కొత్తమ్మాయి చేరడం, ధన చూడడం, పరిచయం చేసుకోవడం అన్నీ జరిగిపోతాయి. ఆ అమ్మాయి పేరు లక్ష్మి (సలోమి). ఆ నగరానికి కొత్తగా బదిలీ అయి వచ్చిన పోలీసు కమిషనర్‌ మహేష్‌ చంద్ర( ముఖేష్‌ ఖన్నా) కూతురు. పనీ పాటా లేని హీరో స్నేహం పేరుతో ఆమెకు దగ్గరవుతాడు. అది స్నేహం కాదు ప్రేమ అన్న డౌటు ప్రేక్షకులకే కాదు ఆ అమ్మాయి తండ్రికి కూడా వస్తుంది. 'నువ్వు నగరంలో ఉన్న రౌడీలందరినీ పట్టిస్తే నీకు పోలీసు శాఖలో ఉద్యోగం ఇస్తా' అని ధనకు ఆఫర్‌ చేస్తాడు కమిషనర్‌. ధన సరేనని చెప్పి రౌడీలందరినీ పోలీసులకు పట్టిస్తాడు. 'నువ్వూ రౌడీవే, జీపు ఎక్కు' అని కమిషనర్‌ అనడంతో ధన నిర్ఘాంతపోతాడు. 'నా కూతుర్ని ప్రేమలో పడేశావు. నీ కెరియర్‌ను ప్రమాదంలో పడేస్తానను, రౌడీ ముద్రవేసి' అని కూడా కమిషనర్‌ అంటాడు. అప్పుడు ధన ఆవేశంగా ' ఇప్పటి వరకు నీ కూతురిపై అటువంటి ఆలోచన లేదు. ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను' అంటాడు. ఇంటర్వల్‌ బ్రేక్‌.

    సెకండాఫ్‌లో ఈ చిత్రంలో చిత్రాలు, విచిత్రాలు. ధనను పోలీసులు రౌడీల పునరావాస కేంద్రానికి తరలిస్తారు. అక్కడ మన హీరో రౌడీలందరిలో పరివర్తన తీసుకొస్తాడు. గోడలు దూకి హీరోయిన్‌ మనసులో దూరే ప్రయత్నం చేస్తాడు. అతను కోరుకున్న పోలీసు ఉద్యోగం ఏమైంది? కమిషనర్‌ కూతురిని అతను ప్రేమ కష్టడీలోకి తీసుకుంటాడా? అన్నది తెర మీద చూసి తెలుసుకోవచ్చు.

    ప్లస్‌ పాయింట్స్‌: కెమెరా పనితనం, కొన్ని చోట్ల దర్శకత్వ ప్రతిభ, సుమంత్‌ పడ్డ కష్టం, ముఖేష్‌ ఖన్నా నటన.

    మైనస్‌ పాయింట్స్‌: పాత 'ఇడియట్‌' కథనే మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించారు. సత్తా లేని మాటలు సినిమాను పేలవంగా మార్చాయి. పోలీసు ఆఫీసరు కావాలన్న లక్ష్యాన్ని ధన ఏర్పరచుకోడానికి కారణమేమిటో చూపకపోవడం, ఆ లక్ష్య సాధన దిశగా అతను కృషి చేయకుండా హీరోయిన్‌ చుట్టూ తిరగడంతో క్యారక్టరైజేషన్‌ వీక్‌ అయింది. కమిషనర్‌ స్ధాయి వ్యక్తి ఒక చిన్న స్ధాయి యువకుడితో రోడ్డున పడి ఛాలెంజ్‌ విసరడం అసహజత్వానికి పరాకాష్ట. హాస్యం అధమ స్ధాయిలో ఉంది. ప్రేమ-కెరీర్‌ల మధ్య ఘర్షణను తెరకెక్కిద్దామన్న దర్శకుడు వైఫల్య చిత్రమిది. నిర్మాతల ధనానికి నష్టం తెచ్చే సినిమా ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X