Paradha Movie Review: పరదా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, క్రిష్, రాగ్ మయూర్, గౌతమ్ వాసుదేవన్ మీనన్ తదితరులు
దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
రచన: ప్రవీణ్ కండ్రేగుల, పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పిడి
నిర్మాత: శ్రీనివాసులు పీవీ, విజయ్ దొంకాడ, శ్రీధర్ మక్కువ
సమర్పణ: శ్రీమతి భాగ్యలక్ష్మి పోస
మ్యూజిక్: గోపి సుందర్
సినిమాటోగ్రఫి: మృదుల్ సుజిత్ సేన్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల
బ్యానర్: ఆనంద మీడియా
రిలీజ్ డేట్: 2025-08-22
పడతి అనే గ్రామంలో మహిళలు పెళ్లి జరిగేంత వరకు ముఖం కనిపించకుండా పరదా ధరించాలనే ఆచారం ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన సుబ్బ లక్ష్మీ అలియాస్ సుబ్బ (అనుపమ పరమేశ్వరన్) తన చిన్ననాటి స్నేహితుడు రాజేశ్ (రాగ్ మయూర్)తో ప్రేమలో ఉంటుంది. వారిద్దరి నిశ్చితార్థానికి ముహుర్తం కూడా నిర్ణయిస్తారు. ఎంగేజ్‌మెంట్ రోజు ముఖంపై పరదా తొలగించిన సుబ్బ లక్ష్మీ ఫోటో పాపులర్ మ్యాగజైన్‌పై కవర్ పేజ్‌గా ప్రింట్ అవుతుంది. దాంతో గ్రామ కట్టుబాట్లను, ఆచారాలను ఉల్లంఘించందనే ఆరోపణలపై సుబ్బుకు ఆత్మాహుతి శిక్షను గ్రామ పెద్దలు అమలు చేస్తారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోడానికి సిద్దపడుతుంది. తన అనుమతి లేకుండా ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ (గౌతమ్ వాసుదేవ మీనన్)ను వెతుక్కొంటూ ధర్మశాలకు వెళ్తుంది.
పడతి గ్రామంలో శ్రీ జ్వాలాంబికా ఆలయం ప్రత్యేకత ఏమిటి? ఊరిలో మహిళలు ఎందుకు పరదా ధరించాలి అనే ఆచారం ఎందుకు మొదలైంది? సుబ్బలక్ష్మీ పరదా ఎందుకు తొలగించింది? సుబ్బు ఫోటోను ఫోటోగ్రాఫర్ ఏ పరిస్థితుల్లో తీశాడు? రాజేశ్‌తో నిశ్చితార్థం ఎలాంటి పరిస్థితుల్లో ఆగిపోయింది? ధర్మశాలకు వెళ్లడానికి సిద్దమైన సుబ్బుకు అండగా నిలిచిన రత్న (సంగీత), అమ్మీ (దర్శన రాజేంద్రన్) ఎవరు? చివరికి సుబ్బు ఆత్మాహుతి తప్పించుకొన్నదా? పరదా ఆచారాన్ని సుబ్బు ఎలా వ్యతిరేకించింది? ఊరిలో పరదా కట్టుబాటును ఎలా తొలగించింది? అనే ప్రశ్నలకు సమాధానమే పరదా సినిమా.

మహిళా చైతన్యం ప్రధానమైన పాయింట్‌గా ఎంచుకొన్న ప్రవీణ్ కండ్రేగుల కథను తొలి 20 నిమిషాలు అద్బుతంగా చెప్పారు. కథలోకి తీసుకెళ్లిన విధానం.. స్టోరీలో సమస్యను సృష్టించిన తీరు కూడా బాగుంది. అయితే సమస్యను పూరించడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేకపోయింది, సన్నివేశాలను బలంగా రాసుకోవడంలో విఫలమయ్యాడు. సినిమా ఆరంభమైన 20 నిమిషాల తర్వాత కథలో ఎలాంటి ఎమోషన్స్, ఇంట్రెస్ట్ కనిపించవు. సంగీత, దర్శన పాత్రల చేత చెప్పించిన డైలాగ్స్ బాగున్పప్పటికీ.. అవి బోధనలుగా మారి బోర్ కొట్టించే స్థాయికి వెళ్లాయి. అలా ఫస్టాఫ్ కొంత మేరకు ఫర్వాలేదనిపించే విధంగా ముగుస్తుంది.
ఇక సెకండాఫ్‌లోనైనా కథ ఉద్వేగభరితంగా ఉంటుందా? అని వేచి చూసిన వారికి నిరాశే కలుగుతుంది. సినిమా ద్వితీయ భాగం చాలా చప్పగా, నిస్తేజంగా.. సహనానికి పరీక్ష పెట్టేలా సాగుతుంది. ఇక క్లైమాక్స్‌లో కథను హడావిడిగా ముగించే ప్రయత్నం చేశారా? అనే సందేహం కలుగుతుంది. గ్రామాన్ని పట్టి పీడిస్తున్న భారీ సమస్యను సింపుల్‌గా ముగించడంతో సాధారణ సినిమాగా ముగించేలా చేసింది. సినిమా రిలీజ్‌కు ముందు క్రియేట్ అయిన హైప్ అందుకోలేకపోయిందనే అభిప్రాయం కలుగుతుంది.
ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్ ప్రతీ సీన్‌లో తన మార్కు నటనను ప్రదర్శించింది. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేసిన పాత్రల్లో సుబ్బలక్ష్మీ పాత్ర బెస్ట్ అనిపిస్తుంది. ఈ సినిమా కథను పూర్తిగా తన భుజాలపై మోసి.. సోల్ పెర్ఫార్మర్‌గా ఆకట్టుకొన్నారు. దర్శన కూడా ఈ సినిమాకు బలంగా మారింది. కొన్నీ సీన్లలో అనుపమతో పోటాపోటీగా నటించింది. సంగీత పాత్ర వినోదాన్ని, సెంటిమెంట్‌ను జోడించింది. మిగితా పాత్రలన్నీ కథలో భాగమయ్యాయి కానీ.. బలంగా మారలేకపోయాయి.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాను మరింత ఇంటెన్సిటీ మార్చడానికి గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సహకరించింది. పేలవమైన పలు సన్నివేశాలను ఆయన తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు. మృదుల్ సుజిత్ సేన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా కెమెరాలో బంధించాడు. ధర్మశాల టూర్ సీన్లు అద్బుతంగా ఉంటాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు వీక్ అవ్వడం వల్ల సినిమా స్లోగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. శ్రీనివాసులు పీవీ, విజయ్ దొంకాడ, శ్రీధర్ మక్కువ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా.. సమాజాన్ని ఆలోచింపజేసే ఇంటెన్స్ పాయింట్‌తో రూపొందిన సినిమా పరదా. అయితే పేలవమైన సన్నివేశాలు, బలహీనమైన కథ కారణంగా పూర్తి స్థాయిలో తెర మీద పండలేకపోయిందనిపిస్తుంది. కానీ అనుపమ, సంగీత, దర్శన ముగ్గురు ఈ సినిమా కొంత మేరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఒపెనింగ్, క్లోజింగ్ మినహాయిస్తే.. మధ్యలో సాగే సన్నివేశాల గురించి దర్శకుడు ప్రవీణ్ ఇంకాస్త ఆలోచించి.. ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేసి ఉంటే.. డెఫినెట్‌గా మంచి ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాగా మారిపోయేది. ప్రవీణ్ కండ్రేగుల ఆలోచన బాగుంది.. ఆచరణలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. మహిళా సమస్యలపై సినిమాలను, అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











