»   » గుడ్డూ రంగీలా : సరదాగా నవ్వించే సీరియస్ కామెడీ

గుడ్డూ రంగీలా : సరదాగా నవ్వించే సీరియస్ కామెడీ

Posted By: Lakshmisurya
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

రివ్యూ : లక్ష్మీ S కుకునూర్

నటీనటులు : ఆర్షద్ వర్సి, అమిత్ సాద్. అదితి రావు హైదరి, రోనిత్ రాయ్ తదితరులు

రచయిత&దర్శకుడు: సుభాష్ కపూర్
నిర్మాణం : ఫాక్స్ స్టార్ స్టూడియోస్&మంగళ్ మూర్తి ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణం

చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ బ్రతకటానికి పోరాడుతూ వారికి నచ్చినట్లు బ్రతుకుతూ ఉండే ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాల్లోకి ఒకమ్మాయి రావటం, ఆ అమ్మాయి రావటం తో ఇబ్బందులు ఎదురవటం.. వాటి నుండి పడుతూ లేస్తూ బయటపడటం .. ఇలాంటి ఫార్ములా కధలు బాలీవుడ్ లో సాధారణంగా పలకరిస్తూనే ఉంటాయి. ఈ బాటలో తాజాగా సుభాష్ కపూర్ దర్శకత్వంలో ఆర్షద్ వార్సి, అమిత్ సాద్, అదితిరావు హైదరీ లు ప్రధాన పాత్రల్లో నటించిన ‘గుడ్డూ రంగీలా' వచ్చింది. ప్రేక్షకులను శుక్రవారం పలకరించిన సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

అసలు విషయం :
పార్ట్ టైం ఆర్కెస్ట్రా సింగర్లుగా పని చేసే గుడ్డూ (అమిత్ సాద్) రంగీలా (ఆర్షద్ వార్సి)లు శ్రీమంతులు ఉండే ఏరియాల్లో రెక్కి చేసి డబ్బులున్న వారి లాకర్లు గురించిన సమాచారాన్ని స్థానికంగా ఉండే గూండాలకు చేరవేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ చేతులకు నేరమనే మట్టి అంటకుండా దోచుకోవటం అనే దారిలోకి వెళ్ళకుండా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. లంచగొండి పోలిస్ ఆఫీసర్ అజయ్ సింగ్(అమిత్ సైల్) ఇద్దరినీ అరెస్టు చేసి పెద్దమొత్తం లో డబ్బులు అడుగుతాడు. రౌడీలకు పోలీసులకు తేడా ఏముందని ఆలోచనలో ఉన్న వీరికి పోలిస్ ఇన్ఫార్మర్ గోరా బెంగాలీ (దివ్యేందు భట్టాచార్య) 10 కోట్లు వచ్చే కిడ్నాప్ డీల్ తో కలుస్తాడు. డబ్బు కోసం బెంగాలీతో చేతులు కలపటం తో వీరి జీవితాల్లోకి లోకల్ ఎమ్మెల్యే (పరువు హత్యల స్పెషలిస్ట్) బిల్లు పహిల్వాన్(రోనిత్ రాయ్) అతని మరదలు బేబీ (అదితి రావు)లు వస్తారు.
వారి రాక వారి జీవితాల్లో ఎటువంటి కుదుపులను తీసుకొచ్చిందనేది మిగిలిన కధ.

Review on Guddu Rangeela hindi film

చెప్పుకోవలసినవి:
‘గుడ్డూ రంగీలా' ఈ మధ్య కాలం లో వచ్చిన ఇష్క్ జాదే, బాస్, ఎన్ హెచ్ 10 కోవలో పరువు హత్యల నేపధ్యానికి చెందిన యాక్షన్ క్రైమ్ కామెడీ చిత్రం. సీరియస్ విషయానికి కామెడీ ని జోడించి తీయాలనుకోవటమే దర్శకుడు సాధించిన మొదటి విజయం గా చెప్పుకోవాలి. ముఖ్యంగా సినిమాలో హాస్యం గురించి చెప్పుకోవాలి. నిన్న రాత్రి అమ్మవారి నుండి ఈ మెయిల్ వచ్చిందనే జాగరణ పాట సీన్ , పోలీస్ అధికారి-గుడ్డూల మధ్య అంతాక్షరి వంటి కామెడీ సీన్లు బాగా నవ్విస్తాయి. గ్యాంగ్ స్టర్ ఎందుకు అవ్వలేం అని అడిగే పర్ఫెక్ట్ పోకిరి గుడ్డూ , మర్డర్లు మన కప్పులో టీ కాదు అని చెప్పే రంగీలా సీరియస్ నెస్, కిడ్నాప్ డీల్ ని అప్పగించే బెంగాలీ స్పాంటేనియస్ టైమింగ్ , బబ్లీ అమ్మాయి బేబీ గా అదితి రావు నటన, నెగటివ్ రోల్ లో రోనిత్ రాయ్ డాషింగ్ పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.

ఉండకూడనివి :
ఎంచుకున్న కధాంశం బలమైనదే అయినా సబ్ ప్లాట్స్ గా ఎంచుకున్న పాయింట్ల ప్లేస్ మెంట్ కుదరకపోవటం తో గందరగోళం గా అనిపిస్తుంది.ఈ మధ్య వస్తున్న చాలా హిందీ సినిమాల్లో లానే సంభాషణల్లో వల్గారిటీ ఎక్కువగా తొంగి చూడటం తో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లి ఎలకల ఆటగా మొదలైన సినిమాకి అంత భారీ క్లైమాక్స్ మ్యాచ్ అయిందనిపించదు. దర్శకుడు మహిళా పాత్రలకు ఇంకొంచెంప్రాముఖ్యత ఇచ్చి ఉండాల్సింది.

ఫలితం :
సామాజిక అంశాలకు కామెడీని జోడించి తీసిన ఫస్ గయా రే ఒబామా, జాలీ ఎల్ఎల్ బీ ల తరువాత అదే బాటలో గుడ్డూ రంగీలా తో మరొక సక్సెస్ సాధించాడు. సమాజంలో పరువు హత్యలు అనే సీరియస్ ఎలిమెంట్ ను అర్ధవంతంగా చూపించి ఆలోచింప చేసాడు. పరువు హత్యలకు గురయిన వారి దృష్టి కోణం లోకి వెళ్లి సినిమా చూస్తే మనలో ఆలోచన ఆవేశం కలుగుతాయి. నటీనటులు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసి సినిమాని నిలబెట్టారు. గుడ్డూ రంగీలా పాత్రల మధ్య షోలే టైప్ బాండింగ్ కామెడీ టైమింగ్ ఈ వీకెండ్ లో నవ్వుకుంటూ చూడగలిగే సినిమాగా నిలిచింది.

English summary
Comedy mixed entertainer Guddu Rangeela Hindi Film may attract audiance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu