twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సగటు 'యువకుడు'

    By Staff
    |

    Yuvakudu
    -సౌమిత్‌
    బ్యానర్‌: గ్రేట్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: సుమంత్‌, భూమిక, జయసుధ,
    ఆలీ, వేణుమాధవ్‌, ప్రసాద్‌బాబు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్‌
    నిర్మాతలు: నాగార్జున, సుధాకర్‌రెడ్డి
    సంగీతం: మణిశర్మ, కెమెరా: బాలసుబ్రహ్మణ్యం

    సుమంత్‌ హీరోగా 'తొలిప్రేమ' ఫేమ్‌ కరుణాకరన్‌ దర్శకత్వంలో నాగార్జున, సుధాకర్‌ రెడ్డి నిర్మించిన 'యువకుడు' చిత్రం గొప్ప అంచనాలతో 18వ తేదీన విడుదలయింది. సినిమా చివరి అరగంటలో యువకుడి లక్ష్యమేమిటో తెలుస్తుంది. అయితే, దీన్ని సినిమా ప్రారంభం నుంచి సరైన పద్ధతిలో ఎస్టాబ్లిష్‌ చేయకపోవడం వల్ల ప్రేక్షకులు కొద్దిగా అయోమయానికి గురయ్యే ప్రమాదం ఏర్పడింది. కానీ, వినోద ప్రధానమైన సన్నివేశాలు ఆకట్టుకునే తీరులో వుండడంతో ప్రేక్షకులు ఆ విషయం గమనించకుండా సినిమాలో లీనమవుతారు. ప్రథమార్థం అంతా సరదాగా నడుస్తుంది. ద్వితీయార్థంలో సగభాగం గందరగోళంగా వుండి చివర్లో మళ్లీ పట్టుగా నడుస్తుంది.

    కథకు వస్తే శివ (సుమంత్‌) ఆర్మీ ఆఫీసరు కొడుకు. యుద్ధంలో ఆయన మరణిస్తాడు. తల్లి పద్మావతి (జయసుధ) తాను ఊటీలో వుంటూ కొడుకు శివను హైదరాబాద్‌లో చదివిస్తుంటుంది. తండ్రి లాగే తాను ఆర్మీ ఆఫీసరు కావాలనుకుంటాడు శివ. మూడు సార్లు సెలెక్ట్‌ కాలేకపోతాడు. ఓ సారి ఊటీ వెళ్లినపుడు సింధు (భూమిక)ను చూస్తాడు. ఆమె తన మనస్సులో చెరగని ముద్ర వేస్తుంది. ఒకానొక సంఘటనతో జయసుధకు, సింధుకు మధ్య పరిచయం ఏర్పడి సాన్నిహిత్యం పెరుగుతుంది. సింధు పద్మావతిపై అభిమానాన్ని పెంచుకుంటుంది. అయితే, పెళ్లి చేసుకుందామని శివ పెట్టిన ప్రతిపాదనను సింధు తిరస్కరిస్తుంది. తన కొడుకు పెళ్లి చేయడానికే హైదరాబాద్‌ వచ్చానని చెప్పిన పద్మావతిని ఎంతో అభిమానించిన సింధు ఆమె కొడుకు తననే ప్రేమిస్తున్నాడని తెలుసుకుని పెళ్లికి అంగీకరిస్తుంది. పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న తగాదాల మధ్య తనపై శివకు గల ప్రేమను సింధు అర్థం చేసుకుని 'ఐ లవ్‌ యూ' అని చెప్పుతుంది. అయితే, తాను ఆర్మీకి సెలెక్ట్‌ కాకుండా తల్లే అడ్డుపడుతోందని శివ తెలుసుకుంటాడు. తల్లితో మాట మాట పెరిగి ఆర్మీ ట్రయినింగ్‌కు వెళ్తాడు శివ. శివ వెళ్లడం సింధుకు కూడా ఇష్టం వుండదు. ఆమె అత్తతోనే వుండిపోతుంది.

    కొద్ది రోజుల తర్వాత మద్రాసు వెళ్తున్నానని చెప్పి సింధు ఢిల్లీ వెళ్లి శివను కలుసుకుంటుంది. ఈ విషయం తెలిసిన పద్మావతి తనకెవరూ లేరని హతాశురాలై ఊటీకి తిరుగు పయనం కడుతుంది. విషయం తెలిసి సింధు అత్తను వెంబడిస్తుంది. కోయంబత్తూరు వరకు వెళ్లిన పద్మావతి అక్కడ బాంబుపేలుళ్లు జరగడంతో గాయపడినవారిని పరామర్శించడానికి వెళ్తుంది. అక్కడ సింధును చూస్తుంది. ఈ లోగా బాంబులను తీసేయడానికి ఆర్మీ వస్తుంది. సమర్థవంతంగా బాంబులను తొలగించి ఆర్మీ విజయవంతమవుతుంది. దీనికి నాయకత్వం వహించిన శివను అందరూ అభినందిస్తుంటే అందరితో పాటు తానూ సెల్యూట్‌ చేయడంతో సినిమా ముగుస్తుంది.

    ఏ సన్నివేశానికి ఆ సన్నివేశాన్ని చక్కగా డీల్‌ చేసిన దర్శకుడు కరుణాకరన్‌ సినిమా మొత్తంగా చూస్తే తాను అనుకున్నది సగం మాత్రమే ప్రజెంట్‌ చేశాడనిపిస్తుంది. పాట చిత్రీకరణ క్యాచీగా లేకపోవడం డ్రా బ్యాక్‌గా చెప్పుకోవాలి. సినిమాలో చెప్పుకోవాల్సింది సుమంత్‌ నటన. తాత అక్కినేని నాగేశ్వరరావును అనుకరిస్తూ సుమంత్‌ చేసిన అభినయం అందరికీ గుర్తుండిపోతుంది. నటనలోను, డ్యాన్స్‌లోను ఈజ్‌ చూపించాడు. సింధుగా భూమిక నటన ఫరవాలేదు. తల్లి సెంటిమెంట్‌ను జయసుధ అద్భుతంగా పండించింది. వేణుమాధవ్‌, అలీల కామెడీ సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణ.

    సంగీత దర్శకుడు మణిశర్మ రీ-రికార్డింగ్‌లో చూపించిన ప్రతిభ పాటల విషయంలో చూపించలేదేమో అనిపిస్తుంది. కెమెరామన్‌ బాలసుబ్రహ్మణ్యం ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. నిర్మాతలు ఖర్చు చేసిన ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది. చిత్రం క్లయిమాక్స్‌లో బాంబులను ఏరివేయడానికి ఢిల్లీ నుంచి శివ అనే కుర్రాడు వచ్చాడట అని చెప్పించడం ఎబ్బెట్టుగా వుంది. మొత్తం మీద 'యువకుడు' సినిమా సుమంత్‌ రేంజ్‌ను పెంచేదిగాను, దర్శకుడు కరుణాకరన్‌ రేంజ్‌ను తగ్గించేదిగాను వుంది. సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడు 'బాగుంది' అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడే తప్ప బ్రహ్మాండంగా వుందన్న ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X