యాంకర్ సుమ ఫిలాసఫీ.. సంసారం సాఫీగా ఉండాలంటే ..
Anchor Suma: యాంకరింగ్‌కి సింబల్‌గా మారిన పేరు "సుమ కనకాల". ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాతృభాష మలయాళం అయినా, తెలుగు భాషను అంత చక్కగా నేర్చుకుని, తన మాటల మాంత్రికతతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా యాంకరింగ్ రంగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న సుమ ఇప్పటికీ అదే ఉత్సాహంతో వేదికను కుదిపేస్తూనే ఉన్నారు. తాజాగా తన సక్సెస్ మాంత్రం చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
సుమ కెరీర్ ప్రారంభంలో పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. "వేయిపడగలు" సీరియల్‌తో ఆమె టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత "మేఘమాల" సీరియల్‌లో నటిస్తూ ఉన్న సమయంలో రాజీవ్ కనకాలతో పరిచయం, ప్రేమ, చివరకు పెళ్లి జరిగింది. నటిగా కెరీర్ మొదలుపెట్టిన సుమ, యాంకరింగ్ వైపు మలుపు తిరిగిన తర్వాత మాత్రం తిరిగి వెనక్కి చూడలేదు. ఆమె యాంకరింగ్ స్టైల్, స్పాంటేనియస్, మాట్లాడే తీరు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

చిన్న స్క్రీన్ అయినా, పెద్ద సినిమా ఈవెంట్ అయినా యాంకర్ సుమ ఉంటే ఆ వేదిక మొత్తం సందడిగా మారిపోవాల్సిందే. టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, యూట్యూబ్ ప్రోగ్రామ్స్ అన్నీ సుమ చేతిలోనే సాఫీగా సాగుతుంటాయి. ఆమె ఒక్క షోకే రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, సినిమా ఈవెంట్లకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తారని సినీ వర్గాల సమాచారం. డిమాండ్ బట్టి ఈ మొత్తం ఇంకా పెరుగుతుందని టాక్.
తాజాగా సుధీర్ బాబు నటించిన జటాధర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించింది సుమ. సాధారణంగా అందరినీ ఇంటర్వ్యూ చేసే సుమను, ఈ సారి నటి అలేఖ్య రివర్స్‌గా ఇంటర్వ్యూ చేయడం ఆసక్తికరంగా మారింది. అలేఖ్య సరదాగా "ఆన్‌లైన్ స్క్రీన్ ఏ షోలో చూసినా మీరే, ఆఫ్‌లైన్ ఈవెంట్ ఏదైనా చూసినా మీ శ్రీవారే.ఇండస్ట్రీని మీరే దున్నేస్తారా? మాలాంటి వారికి ఛాన్స్ ఇవ్వరా?" అంటూ అడిగింది. దీనికి సుమ సమాధానమిస్తూ, "సంసారం సాఫీగా సాగాలంటే మొగుడు, పెళ్లాం ఇద్దరూ బిజీగా ఉండాలి. అప్పుడు గొడవలు ఉండవు. ఇదే మా సక్సెస్ మంత్రం. నువ్వు కూడా ఇదే ఫాలో అవ్వు!" అని చెప్పడంతో ప్రేక్షకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
సుమ తన యాంకరింగ్ పట్ల ఉన్న ప్యాషన్ గురించి కూడా చెప్పింది. "నాకు సాయంత్రం అయ్యిందంటే చేతిలో మైక్ లేకపోతే కాళ్లు చేతులు వణుకుతాయి. కచ్చితంగా స్టేజ్ ఎక్కి యాంకరింగ్ చేయాల్సిందే. మా ఆయన అయితే ఏదో ఒక షోలో తిరుగుతూ ఉంటారు. ఇద్దరం బిజీగా ఉన్నప్పుడు గొడవలకు టైమ్ ఉండదు," అంటూ సరదాగా చెప్పింది. తన వ్యాఖ్యల్లో ఉన్న హాస్యం, నిజాయితీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమ మాట్లాడిన "మొగుడు-పెళ్లాం బిజీగా ఉంటే గొడవలు ఉండవు" అనే డైలాగ్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఈ వ్యాఖ్యను ఫ్యామిలీ లైఫ్ సీక్రెట్ అంటూ షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











