Bigg Boss 15 Winner: టైటిల్ గెలిచిన తేజస్వీ.. హిందీ బిగ్ బాస్‌లో సంచలన రికార్డు నమోదు
దేశ వ్యాప్తంగా ఉన్న బుల్లితెరలపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా రూపొందిన దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని సక్సెస్ అయింది. అందుకే ఏకంగా 15వ సీజన్ వరకూ వచ్చింది.
ప్రస్తుత సీజన్ కొత్త కొత్త ప్రయోగాలతో సాగింది. ఇక, ఊహించని పరిణామాలతో సాగిన ఈ సీజన్ ఫినాలేలో.. ఊహించని ఫలితం వస్తుందని అనుకుంటే.. టైటిల్ ఫేవరెటే విజేతగా నిలిచింది. దీంతో హిందీ బిగ్ బాస్‌లో సంచలన రికార్డు నమోదైంది. ఆ సంగతులు మీకోసం!

ఎన్నో అనుమానాల నడుమ మొదలు
కోవిడ్ ప్రభావంతో ఈ సారి అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అయ్యే అవకాశాలు లేవని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ షో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందుకోసం షో నిర్వహకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే కంటెస్టెంట్లను క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు వైద్య పరమైన ఎన్నో సదుపాయాలను సమకూర్చారు.

హిందీ బిగ్ బాస్ కోసం చాలా ప్రత్యేకం
వరుసగా పద్నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్. గత అక్టోబర్ 2వ సీజన్ 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం అయింది. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా చేశాడు. కరోనా ప్రభావంతో 15వ సీజన్ కోసం షో యూనిట్ ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఈ సీజన్ చాలా ప్రత్యేకమైన అంశాలతో ప్రారంభం అయింది.

సరికొత్తగా... వాళ్లను కూడా తీసుకొచ్చి
15వ సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగానే కొంత మంది కొత్త పాత కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చారు. అంతేకాదు, ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపారు. అలాగే, ఇంటిని మెయిన్ హౌస్, జంగిల్ హౌస్, వీఐపీ జోన్ వంటి భాగాలుగా చేశారు. అలాగే, గేమ్‌లలో కూడా వైవిధ్యాన్ని చూపిస్తూ షోను ఆసక్తికరంగా నడిపించారు.

ఫినాలేకు చేరిన ఐదుగురు సభ్యులు
122 రోజుల పాటు సాగిన 15వ సీజన్ ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో 16 మందితో పాటు మరో 8 మంది వైల్డ్ కార్డ్ మెంబర్లతో కలిపి మొత్తంగా 23 మంది ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, వీరి నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు తేజస్వీ ప్రకాశ్, ప్రతీక్ సెహజ్‌పాల్, కరణ్ కుంద్రా, షమితా శెట్టి, నిషాంత్ భట్ ఫినాలేలో అడుగు పెట్టారు.

10 లక్షలతో ఔట్... చివరి స్థానాలకు
ఆదివారం బిగ్ బాస్ 15వ సీజన్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరిగింది. సల్మాన్ ఖాన్ అదిరిపోయే హోస్టింగ్‌తో పాటు పలువురు సెలెబ్రిటీల పెర్ఫార్మెన్స్‌ల నడుమ ఇది సందడిగా సాగింది. ఐదుగురు ఫైనలిస్టులలో కొరియోగ్రాఫర్ నిషాంత్ భట్ రూ. 10 లక్షలు తీసుకుని ఐదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ నటి షమితా శెట్టి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.

బిగ్ బాస్ విన్నర్ తేజస్వీ.. వాళ్లిద్దరూ
ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ 15వ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన తేజస్వీ ప్రకాశ్ విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ. 40 లక్షలు ప్రైజ్‌మనీ గెలుచుకుంది. అయితే, చివర్లో గట్టి పోటీ ఇచ్చిన సెన్సేషన్ ప్రతీక్ సెహజ్‌పాల్ మాత్రం రన్నరప్‌గా మిగిలిపోయాడు. ఇక, తేజస్వీ బాయ్‌ఫ్రెండ్ మరో ఫైనలిస్టు కరణ్ కుంద్రా మూడో స్థానంలో ఉండిపోయారు.
Recommended Video

హిందీ బిగ్ బాస్‌లో సంచలన రికార్డ్
హిందీలో బిగ్ బాస్ 15 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇందులో తాజా సీజన్‌లో లేడీ కంటెస్టెంట్ తేజస్వీ విజయం సాధించడంతో సంచలన రికార్డు నమోదైంది. దీనికి కారణం అక్కడ ఈమెతో కలిసి ఏకంగా 8 మంది మహిళా కంటెస్టెంట్లు విజేతగా నిలిచారు. మిగిలిన సీజన్లలో అంటే ఏడుగురు మగ కంటెస్టెంట్లు విజేతలుగా ఉన్నారు. ఇలా ఏ భాషలోనూ లేడీ డామినేషన్ కనిపించలేదు.


Click it and Unblock the Notifications











