బాహుబలిని శ్రీదేవి రిజెక్ట్ చేసింది అందుకే.. రాజమౌళిపై భగ్గుమన్న బోని కపూర్
శ్రీదేవి.. అందానికే పర్యాయ పదంలా నిలిచిన నటి. తన అందం, అభినయంతో భారతీయ సినీ పరిశ్రమను మకుటం లేని మహారాణిలా ఏలారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటీమణుల్లో ఒకరిగా శ్రీదేవి చరిత్రలో నిలిచిపోయారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి అలరించారు. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోయి కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టారు. ఆమె చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేని పరిస్ధితుల్లో అభిమానులు ఉన్నారు. బతికున్న రోజుల్లో శ్రీదేవి కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూకట్టేవారు.
శివగామి పాత్ర కోసం శ్రీదేవితో భేటీ
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్‌లో నిజానికి శ్రీదేవి నటించాల్సి ఉంది. ఇందులోని రాజమాత శివగామి దేవి పాత్రను శ్రీదేవితో చేయించాలని రాజమౌళి ఎంతో ప్రయత్నించారు. కానీ అనివార్య కారణాలతో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. బాహుబలిలో శ్రీదేవి నటించకపోవడం వెనుక పలు కారణాలు తెరమీదకి వచ్చాయి. తాజాగా ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ దీనిపై స్పందించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

బాహుబలితో పాన్ ఇండియా కల్చర్
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. ఈ సినిమాతోనే పాన్ ఇండియా కల్చర్ మొదలైంది.. దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌పై దండెత్తి హిందీ పరిశ్రమ పునాదులను కదిలించాయి. బాహుబలి తర్వాతి నుంచి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని చెప్పుకోవడం మొదలైంది. బాహుబలి వేసిన బాటలో ఆర్ఆర్ఆర్, కార్తీకేయ 2, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను కుమ్మిపడేశాయి.
శివగామి దేవిగా రమ్యకృష్ణ శివతాండవం
ఈ చిత్రంలోని ప్రతి పాత్ర బలమైనదే.. అయితే ప్రభాస్, అనుష్క, రానాలకు ధీటుగా బలమైన పాత్ర మాత్రం రాజమాత శివగామి దేవిదే. ఈ పాత్రను పోషించిన రమ్యకృష్ణ.. తనం అందం, రాజసం, అభినయంతో శివగామి పాత్ర కోసమే ఆమె పుట్టిందా అన్నంతగా ఒదిగిపోయారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఐకానిక్ పాత్రలలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. అయితే ఈ రోల్ కోసం తొలుత అతిలోక సుందరి శ్రీదేవిని రాజమౌళి సంప్రదించి కథ కూడా చెప్పారు. కానీ ఆమె 10 కోట్ల రూపాయల పారితోషికం, హోటల్‌లో ఒక ఫ్లోర్, విమాన టికెట్లు కావాలని అడగటం వల్లే శ్రీదేవిని పక్కనపెట్టినట్లు రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.
అంతా బాహుబలి నిర్మాతల వల్లే
దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్పందించారు. శివగామి పాత్ర కోసం శ్రీదేవిని రాజమౌళి సంప్రదించాలని అనుకున్న మాట నిజమే. ఇంటికి వచ్చి మరి కథ చెప్పారు.. ఈ పాత్రపై శ్రీదేవి కూడా మక్కువ పెంచుకోవడంతో ఆమెపై ఆయనకు మరింత గౌరవం పెరిగింది. అయితే బాహుబలిలో శ్రీదేవి చేయకపోవడానికి కారణం ఈ చిత్ర నిర్మాతలే. రాజమౌళి కథ చెప్పి వెళ్లిన తర్వాత.. నిర్మాతలు మా ఇంటికి వచ్చి రెమ్యునరేషన్ గురించి బేరసారాలు ఆడేవారు. అయితే అప్పటికే తీసుకుంటున్న దాని కంటే కూడా తక్కువ పారితోషికం ఇస్తామని ఆఫర్ చేశారు. శ్రీదేవి నటిస్తే బాహుబలికి హిందీలో హైప్ వస్తుందని తెలిసి కూడా ఇలా చేశారని.. అందుకే నా భార్య బాహుబలి నుంచి తప్పుకుందని బోనీ కపూర్ స్పష్టం చేశారు.
రాజమౌళికి మాపై చాడీలు
అయితే మా ఇంట్లో జరిగిన విషయాన్ని రాజమౌళికి, ఈ చిత్ర నిర్మాతలు మరోలా చెప్పారని బోనీ అన్నారు. హోటల్‌లో ఫ్లోర్ బుక్ చేయాలని అడిగిన మాట నిజమేనని, ఎందుకంటే ఆ సమయంలో మా పిల్లలు చిన్నవాళ్లని.. అలాగే పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా పెద్ద షెడ్యూల్స్ ప్లాన్ చేయొద్దని కోరామని బోనీ అంగీకరించారు. వాటికి నిర్మాతలు ససేమిరా అనడంతో శ్రీదేవి ఆ పాత్ర చేయనని చెప్పేసిందని.. దాంతో నిర్మాతలు ఆమెపై లేనిపోనివి రాజమౌళికి చెప్పారని బోనీ కపూర్ తెలిపారు. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుండగా.. బోనీ వ్యాఖ్యలపై రాజమౌళి, బాహుబలి నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











