Deepika Padukone: కల్కి 2 నుంచి దీపిక పదుకొనె ఔట్.. వైజయంతి మూవీస్ సంచలన నిర్ణయం
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపిక పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో ఆకట్టుకున్న ఆ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ప్రస్తుతం చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బిజీగా ఉంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కల్కి 2 సెట్స్ మీదకి ఎప్పుడు?
కల్కి 2898 ఏడీకి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. అలాగే సెకండ్ పార్ట్‌లోనూ కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయినట్లుగా ఇప్పటికే తెలిపారు. దీంతో కల్కి 2 ఎప్పుడు ప్రారంభిస్తారని నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్‌లను ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటి తర్వాత కల్కి 2ని సెట్స్ మీదకి తీసుకొస్తారా? లేక ముందే కల్కి 2ని ప్లాన్ చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.

కల్కి 2 షూటింగ్ తేలిక కాదు
కొద్దిరోజుల క్రితం నాగ్ అశ్విన్ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మాట్లాడుతూ.. కల్కి 2 షూటింగ్ అనుకున్నంత తేలిక కాదన్నారు. ఇందులోని నటీనటులకు పలు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయని, వారందరికీ వీలు కుదిరినప్పుడే షూటింగ్ ప్లాన్ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని.. వీటిని షూట్ చేయడానికి ఎంతో టైం పడుతుందని, ఒక్క మాటలో చెప్పాలంటే కల్కి 2 రిలీజ్ గురించి నాకే ఏమీ తెలియదని తేల్చేశారు. కల్కి 2898 ఏడీలో నటించిన నటీనటులంతా ఎంతో బిజీగా ఉన్నారని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరిలో కల్కి 2 సెట్స్ మీదకి వెళ్లొచ్చని నాగ్ అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే షూటింగ్‌ని వేగంగా పూర్తి చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు టైం తీసుకుంటాయని, రిలీజ్ కావాలంటే రెండు, మూడేళ్లు పడుతుందని అశ్విన్ చెప్పారు.
కల్కి 2 నుంచి తప్పుకున్న దీపికా పదుకొనె
గతంలో కల్కి 2 గురించి అశ్వినీదత్ మాట్లాడుతూ.. సెకండ్ పార్ట్ మొత్తం కమల్ హాసన్ చుట్టూనే తిరుగుతుందని తెలిపారు. ప్రభాస్, కమల్, అమితాబ్ మధ్య ఎక్కువ సీన్లు ఉంటాయని.. వీరితో పాటు దీపిక క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. కల్కి 2 పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న దశలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కల్కి 2898 ఏడీలో సుమతి పాత్రలో అద్భుతంగా నటించిన బాలీవుడ్ నటి దీపిక పదుకొనె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 18న ట్వీట్ చేసింది.
సుమతి పాత్రలో ఎవరు?
ఎంతో ఆలోచించిన తర్వాత తాము ఓ నిర్ణయానికి వచ్చామని.. కల్కి 2లో దీపిక పదుకొనె భాగం కావడం లేదు. కల్కి 2898 ఏడీలో ఆమెతో ప్రయాణం చేసినప్పటికీ, పార్ట్ 2లో మాత్రం దీపిక భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీమ్‌తో కల్కి పార్ట్ 2 మీ ముందుకు వస్తుందని.. దీపిక భవిష్యత్తులో మరిన్ని సినిమాలతో అలరించాలని ఆకాంక్షింస్తున్నామని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. దీంతో ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దీపిక పదుకొనె ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారు? వైజయంతీ మూవీస్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని చర్చించుకుంటున్నారు. మరి దీపిక స్థానంలో ఎవరు సుమతిగా నటిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











