కూలీతో బ్రెయిన్ ఫ్రై.. లోకేష్ ఎందుకీ నరకం.. ఫ్యాన్ లేఖ వైరల్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని నాగార్జున విలన్‌గా నటించగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించారు. వార్ 2 వంటి మరో క్రేజీ సినిమా రిలీజ్ అయినప్పటికీ రజనీకాంత్ డామినేట్ చేశారు. తన ఛరిష్మా, మాస్ ఫాలోయింగ్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. తొలి రోజు రికార్డ్ ఓపెనింగ్స్ కొట్టిన రజనీకాంత్.. రెండు రోజుల్లోనే 200 వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు. ఈ వీకెండ్‌లోగా పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకురావాలనే ఊపులో తలైవా ఉన్నాడు.
అంచనాలు అందుకోని కూలీ
అయితే కూలీకి ఎన్ని ప్రశంసలు దక్కుతున్నప్పటికీ అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్‌ని రజనీ, నాగార్జున, అమీర్ ఖాన్ అభిమానులు ఆడుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా మరో భాషా అవుతుందని నాగార్జున అన్నారు. అలాగే భాషాలో ఆంటోనీ పాత్ర రేంజ్‌లో నాగార్జున పోషించిన సైమన్ రోల్ ఉంటుందని.. నాకే ఈ పాత్ర వేయాలని అనిపించిందని ఓ రేంజ్‌లో కూలీకి హైప్ తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా తాను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో లేదని ఓ అభిమాని సోషల్ మీడియాలో కూలీ సినిమాను రివ్యూ చేశాడు. ఈ మేరకు లోకేష్ కనగరాజ్‌కు పెద్ద లేఖ రాశాడు.

నా బ్రెయిన్ ఫ్రై అయ్యింది
'డియర్ లోకేష్ కనగరాజ్.. నేను చివరి ఆట చూసి తెల్లవారుజామున 2 గంటల 40 చివరనిమిషాలకు ఇంటికి చేరుకున్నా.కళ్లు మండుతున్నా.. బ్రెయిన్ ఫ్రై అయినా చివరి వరకు కుర్చీలోనే ఉన్నా. చివరి సన్నివేశమైనా గట్టెక్కిస్తుందని ఆశపడ్డా. ఇప్పటి వరకు నీ సినిమాలు చూస్తూ వచ్చిన నేను క్లైమాక్స్‌లో ఖచ్చితంగా ఏదో ఒక మేజిక్ జరుగుతుందని అనుకున్నా. కానీ శుభం కార్డ్ తర్వాత అంతా సైలెంట్‌గానే ఉంది. నేను ఇంకా గంట పాటు అక్కడే ఎందుకున్నానో అర్ధం కాలేదు' అని ఆ అభిమాని రాసుకొచ్చాడు.
నాకు కూలీ కనెక్ట్ కాలేదు
'ఎందుకంటే నువ్వు ఒక ఖైదీ, ఒక విక్రమ్ సినిమాలు మాకు ఇచ్చావ్. ఎందుకంటే ఇప్పటికీ ప్రేక్షకుల్ని మా నగరం సినిమాను చూడమని చెబుతూనే ఉంటా. లియో, మాస్టర్ చిత్రాలు నాకు అంతగా నచ్చవు. కానీ గతంలో నువ్వు డైరెక్ట్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈసారి మాత్రం కూలీ నాకు ఏమాత్రం కనెక్ట్ కాలేదు. కూలీలో రజనీకాంత్ నటించిన కొన్ని మూవ్‌మెంట్స్ రిలీజ్‌కు ముందే చప్పట్లు కొట్టేలా ఉన్నాయి. కానీ నేను ఆశించిన విధంగా కథ, కథనం లేదు. నా సమయానికి, నేను ఇష్టపడే సినిమాకు న్యాయం చేస్తావని నిన్ను నమ్మా' అని ఆ యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
నిజమైన కూలీని నేనే
'ఓ అభిమానిగా థియేటర్‌కు వచ్చా.. కానీ ఒట్టి చేతులతో బయటికొచ్చా. ఆనందం లేకపోగా 3 గంటల సమయం వెచ్చిస్తే నాకు ఎలాంటి లాభం లేదు. అప్పుడే నాకు తట్టింది.. నేను కూలీని చూడటం లేదు. నేనే కూలీని.. ఆశను, కృషిని, నిరాశను మోసుకున్నాను.. ఇప్పటికీ మోస్తూనే ఉన్నాను' అని ఆ అభిమాని ముగించాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రజనీ అభిమానులు, లోకేష్ కనగరాజ్ అభిమానులు దీనిని షేర్ చేస్తున్నారు. మరి అభిమానుల ట్రోలింగ్ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











