రూ. 2 కోట్ల పరువునష్టం దావా.. చిక్కుల్లో షారుఖ్ ఖాన్..
Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షారుఖ్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తన 35 ఏళ్ల కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకుని సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ బాద్ షా గుర్తింపు పొందారు. ఆరుపదుల వయస్సుకు చేరువుతున్న యంగ్ హీరోలతో పోటీపడుతూ ధీటుగా నటిస్తున్నారు. వరుస హిట్స్ అందుకుంటూ సక్సెస్ ట్రక్ లో దూసుకెళ్తున్నారు. ఇలాంటి స్టార్ ఫ్యామిలీ చట్టపరమైన వివాదాల వలయంలో చిక్కుకుంది. ఇంతకీ ఏం జరిగింది?
స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నటుడుగా కాకుండా దర్శకుడుగా మారిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంతో "ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్"అనే వెబ్ సిరీస్ తో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఆ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే.. ఈ షో ఓ పెద్ద చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. ఈ షోలో తన ప్రతిష్టను దెబ్బతీసేలా, తప్పుడు ప్రచారం చేశారనీ, పరువు నష్టం కలిగించారని ఆరోపిస్తూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

కేసు నేపథ్యం
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)అధికారి సమీర్ వాంఖడే పిటిషన్ ప్రకారం.. ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన "ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్" వెబ్‌సిరీస్‌లో తనను పోలి ఉన్న వ్యక్తిని నార్కోటిక్స్ ఆఫీసర్ పాత్రలో తప్పుగా చూపించినట్లు ఆయన ఆరోపించారు. ఈ పాత్ర 2021లో జరిగిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసును పోలిన దాడి సన్నివేశంలో చూపించారనీ, యాంటీ డ్రగ్ ఎన్‌పోర్స్‌మెంట్ ఏజెన్సీలను నెగటివ్ పాత్రలో చూపించినట్లు పేర్కొన్నారు. ప్రజా వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయే పద్దతిలో ఆ సిరీస్ రూపొందించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంతో ఆ సిరీస్ నిర్మాతలు షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్ యాజమాన్యంలోని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్, అలాగే నెట్‌ఫ్లిక్స్ పై వాంఖడే పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో రూ. 2 కోట్ల నష్టపరిహారం కోరుతూ, ఆ మొత్తం మొత్తాన్ని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వాలని కోర్టుకు తెలిపారు.
వివాదాస్పద సన్నివేశాలు
ద బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌లో "సత్యమేవ జయతే" అని పలికిన తర్వాత ఒక పాత్ర మిడిల్ ఫింగర్ చూపించే సన్నివేశం ఉందని, ఇది దేశ గౌరవానికి అవమానం అవుతుందని వాంఖడే ఆరోపించారు. ఈ సన్నివేశం జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, 1971ను ఉల్లంఘించిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. అదేవిధంగా, ఈ సిరీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారత శిక్షాస్మృతి (BNS)లోని పలు సెక్షన్లను ఉల్లంఘిస్తోందని, అశ్లీలతను ప్రోత్సహిస్తూ ప్రజల్లో చట్ట అమలు సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని వాంఖడే ఆరోపించారు.
వివాదానికి మూలం
అక్టోబర్ 2, 2021న, సమీర్ వాంఖడే నేతృత్వంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) టీం ముంబై తీరంలోని ఒక క్రూయిజ్ షిప్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై దాడి చేసింది. ఆ సమయంలో, ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరూ చట్టం కింద అరెస్ట్ చేశారు. అయితే, విచారణలో వారిపై బలమైన ఆధారాలు లేవని తేలడంతో, తరువాత ఆర్యన్ ఖాన్‌పై ఉన్న అన్ని ఆరోపణలను తొలగించారు. కోర్టు ఆయన పాస్‌పోర్ట్‌ను కూడా తిరిగి ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ కేసు ఇప్పటికీ బాంబే హైకోర్టు, ముంబై NDPS ప్రత్యేక కోర్టులో విచారణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ద్వారా తనను తప్పుగా చూపించడం పరువు నష్టం కింద వస్తుందని సమీర్ వాంఖడే స్పష్టం చేశారు. ఈ కేసు షారుఖ్ ఖాన్ కుటుంబం, ముఖ్యంగా ఆర్యన్ ఖాన్‌పై మరోసారి వివాదాలు చెలరేగేలా చేసింది. బాలీవుడ్‌లోనే కాకుండా, చట్టపరంగా కూడా ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











