»   » అదిరిపోయే రేటుకు 'లడ్డుబాబు' శాటిలైట్ రైట్స్

అదిరిపోయే రేటుకు 'లడ్డుబాబు' శాటిలైట్ రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిన్న సినిమాలు శాటిలైట్ రైట్స్ ఛానెల్స్ తీసుకోవటం లేదని అంటున్నారు కానీ..నిజానికి మార్కెట్ లో క్రేజ్ ఉన్న చిత్రాలని చిన్నా, పెద్దా చూడకుండా శాటిలైట్ రైట్స్ ని ఛానెల్స్ పోటీపడి మరీ పెద్ద మొత్తాలు ఇచ్చి మరీ కొంటున్నాయి. తాజాగా 'లడ్డుబాబు' చిత్రం శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానెల్ 3.25 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. అల్లరి నరేష్ చిత్రాల్లో ఈ స్ధాయి శాటిలైట్ రేటు రావటం రికార్డే అంటున్నారు. కాబట్టి రిలీజ్ కు ముందు సినిమాకు క్రేజ్ తీసుకురాగలిగితే బిజినెస్ దానంతట అదే జరుగుతుందని ఇది తేల్చి చెప్పిందని ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కస్ చేసుకుంటున్నారు.

ఇక అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం 'లడ్డుబాబు'. పూర్ణ, భూమిక హీరోయిన్స్. రవిబాబు దర్శకత్వం వహించారు. త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌ నిర్మాత. ఈనెల 18న 'లడ్డుబాబు'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. చిత్రం సెన్సార్ కూడా పూర్తైంది. చిత్రానికి యు సర్టిఫికేట్ ఇచ్చారు. దాదాపు పదేళ్ల తర్వాత రవిబాబు, నరేష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడం, నరేష్ లుక్ వినూత్నంగా ఉండటం ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే మంచి చిత్రం అందించాలనే లక్ష్యంతో త్రిపురనేని రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.నరేష్ పాత్రకు సంబంధించిన మేకప్ కోసమే ఆయన భారీగా ఖర్చు పెట్టారు.

Laddu Babu gets a huge satellite price

నరేష్ మాట్లాడుతూ... "పేరులో బాబు ఉంది. కానీ... ఆకారం చూస్తే భీమ్‌ బోయ్‌లా ఉంటాడు. వయసు 25. బరువు మాత్రం అంతకు పదింతలు. నడుము చుట్టుకొలత కొలవడానికి మీటర్లు సరిపోవు. కిలోమీటర్లు కావాలి. అతని సైజుకు బుల్లెట్లు కాదు.. బుల్డోజర్లు వాడాలి. వెంటనే బరువు తగ్గిపోదాం అనుకొని సైక్లింగ్‌ మొదలెట్టాడు.. ఒక్క తొక్కు తొక్కాడో లేదో.. ఫెడళ్లు ఫడేల్‌మన్నాయి. లాంగ్‌ జంప్‌ చేశాడు. అక్కడో అగాథం ఏర్పడింది. రన్నింగ్‌ మొదలెడితే వాతావరణ శాఖ 'భూకంపం వచ్చింద'ని భయపడిపోయింది. ఇదీ లడ్డుబాబు పడిన.. సారీ పెట్టిన కష్టాలు. మరి అవెంత తమాషాగా సాగాయో తెలియాంటే మా సినిమా చూడండి.." అంటున్నారు నరేష్‌.


నిర్మాతలు మాట్లాడుతూ ''భారీకాయంతో నరేష్‌ పంచే వినోదాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆ అవతారం కోసం నరేష్‌ చాలా శ్రమించారు. రవిబాబు ఆలోచనలు ఎంత భిన్నంగా ఉంటాయో ఈ చిత్రం మరోసారి నిరూపిస్తుంది. రవిబాబు సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. తొలి చిత్రం 'అల్లరి'లో వినోదాన్ని వినూత్నంగా ఆవిష్కరించి, ఓ ట్రెండ్ సృష్టించారు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, తాజా చిత్రం 'లడ్డూబాబు' మరో ఎత్తు అనే చెప్పాలి. 'అల్లరి' చిత్రంలో బక్కపలచని నరేష్ ని చూపించిన రవిబాబు 'లడ్డూబాబు'లో భారీకాయుడిగా చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం విదేశీ నిపుణులు నరేష్ కి మేకప్ వేశారు. మేకప్ చేయడానికి కొన్ని గంటలు పట్టడం మాత్రమే కాదు.. తీయడానికి కూడా ఎక్కువ సమయం పట్టింది'' అన్నారు.

భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే: సత్యానంద్, మాటలు: నివాస్, పాటలు: భాస్కరభట్ల, ఆర్ట్: నారాయణరెడ్డి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, రచన-దర్శకత్వం: రవిబాబు, నిర్మాత: త్రిపురనేని రాజేంద్ర.

English summary
Allari ‘Laddu Babu’ film’s satellite rights fetched a big price. Zee Telugu offered the film approximately Rs 3.25 Crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu