twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్స్...ఫ్లాఫ్స్: 'ఎవడు' నుంచి 'మనం‌' దాకా

    By Srikanya
    |

    హైదరాబాద్: జనవరిలో 'ఎవడు', కొద్ది రోజుల క్రితం 'రేసుగుర్రం‌', ఇప్పుడు 'మనం‌' .. వసూళ్ల తడాఖా చూపించాయి..చూపిస్తున్నాయి.'అంతా బాగుంది' అనుకోవడానికి లేదు. అలాగని మరీ డీలా పడిపోవాల్సిన పనిలేదు. మధ్యలో భరోసా పెంచుకొన్న సినిమాలు కొన్ని నిరాశపరిచాయి. బాక్సాఫీసు దగ్గర అనూహ్యమైన విజయాలేం దక్కలేదు. గతేడాదిలా చిన్న సినిమాల మెరుపుల్లేవు. అయితే హిట్ అవుతాయనుకున్న చిత్రాలు మాత్రం బొక్క బోర్లా పడ్డాయి. ఓకే అనుకున్నవి మెల్లిగా పికప్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించిపెట్టాయి. కొన్ని టేబుల్ ప్రాఫెట్ తో నిర్మాతకు అండగా నిలిస్తే, మరికొన్ని డిస్ట్రిబ్యూటర్స్ కు ఆనందం కలిగించాయి.

    అలాగే ఈ మధ్య కాలంలో డబ్బింగ్‌ సినిమాల ఆటలు సాగలేదు. 'ట్రాఫిక్‌', 'భద్రం' చిత్రాలు ఓకే అనిపించుకొన్నాయి. చిన్న సినిమాలు చాలా విరివిగా విడుదలైనా.. ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోలేకపోయింది. ఎక్కువగా ప్రేమ, కాలేజీ అల్లర్ల నేపథ్యంలోనే సినిమాలు తెరకెక్కాయి. పరిమిత బడ్జెట్‌లో సినిమాని తీసినా.. అందులో నాణ్యతను చూపిస్తున్నారు. అయితే.. కథ, కథనాల విషయంలో వేస్తున్న తప్పటడుగుల వల్ల వాటికి జనాదరణ లభించడం లేదు.

    ఎన్నికలు రెండు నెలలు సినిమా పరిశ్రమని దారుణంగా దెబ్బ కొట్టాయి. పెద్ద సినిమాలు విడుదల తేదీలు మార్చుకునే స్ధితికి తీసుకు వచ్చాయి. అయితే అదే సమయంలో చిన్న చిత్రాలకు ఈ సమయం ఊరట కలిగించింది. ఖాళీగా ఉన్న థియోటర్లలోకి దర్జాగా వచ్చాయి. అయితే వచ్చినంత వేగంగా వెళ్లిపోయాయనేది వేరే సంగతి.

    ఈ ఐదు నెలల్లో దాదాపు డబ్బై సినిమాలు పై మాటే విడుదలయ్యాయన్నది చలన చిత్ర వాణిజ్య మండలి చెబుతున్న లెక్క. సినిమా పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని.. పెద్ద నిర్మాతలే చెబుతున్నారు. ఎవరి కారణాలు వాళ్లవి. కానీ ప్రతీవారం సినిమాలైతే వస్తూనే ఉన్నాయి. అందులో ప్రేక్షకుల మనసుని గెలుచుకొన్నవి అరుదుగా కనిపిస్తున్నాయి.

    ఈ ఐదు నెలల ప్రయాణం ఒడుదొడుకులుగా సాగినా భవిష్యత్తులో మాత్రం మంచి విజయాలొస్తాయన్న భరోసా దొరికింది. ఈ ఐదు నెలల ఫలితాలు ఇవీ...

    ఎవడు

    ఎవడు

    ఈ ఏడాది సంక్రాంతి నిరుత్సాహంగా గడిచింది. 'ఎవడు', 'వన్‌' సినిమాల ధాటికి మిగిలిన చిత్రాలు బరి నుంచి తప్పుకొన్నాయి. 'ఎవడు' చిత్రం మాస్‌ ప్రేక్షకులకు నచ్చింది. వాణిజ్యపరంగా బాగానే గిట్టుబాటైంది.

    ప్రశంసలే కాని ఫలితం లేదు

    ప్రశంసలే కాని ఫలితం లేదు

    మహేష్ 'వన్‌'కి విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ సినిమా చూసి అగ్ర దర్శకులంతా శెభాష్‌ అంటూ ట్వీట్‌లు చేశారు. అయితే వాణిజ్యపరంగా మాత్రం 'వన్‌' నిరాశపరిచింది.

    మంచు ముంచింది

    మంచు ముంచింది

    అదే జనవరి నెలలో మరో రెండు సినిమాలొచ్చాయి. మంచు కుటుంబం 'పాండవులు పాండవులు తుమ్మెద' అంటూ వినోదం పంచే ప్రయత్నం చేసింది. వారి ఆశలు నెరవేరలేదు.

    జస్ట్ ఓకే..

    జస్ట్ ఓకే..

    ఆ తరవాత నితిన్‌ - పూరి జగన్నాథ్‌ల కలయిక 'హార్ట్‌ ఎటాక్‌' తెప్పించింది. మాస్‌ ప్రేక్షకులకు, యువతరానికీ ఈ చిత్రం బాగానే నచ్చింది. దీంతో యావరేజ్‌ చిత్రంగా నిలిచింది.

    పైసా, ఆహా కల్యాణం

    పైసా, ఆహా కల్యాణం

    ఫిబ్రవరిలో నాని హంగామా చేశాడు. ఆయన నటించిన మూడు చిత్రాలు ఒకే నెలలో వస్తాయన్న ప్రచారం తొలుత జరిగింది. అయితే 'పైసా', 'ఆహా కల్యాణం' మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రెండు సినిమాలూ నిరాశపరిచాయి. 'పైసా'లో కృష్ణవంశీ శైలి లోపిస్తే... 'బ్యాండ్‌ బాజా బారాత్‌' రీమేక్‌.. 'ఆహా కల్యాణం'లో అతకలేదు.

    'భీమవరం బుల్లోడు'

    'భీమవరం బుల్లోడు'

    సునీల్‌ ఈసారి 'భీమవరం బుల్లోడు'గా నవ్వులు పంచాడు. బీ, సీ సెంటర్లలో ఈ చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి. కాని అనుకున్నంత హిట్ కాలేదు. సునీల్ కు పెద్ద ప్లస్ కాలేదు.

    లెజండ్

    లెజండ్

    ఆ తరవాత 'లెజెండ్‌' వరకూ బాక్సాఫీసు దగ్గర మెరుపుల్లేవు. విడుదలైన రోజు నుంచే బాలకృష్ణ చిత్రానికి భారీ వసూళ్లు దక్కాయి. హౌస్‌ఫుల్‌ బోర్డులతో థియేటర్లు కళకళలాడాయి. 'సింహా' రికార్డులను ఈ చిత్రం బద్దలు కొడుతోంది..' అంటూ చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసారు. అనుకున్నట్లుగానే హిట్ అయ్యింది.

    రౌడీ

    రౌడీ

    రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రౌడీ చిత్రం ఓకే అనిపించుకుంది కానీ భాక్సాఫీస్ వద్ద గెలవలేకపోయింది. మోహన్ బాబు నటన అమోఘం అన్నారు కానీ థియోటర్ కి వెళ్లి చూడటానికి ఎవరూ సాహసించలేదు.

    డబ్బింగ్ డబ్బా

    డబ్బింగ్ డబ్బా

    మురుగదాస్‌ నిర్మాతగా వ్యవహరించిన 'రాజా రాణి'కి ఎంత ప్రచారం కల్పించినా ఫలితం దక్కలేదు. నయనతార, ఆర్య కాంబినేషన్ బాగుందని టాక్ వచ్చినా జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

    పాపం విశాల్

    పాపం విశాల్

    విశాల్‌ 'ధీరుడు' కూడా వచ్చిన దారినే వెళ్లిపోయింది. గత కొంతకాలంగా హిట్ కు మొహం వాచిన విశాల్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఫలించలేదు.

    హృదయ కాలేయం

    హృదయ కాలేయం

    నెట్ జనుల హీరో సంపూర్ణేష్ బాబు చిత్రం మంచి పబ్లిసిటీతో వచ్చి, టాక్ బాగానే తెచ్చుకుంది. అయితే ఫేస్ బుక్ టచ్ ఉన్నవారికి తప్ప మిగతా వారికి ఇది పట్టలేదు. దాంతో నష్టం రాకపోయినా పెద్దగా లాభాలు సైతం సాధించలేకపోయిందీ చిత్రం. కానీ దర్శకుడుకి, హీరోకి ఇది లాంచింగ్ ప్యాడ్ గా బాగా ఉపయోగపడింది.

    రేసు గుర్రం

    రేసు గుర్రం

    అల్లు అర్జున్ తన అభిమానులను ఆనందపరిచేలా రేసుగుర్రం అంటూ దిగాడు. మార్నింగ్ షోకి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తర్వాత ఓ రేంజిలో పికప్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో బ్రహ్మానందం చేసిన హడావిడి ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యి..ఈ సంవత్సరం పెద్ద హిట్ గా నమోదైంది.

    ప్రతినిధి

    ప్రతినిధి

    హిట్ కు మొహం వాచిన నారా రోహిత్ ని ఊరట పరుస్తూ ,ఎలక్షన్ సీజన్ ని క్యాష్ చేసుకుంటూ ఈ చిత్రం థియోటర్లలో దిగింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బడ్జెట్ లిమిట్ గా ఉండటంతో బాగానే పే చేసింది.

    అనామిక

    అనామిక

    శేఖర్ కమ్ముల చిత్రాలకు మొదట నుంచి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటూ వస్తున్నారు. ఆయన తాజాగా కహాని రీమేక్ తో దిగారు. నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం మాత్రం భాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చెయ్యలేక చతికిల పడింది.

    కొత్త జంట

    కొత్త జంట

    అల్లు శిరీష్,మారుతి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా వర్కవుట్ అయ్యిందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఈ సినిమా హిట్టైతే మారుతి రేంజి వేరుగా ఉండేది.

    లడ్డు బాబు

    లడ్డు బాబు

    అల్లరి నరేష్ చిత్రాలకు మినిమం గ్యారెంటీ ప్రేక్షకులు మొదటి నుంచీ ఉంటూ వస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన వరస ఫ్లాపులను ఎదుర్కోవటం ఈ సినిమాకు ఓపినింగ్స్ సైతం రాలేదు. అలాగే చిత్రం కూడా ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది.

    మనం

    మనం

    అక్కినేని కుటుంబ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. మల్టిప్లెక్స్ లు హౌస్ ఫుల్ అవుతున్న ఈ చిత్రం ఏమేరకు సక్సెస్ అనేది ఈ సోమవారం నుంచి తెలియనుంది. అయితే విదేశాల్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావటం టీమ్ ని ఉత్తేజపరుస్తోంది.

    విక్రమ్ సింహా

    విక్రమ్ సింహా

    ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న ఈ డబ్బింగ్ చిత్రం అందరూ మొదటి నుంచి ఊహిస్తున్నట్లే రజనీకాంత్ కి ఫ్లాఫ్ చిత్రంగా మిగిలిపోయింది. యానిమేషన్ చిత్రంలో రజనీని ఊహించుకోలేకపోవటంతో ఓపినింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది.

    English summary
    It has a been quite an exciting year so far at the mid point with almost all the top stars having a release each barring one. Let’s have a look at the results of the films released so far this year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X