twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, మహేష్ లేక అనుష్క..ఎవరు గెలుస్తారు?

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమా భాషలో చెప్పాలంటే 2014 ఫస్టాఫ్ లో ( ప్రథమార్ధంలో) ‘1 నేనొక్కిడినే'‘ఎవడు', ‘లెజెండ్‌', ‘రేసుగుర్రం', ‘మనం', ‘అల్లుడు శీను', ‘దృశ్యం', ‘రభస' వంటి పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. భారీ బడ్జెట్ లతో వచ్చిన ఈ సినిమాలలో ఎక్కువ శాతం హిట్ కావటంతో ఇండస్ట్రీ ఊపిరిపీల్చుకుంది.

    ఇక ‘హార్ట్‌ ఎటాక్‌', ‘భీమవరం బుల్లోడు', ‘కొత్తజంట' వంటి మధ్య తరహా బడ్జెట్‌ సినిమాలు, ‘హృదయ కాలేయం', ‘ప్రతినిధి', ‘ఊహలు గుసగుసలాడే', ‘గీతాంజలి' వంటి చిన్న సినిమాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. అయితే విడుదలకు ముందు క్రేజ్‌ని రేకెత్తించి, కమర్షియల్ గా ఫ్లాపైన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

    ఈ ఏడాది ఏ ఒక్క వారమూ సినిమా విడుదల కాకుండా ఖాళీగా వెళ్లలేదు. ఆసక్తికరమైన విషయమేమంటే ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రాని పవన్‌కల్యాణ్‌, రవితేజ వంటి మాస్‌ స్టార్లు, ఇప్పటికే ఓసారి పలకరించిన మహేశ్‌, రాంచరణ్‌, వెంకటేశ్‌ వంటి టాప్‌ స్టార్లు, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ వంటి కొత్త హీరోలు ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

     ఆగడు

    ఆగడు

    దర్శకుడు: శ్రీను వైట్ల, విడుదల: సెప్టెంబర్‌ 19

    పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాది ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్టుల్లో అగ్ర స్థానం. ‘దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మహేశ్‌, శ్రీను వైట్ల కాంబినేషన్‌ సినిమా కావడమే దీనికి కారణం. పైగా మహేశ్‌ జోడీగా తొలిసారి తమన్నా నటిస్తుండటం, శ్రుతిహాసన్‌ ఓ పాటలో మహేశ్‌తో స్టెప్పులేయడం అదనపు ఆకర్షణలు. ‘1.. నేనొక్కడినే' సినిమాతో నటునిగా అందరి ప్రశంసలు పొందినా, వాణిజ్యపరంగా చేదు అనుభవాన్ని చూసిన మహేశ్‌ ఈ సినిమాతో తన బాక్సాఫీస్‌ స్టామినాని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

    పవర్‌

    పవర్‌

    దర్శకుడు: బాబీ, విడుదల: సెప్టెంబర్ 12

    ‘బలుపు' సినిమాకు రచయితగా పనిచేసిన బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) చెప్పిన కథ నచ్చడంతో అతడి దర్శకత్వంలోనే ఈ సినిమా చేస్తున్నాడు రవితేజ. ‘విక్రమార్కుడు' తర్వాత ఆయన ‘పవర్‌'ఫుల్‌ పోలీసాఫీసర్‌ రోల్‌ చేస్తోంది ఇప్పుడే. చక్కని చుక్క హన్సిక మొదటిసారి రవితో జోడీకట్టిన ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అలరించడం ఖాయమని యూనిట్‌ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.

    గోవిందుడు అందరివాడేలే

    గోవిందుడు అందరివాడేలే

    దర్శకుడు: కృష్ణవంశీ, విడుదల: అక్టోబర్‌ 1

    ఎన్టీఆర్‌తో ఎనిమిదేళ్ల క్రితం చేసిన ‘రాఖీ' తర్వాత ఓ పెద్ద స్టార్‌ హీరోతో కృష్ణవంశీ తీస్తున్న సినిమా కావడంతో సహజంగానే దీనిపై అందరి దృష్టీ పడుతోంది. ఇప్పటికే ‘ఎవడు'తో సంక్రాంతి విజేతగా నిలిచి ఈ ఏడాది భారీ విజయాన్ని అందించిన రాంచరణ్‌ తొలిసారి చేస్తోన్న ఫ్యామిలీ డ్రామా ఇదే. ఆయన బాబాయ్‌గా శ్రీకాంత్‌, తాతయ్యగా ప్రకాశ్‌రాజ్‌ నటిస్తుండటం ఈ సినిమాకి మరింత ఆకర్షణను తెస్తోంది. ‘మగధీర', ‘నాయక్‌' సినిమాలతో హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న రాంచరణ్‌, కాజల్‌ అగర్వాల్‌ మూడోసారి జంటగా నటిస్తుండటం మరో ఆసక్తికర అంశం.

    ఒక లైలా కోసం

    ఒక లైలా కోసం

    నాగచైతన్య హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే' ఫేం విజయకుమార్‌ కొండా రూపొందిస్తున్న ‘ఒక లైలా కోసం'. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. చిత్రాన్ని మంచి రిలీజ్ డేట్ చూసి విడుదల చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారు.

    పండగ చేస్కో

    పండగ చేస్కో

    రామ్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని రూపొందిస్తున్న ‘పండగ చేస్కో'. బలుపు వంటి హిట్ తర్వాత అదే దర్శకుడుతో వస్తున్న చిత్రం కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ లేదు.

    లౌక్యం

    లౌక్యం

    గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'లౌక్యం'. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా టీజర్ ని ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చిత్రం రిలీజ్ డేట్ కూడా ప్రకటించి,పబ్లిసిటీ పెంచారు.

    ముకుందా

    ముకుందా

    నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘కొత్త బంగారులోకం', ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాల తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్ట్‌ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ సైతం ఈ మధ్యనే విడుదలై మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రం సైతం ఈ సంవత్సరమే విడుదల కానుంది.

    రుద్రమదేవి

    రుద్రమదేవి

    దర్శకుడు: గుణశేఖర్‌, విడుదల: డిసెంబర్‌
    ఇదివరకే ‘అరుంధతి'గా తెలుగువాళ్లను అమితంగా ఆకట్టుకొని, వాళ్ల హృదయాల్లో చెరగని ముద్రవేసిన అనుష్క ఇప్పుడు ‘రుద్రమదేవి'గా తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతోంది. అనుష్క జోడీగా రానా కనిపించనున్న ఈ సినిమాలో గోన గన్నారెడ్డిగా ఒక ప్రత్యేక, కీలక పాత్రలో అల్లు అర్జున్‌ నటిస్తుండటం ఈ సినిమాకి మరింత ప్రత్యేకతను చేకూర్చింది. 2003లో వచ్చిన ‘ఒక్కడు' తర్వాత మరో విజయాన్ని రుచిచూడని గుణశేఖర్‌ ఈసారి చారిత్రక ఇతివృత్తాన్ని ఎంచుకొని చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉన్నాడు.

     కరెంట్‌ తీగ

    కరెంట్‌ తీగ

    దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి,
    విడుదల: అక్టోబర్‌

    నిరుడు ‘పోటుగాడు'గా మెప్పించి, ఈ ఏడాది ఇప్పటికే ‘పాండవులు పాండవులు తుమ్మెద'లో ఆడవేషంలో తెగ అల్లరిచేసిన మంచు మనోజ్‌ ఇప్పుడు ‘కరెంట్‌ తీగ'గా వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' ఫేమ్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నాయికగా నటిస్తున్నప్పటికీ ఈ సినిమా వార్తలో నిలవడానికి ప్రధాన కారణం పోర్న్‌ స్టార్‌ నుంచి సినీ స్టార్‌గా మారిన సన్నీ లియోన్‌ తొలిసారిగా తెలుగులో నటిస్తుండటం. విష్ణుతో ‘దేనికైనా రెడీ' తీసి హిట్‌కొట్టిన నాగేశ్వరరెడ్డి ఇప్పుడు ఆయన తమ్ముడితోనూ హిట్‌ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు.

    గోపాల గోపాల

    గోపాల గోపాల

    దర్శకుడు: కిశోర్‌కుమార్‌
    విడుదల: జవవరి 15

    హిందీ హిట్‌ ఫిల్మ్‌ ‘ఓఎంజి.. ఓ మై గాడ్‌'కు అధికారిక రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాలో మానవ రూపంలో కనిపించే శ్రీకృష్ణునిగా పవన్‌కల్యాణ్‌ నటిస్తుండటం, ఈ ఏడాది ఆయన కనిపించే సినిమా ఇదొక్కటే కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. హిందీలో పరేశ్‌ రావల్‌ చేసిన పాత్రను వెంకటేశ్‌ చేస్తుండగా, ఆయన జోడీగా శ్రియ నటిస్తోంది. నిరుడు ‘తడాఖా' చూపించిన కిశోర్‌కుమార్‌ (డాలీ) ఈ సినిమాతో ఆ ఒరవడిని కొనసాగించాలని తపిస్తున్నాడు.

    ఈ సినిమాలతో పాటు మరికొన్ని ఆసక్తికర సినిమాలూ ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి. బెల్లంకొండ సురేశ్‌ కుమారుడు శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ వీవీ వినాయక్‌ ‘అల్లుడు శీను',

    పిల్లా నువ్వులేని జీవితం

    పిల్లా నువ్వులేని జీవితం

    చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘రేయ్‌', ‘పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలు వంటివి వాటిలో ఉన్నాయి. వీటితో సినీ ప్రియులకు ఈ ఏడాది ద్వితీయార్ధం పండగే పండగ.

    కార్తికేయ

    కార్తికేయ

    నిఖిల్, స్వాతి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘కార్తికేయ' . తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని ఆగష్టు 1న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగష్టు 1 నుండి వాయిదా వేసారు. ఈ విషయాన్ని చిత్రం హీరో నిఖిల్ సోషల్ నెట్ వర్కింగ్ మీడియా ద్వారా తెలియచేసారు. త్వరలో తదుపరి రిలీజ్ తేదిని ప్రకటిస్తామన్నారు.

    English summary
    The movies that are going to hit the screens after months are scheduled as mentioned below.Hope the above movies will be released in scheduled dates.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X