సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్.. ఆ లుక్ ఎలా ఉండనుందంటే!
అల్లు అర్జున్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. నా పేరు సూర్య సినిమా తరువాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన ఇకపై జోరుగా సినిమాల సందడి చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ మేరకు ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' సినిమా ఫినిష్ చేసిన బన్నీ.. మరికొద్ది రోజుల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా సెట్స్ పైకి రానున్నాడు.
ఈ నేపథ్యంలో సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో బన్నీ లుక్ ఎలా ఉండబోతోంది అనే దానిపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో అల్లు అర్జున్ గుబురు గడ్డంతో డిఫెరెంట్ లుక్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

'అల వైకుంఠపురములో' సినిమాలో బన్నీ లైట్ గెడ్డంతో కనిపించనున్నాడు. అయితే నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ ఓ మాదిరిగా పెరిగిన గెడ్డంతోనే కనిపించాడు. దీంతో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి సినిమా కోసమే బన్నీ గడ్డం పెంచుతున్నారని టాక్ మొదలైంది. షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి మరికాస్త గెడ్డం పెంచేసి అదే లుక్‌తో సెట్స్ పైకి రానున్నాడట అల్లు అర్జున్.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాలో బన్నీని చిత్తూరు ప్రాంతానికి చెందిన కుర్రాడిగా చూపించనున్నారట. హీరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయనీ, అలాగే కొంతసేపు స్మగ్లర్ గాను కనిపిస్తాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ఆడిపాడనుంది.


Click it and Unblock the Notifications











