‘కృష్ణం వందే జగద్గురుమ్’లో 20 నిముషాలు కట్?
హైదరాబాద్ : రానా,దర్శకుడు క్రిష్ ల తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. మైనింగ్ మాఫియా బేస్ గా నిర్మితమైన ఈ చిత్రంలో పద్దెనిమిది నుంచి ఇరవై నిముషాల పాటు సెన్సార్ కట్ చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఓ రాజకీయ పార్టీని ...ఈ మైనింగ్ మాఫియా రిఫెర్ చేస్తూండటంతో ఈ కట్స్ చెప్పినట్లు సమాచారం. అయితే ఇవన్నీ దేనికైనా రెడీ, కెమెరామెన్ గంగతో ఎఫెక్టు అంటున్నారు. ఈ రెండు చిత్రాలు వివాదం క్రియేట్ చేయటంతో సెన్సార్ చాలా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఈ కట్స్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సినిమా చాలా బాగా వచ్చిందని, గ్యారెంటీగా మంచి సక్సెస్ సాధిస్తుందని చెప్తున్నారు.
రానా, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి సోమవారం సెన్సార్ పూర్తయింది. యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే విడుదల తేదీ ఈ నెల 30 కి మారే అవకాసం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ -''భగవద్గీతలోని సారానికి వెండితెర రూపమే ఈ సినిమా. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్య చుట్టూ కథ తిరుగుతుంది.
యాక్షన్ అడ్వంచరస్ మూవీ ఇది. కమర్షియల్‌గా అటు రానాకు, ఇటు నాకూ మంచి బ్రేక్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను. ఇప్పటికే మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయి. మణిశర్మ రీ-రికార్డింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ'' అని తెలిపారు.
''దేవుడంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే మత్స్యావతారం అన్నారు. ఓ పంది సాయం చేస్తే వరాహమూర్తీ.. మహావిష్ణు అవతారం అన్నారు. రాత రాసింది దేవుడు గురించి కాదు. సాయం గురించి''... ఈ ఒక్క డైలాగే 'కృష్ణం వందే జగద్గురుమ్'. భగవానుడు ఎక్కడో ఉండడు. మనం అందించే చేయూతలోనే ఉంటాడనే పాయింట్‌తో జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) అందిస్తున్న సందేశాత్మక ఈ సినిమా ఇది.
ఈ చిత్రంలో రానా పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











