»   » వరుడు అడ్డుకొనేందుకు తెలంగాణా వాదుల నికృష్టపు చర్యలు

వరుడు అడ్డుకొనేందుకు తెలంగాణా వాదుల నికృష్టపు చర్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణ వాదులు తెలంగాణా సాధన మార్గాల కన్నా తెలంగాణేతరులను అడ్డుకొనేందుకే అధిక శ్రధ్ధ చూపుతున్నట్టు వుంది ప్రస్తుత తతంగం. వీటిలో భాగమే సినిమాలను అడ్డుకోవడం. ముఖ్యంగా అదుర్స్, ఆర్య 2 సినిమాలు తెలంగాణా దాడుల వల్ల ఎంత నష్టపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య 2 అయితే అల్లు అర్జున్ కెరీర్ లోనే మొదటి ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం జూ ఎన్టీఆర్ నాన్న గారు హరికృష్ణ, అల్లు అర్జున్ మామయ్య చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు పలకడమే. దీంతో వీరిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక వీరి సినిమాల విడుదలను, షూటింగులను అడ్డుకుంటూ పరోక్షంగా దెబ్బతీయాలని తెలంగాణా వాదుల అభిమతం అని స్పష్టం అవుతోంది. పనిలో పనిగా వీరు సమైక్యాంద్రకు మద్దతు పలికిన వారందరి సినిమాలనూ అడ్డుకుంటున్నారు. కానీ వీరి మెయిన్ టార్గెట్ నందమూరి, చిరంజీవి కుంటుంబాలే అని స్పష్టంగా అర్థమవుతోంది (వీరిని టార్గెట్ చేస్తేనే మంచి ప్రచారం పొందవచ్చని వీరి అభిమతం కాబోలు).

మొన్న జరిగిన వరుడు సినిమా ఆడియో ఫంక్షన్ ను కూడా వదలని ఈ తెలంగాణా వీరులు తాజాగా ఈ నెల 31న విడుదల కానున్న వరుడు సినిమా విడుదలను అడ్డుకోవాలని ఇప్పటి నుండే వ్యూహరచన చేస్తున్నారట. ఎట్టిపరిస్థితుల్లోనూ 'వరుడు'ని తమ పద్మవ్యూహంలో పడేసి నిర్మాతకి చుక్కలు చూపించాలని స్పష్టమయిన వ్యూహంతో సిద్ధం అవుతున్నారట. అయినా భారతదేశంలో మీ అభిప్రాయలను తెలియబరిచేందుకు రాజ్యంగం ఇచ్చిన హక్కును కాదనడానికి వీరెవరు అని ప్రశ్నిద్దాం అంటే మనకు ఆ హక్కు కూడా లేకుండా చేసారు.. దాడులు చేస్తామని బెదరగొడుతూ... మరి వరుడి జాతకాన్ని తారుమారు చెయ్యాలనుకుంటున్న వీరి ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నాయో మరి..!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu