Bimbisara సీక్వెల్‌లో జూనియర్ ఎన్టీఆర్.. కల్యాణ్ రామ్ ఇచ్చిన క్లారిటీ ఇదే!
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం బింబిసార. విశిష్ట్ నూతన దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. హరికృష్ణ కే నిర్మిస్తున్న చిత్రం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో బింబిసార ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఆ వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ సినిమాల స్పూర్తితో..
బింబిసార సినిమా స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవీ, జగదేవక వీరుడు లాంటి సినిమాల స్పూర్తితో తీశాం. వశిష్ట్ నాకు చాలా కథలు చెప్పాడు. ఆ తర్వాత కనిపించకుండా పోతాడు. మహానాయకుడు సినిమా షూటింగులో వచ్చి కలుస్తానని చెప్పాడు. ఆ సమయంలో చెప్పిన కథ విని షాకింగ్‌కు గురయ్యాను. బింబిసార అలా మొదలైంది అని కల్యాణ్ రామ్ తెలిపారు.

బడ్జెట్ పట్టించుకోలేదు అంటూ
బింబిసార సినిమా విషయంలో బడ్జెట్ పట్టించుకోలేదు. అయితే మా పిల్లలు ఎప్పుడూ మార్వెల్ సినిమాలు చూద్దామని అంటుంటారు. అవెంజర్స్ లాంటి సినిమాలు ఇచ్చే అనుభూతిని ఇవ్వాలని బింబిసార ప్లాన్ చేశాం. ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ ఒక ఎలిమెంట్ మాత్రమే. బింబిసార కథ నా వద్దకు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌తో ఎలాంటి చర్చలు జరిపానో ఒక ఈవెంట్‌లో చెబుతాను అని కల్యాణ్ రామ్ అన్నారు.

బింబిసార చిత్రానికి ఫ్రాంచైజీలు
హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాల మాదిరిగానే బింబిసార చిత్రానికి ఫ్రాంచైజీలు ఉంటాయి. ఒకటి,రెండు,మూడు, నాలుగు ఫ్రాంచైజీలు ఉంటాయి. నాకు సోషియో ఫాంటసీ సినిమాలంటే ఇష్టం. కమర్షియల్ వ్యాల్యూస్ జోడిస్తే ఇంకా అద్బుతంగా ఉంటుంది. అవెంజర్స్ లాంటి సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లను తీసుకొచ్చి అద్భుతంగా సినిమాలను రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ నటించడం గురించి చెప్పడం చాలా తొందరపడినట్టు అవుతుంది అని కల్యాణ్ రామ్ అన్నారు.

ఎన్టీఆర్ నటించే విషయంపై కల్యాణ్ రామ్
బింబిసార చిత్రం నాలుగు పార్టులుగా తెరకెక్కించాలని భావిస్తున్నాం. ఇటీవల అంటే వారం రోజుల క్రితం దర్శకుడు వశిష్ట్ ఓ కథ చెప్పాడు. అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే..తదుపరి ఫ్రాంచైజీలో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్, నేను కలిసి నటించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తాం అని కల్యాణ్ రామ్ అన్నారు.

ఆగస్టు 2023లో రిలీజ్
బింబిసార చిత్రం రెండో పార్ట్ త్వరలోనే ప్రారంభిస్తాం. ఆగస్టు 2023లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని కల్యాణ్ రామ్ తెలిపారు. అయితే బింబిసార ఫ్రాంచైజీలో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని కల్యాణ్ రామ్ విషయం చెప్పగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.


Click it and Unblock the Notifications











