తొలిసారి అలాంటి సినిమాలో కల్యాణ్ రామ్: బాబాయ్‌ను గుర్తు చేయబోతున్నాడా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న నందమూరి హీరోల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు దక్కించుకున్న నటుడు కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభంలో కొన్ని పరాజయాలను ఎదుర్కొన్న ఈ హీరో.. 'అతనొక్కడే'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత కూడా పలు ఫ్లాప్‌లు పలకరించినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'పటాస్'తో కల్యాణ్ రామ్ కెరీర్ మలుపు తిరిగింది. అక్కడి నుంచి వైవిధ్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మరో ప్రయోగాత్మక చిత్రంతో రాబోతున్నాడు.
కల్యాణ్ రామ్ ప్రస్తుతం వేణు మిల్లిడి అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో ప్రకటనకు ముందే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాకు 'తుగ్లక్' అనే పేరు పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 'రావణ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారట. అంతేకాదు, ఈ సినిమా టైమ్ ట్రావెల్‌తో సాగే సరికొత్త కథతో రూపొందబోతుందని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమాలో కల్యాణ్ రామ్ రావణుడిగానూ కనిపించబోతున్నాడని అంటున్నారు.

గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 'ఆదిత్య 369' అనే సినిమా వచ్చింది. అందులో ఆయన శ్రీకృష్ణ దేవరాయలుగా నటించాడు. ఇప్పుడదే బాటలో పయనించనున్న కల్యాణ్ రామ్.. రావణ బ్రహ్మగా కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు. సొంత సినిమా కావడంతో దీనికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గత ఏడాది ఈ నందమూరి హీరో 'ఎంత మంచివాడవురా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, అది నిరాశనే మిగిల్చింది.


Click it and Unblock the Notifications











