కల్కి 2 నుంచి ఔట్.. అందుకే ఆ నిర్ణయమంటూ దీపిక పదుకొనె షాకింగ్ పోస్ట్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు ఖ్యాతి తెచ్చిపెట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా కల్కి 2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయినట్లు మేకర్స్. తొలి భాగంలో నటించిన వారే, రెండో పార్ట్‌లోనూ కొనసాగుతారని కూడా హింట్ ఇచ్చేశారు. ఇలాంటి వేళ.. హీరోయిన్ దీపిక పదుకొనెను కల్కి పార్ట్ 2 నుంచి తప్పిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ టాపిక్ తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా దీపిక పదుకొనె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
సుమతిగా అద్భుత నటన
కల్కిలో సుమతిగా, కల్కికి జన్మనివ్వబోయే మహిళ పాత్రలో దీపిక అద్భుతంగా నటించారు. ఆమె తప్పించి మరెవ్వరూ ఈ పాత్ర చేయలేరన్నట్లుగా ఒదిగిపోయారు. పార్ట్ 1 క్లైమాక్స్‌లో ప్రభాస్ ఆమెను ఎత్తుకుపోవడంతో పార్ట్ 2లో ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ నెలకొంది. పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికల్లా కల్కి పార్ట్ 2ని సెట్స్ మీదకి తీసుకెళ్లి.. 2028 నాటికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నుంచి దీపికను వైజయంతీ మూవీస్ తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

భాగస్వామ్యం కుదరలేదు
కల్కి 2 నుంచి దీపికా పదుకొనెను తప్పించామని, లోతుగా ఆలోచించిన తర్వాత ఆమెతో భాగస్వామ్యం నుంచి విడిపోవాలని అనుకున్నామని వైజయంతీ మూవీస్ తెలిపింది. కల్కి 2898 ఏడీ నుంచి నేటి వరకు లాంగ్ జర్నీ కొనసాగించినప్పటికీ మా మధ్య సరైన భాగస్వామ్యం కుదరలేదని.. ఇలాంటి భారీ చిత్రానికి నిబద్ధత అవసరమని వైజయంతీ మూవీస్ చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన స్పిరిట్ నుంచి దీపిక తప్పుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా కల్కి 2898 ఏడీ నుంచి కూడా ఈ పొడుగుకాళ్ల సుందరిని తప్పించడంతో ఆమె వ్యవహారశైలిపై అనేక విమర్శలు వస్తున్నాయి.
నిబద్ధత లేకుంటే కష్టం
వైజయంతీ మూవీస్‌కు దీపిక పెట్టిన కండీషన్లే తొలగింపుకు దారి తీశాయని.. చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది. రోజుకు 8 గంటలే పనిచేస్తానని చెప్పడంతో పాటు కల్కి 2898 ఏడీకి ఇచ్చిన దానికంటే అదనంగా 25 శాతం రెమ్యునరేషన్ ఇవ్వాలని, తన సిబ్బందికి సకల సదుపాయాలు కల్పించాలని దీపిక పదుకొనె చేసిన డిమాండ్లు ఆమెకే చేటు చేశాయని అంటున్నారు. అయితే వీటిని చెల్లించడానికి, డబ్బుపరంగా వైజయంతీ మూవీస్ ఎలాంటి అబ్జెక్షన్ పెట్టదు.. భారీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అశ్వినీదత్ రెమ్యునరేషన్ విషయాల్లో తగ్గరనే పేరుంది. అయితే నిబద్ధత అనే పదం చుట్టూనే అసలు కథ నడిచినట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌ని ముందుగా అనుకున్న సమయంలో ముగించడం సాధ్యం కాదు.. అవసరమైతే ఎక్కువసేపు కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో వైజయంతీ మూవీస్ తగ్గలేదని అందుకే దీపికతో తెగతెంపులు చేసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అదే పాఠం నేర్పింది
దీపికను కల్కి 2 నుంచి తప్పించడంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో దీపిక పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. అందులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చేతిలో చేయ్యెసిన ఫోటోను షేర్ చేసిన దీపిక.. ఓం శాంతి ఓం సినిమా చేస్తున్నప్పుడు షారుఖ్ ఎన్నో విషయాలు చెప్పారు. ఒక సినిమా సక్సెస్ కంటే మించిన విషయాలను చెప్పేవారు. నేను ఇప్పటికీ షారుఖ్ మాటలనే అనుసరిస్తున్నాను.. నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వాటినే అమలు చేస్తున్నానని దీపిక రాసుకొచ్చారు. షారుఖ్ - దీపికలు 6వసారి కలిసి సినిమా చేయబోతున్నారు. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కల్కి 2 నుంచి తప్పించిన నేపథ్యంలో దీపిక పోస్ట్ కలకలం రేపుతోంది.


Click it and Unblock the Notifications











