ఆయన రిస్క్ వల్లనే ఇండస్ట్రీలో ఉన్నా.. ఆ రుణం తీర్చుకోవాలి: సమంత
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా సంపాదించింది. తెలుగు, తమిళ్ భాషల్లో అనేక సూపర్‌హిట్ సినిమాల్లో నటించి కోట్లాది అభిమానులను సంపాదించింది. స్టార్ హీరోలతో కలిసి వరుస బ్లాక్‌బస్టర్‌లను అందించిన సమంత, తన సొంత టాలెంట్‌తో సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది.
నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు. ఓ ఏడాది పాటు మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా సమంత సినిమాలకు దూరమైందీ, హెల్త్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సమంత తన కెరీర్‌లో కొత్త అడుగు వేసింది. 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures) అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది.

ఈ బ్యానర్‌లో సమంత నిర్మాతగా తెరకెక్కిస్తున్న మొదటి సినిమా 'శుభం' (Shubham). వసంత్ మరిగంటి కథ, ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ ఇటీవల ప్రకటించింది. 'శుభం' సినిమాలో హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటి యువ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో నిండిన ఈ సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరిస్తు్న్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో సమంత సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ సినిమాలోని జెస్సీ పాత్ర సమంతకు ఓ ఐకానిక్ ఇమేజ్ తెచ్చింది. అదే దర్శకుడు తీసిన "ఎటో వెళ్లిపోయింది మనసు" చిత్రంలో కూడా నటించి మంచి గుర్తింపు పొందింది. సమంత తరచుగా ఇంటర్వ్యూల్లో గౌతమ్ మీనన్‌గురించి గౌరవంగా మాట్లాడుతుంటుంది. "ఆయన రిస్క్ తీసుకోకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు" అని చెప్పడం ద్వారా తన గురువు పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేసింది.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో "మీరు ఇంత పెద్ద స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎందుకు నిర్మాతగా మారారు? నిర్మాతకు ఎంత బాధ్యత ఉంటుందో మీకు తెలుసు కదా?" అని యాంకర్ ప్రశ్నించగా.. సమంత నవ్వుతూ "నా గురించి తెలిసే ఇలా అడుగుతున్నారా? నాకు కొంత పిచ్చి ఉంది... అది సినిమాలంటే పిచ్చి!" అని జవాబు ఇచ్చింది.
సమంత ఇంకా మాట్లాడుతూ.. "గౌతమ్ మీనన్ ఒకప్పుడు రిస్క్ తీసుకుని నన్ను సినిమాలోకి తీసుకున్నారు. ఆయన ఆ రిస్క్ తీసుకోవడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు అదే ధైర్యం నాకు వచ్చింది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించి, వారికి అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. వాళ్లు కూడా ఎదిగి ఏదొక రోజు నా స్థానంలో కూర్చోవాలి. అదే నా సంతృప్తి" అని సమంత అన్నారు.
సమంత నిర్మాణంలో రూపొందుతున్న 'శుభం' సినిమాలో సమంత నటించడం లేదు. కానీ ఆమె సొంత బ్యానర్‌లో తానే లీడ్‌గా నటించే 'మా ఇంటి బంగారం' అనే సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఆ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుందని సమాచారం. ఇన్నాళ్లు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన సమంత ఇప్పుడు నిర్మాతగా తన ప్రతిభను నిరూపించుకోబోతుంది. "శుభం"తో మొదలైన ఈ కొత్త చాప్టర్ శుభప్రదంగా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











