»   » 'అవతార్' లో అదరగొట్టిన భారతీయుడు..!!

'అవతార్' లో అదరగొట్టిన భారతీయుడు..!!

Subscribe to Filmibeat Telugu

జేమ్స్ కామెరూన్ పన్నెండేళ్లు కష్టపడి రూపొందించిన అద్భుత సాంకేతిక కళాఖండం అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సైంటిస్టు పాత్రలో కనిపించిన గడ్డం కుర్రాన్ని ఓ సారి గుర్తుతెచ్చుకోండి. అతన్ని సినిమాలో చూడగానే అరే ఇతగాడు భారతీయుడిలా వున్నాడే అనుకున్నాను. నా అంచనా నిజమే అని ఇటీవల ఓ పత్రికలో వచ్చిన వార్తతో నిర్ధారణ అయింది. ఆ విశేషాలు మీతో పంచుకోవాలని...

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వున్న భారతీయులు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. అలాగే హాలీవుడ్ లోనూ మన వారు తమదైన ముద్రను వేస్తున్నాడు. వారితో దిలీప్ రావు కూడా ఒకడు. సైంటిస్ట్ అయిన అమ్మ, ఇంజనీర్ అయిన నాన్న అమెరికాలో స్థిరపడటంతో అక్కడే పెరిగిన దిలీప్ కు హాలీవుడ్ అంటే యమా క్రేజు. చిన్నప్పటి నుండీ నాటకాలతో పాటు చదువులోనూ ముందుండే దిలీప్ తన తల్లిదండ్రుల కోరిక మేరకు మెడిసిన్ చేరాడు.

కానీ అతని హాలీవుడ్ మోజు అధికమవడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి ఓ దర్శకుడి వద్ద సంవత్సరం పాటు నటనలో మెలుకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఛాన్సుల కోసం వెతకనారంభించాడు. ఈ క్రమంలో రెండు టివి సీరియళ్లలో చాలా ఈజ్ తో నటించడంతో అతనికి అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ పరిణామంలో అవతార్ సినిమాలో ఓ చిన్న పాత్ర వచ్చినా అందులో మంచి నటనను కనబరిచి కామెరూన్ చేత శభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడతను స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ బిగిన్స్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు.

భారతీయుడు ఇందుగలడు అందుగలడన్న సందేహము వలదు ఎందెందు వెతకినా అందందు కలడు అని మరో సారి నిరూపించిన దిలీప్ రావ్ కు ఆల్ ది బెస్ట్ చెబుదామా..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu