కెన్నడీ భార్య సీక్రెట్ ఆడియో టేపులు త్వరలో బహిర్గతం
లండన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సతీమణి జాక్వెలిన్ కీలక సంభాషణలు గల ఆడియో టేపులను బహిర్గతం చేయనున్నారు. 1963 నవంబర్ 22న కెన్నెడీ హత్య జరిగిన కొద్ది నెలల తర్వాత రికార్డు చేసిన ఆ టేపులను త్వరలో ఓ టీవీ చానల్ ద్వారా ప్రజల ముందుంచనున్నారు. తాను చనిపోయిన 50 ఏళ్ల తర్వాత వాటిని బయటపెట్టాలని జాక్వెలిన్ పేర్కొనడంతో బోస్టన్‌లోని కెన్నెడీ లైబ్రరీలో ఇప్పటిదాకా టేపులను దాచిఉంచారు. 1994 మేలో ఆమె కాన్సర్ వ్యాధితో మరణించింది.
కాగా, త్వరలో ఆ టేపులను ఏబీసీ చానల్ ద్వారా బహిర్గతం చేయడానికి జాక్వెలిన్ కూతురు కరోలిన్ కెన్నెడీ అంగీకరించారని 'సండే ఎక్స్‌ప్రెస్" పేర్కొంది. కెన్నెడీతో జాక్వెలిన్ ఆంతరంగిక జీవితం గురించిన ఆసక్తికర విషయాలు వాటిలో ఉంటాయని భావిస్తున్నారు. ఆ టేపులను రెండు గంటల నిడివిగల కార్యక్రమంలో ప్రసారం చేస్తామని చానల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, టేపుల్లో ఏముందో అన్న అంశంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











