ఎస్వీ రంగారావు, నసీరుద్దీన్ షా నాకు ఇన్సిపిరేషన్.. ఆ తరహా పాత్రలను పోషించాలని ఉంది.. ఆనంద చక్రపాణి
80వ దశకంలో జాతీయ, అంతర్జాతీయంగా సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్న దాసి చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేసిన ఆనంద చక్రపాణి.. ఆ తర్వాత చిటికెల పందిరి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి యాడ్ ఫిలిం మేకింగ్‌లో రాణించారు. అయితే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న మల్లేశం చిత్రంలో నర్సింహులు పాత్ర వెతుక్కొంటూ రావడంతో ఆ పాత్రలో జీవించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు ప్రేక్షకుల హృదయాల్లో భావోద్వేగమైన తండ్రిగా స్థానం సంపాదించుకొన్నారు. అయితే కెరీర్ పరంగా బీజీగా మారిన ఆనంద చక్రపాణి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
లాక్‌డౌన్ తర్వాత నటుడిగా మళ్లీ బిజీగా మారిపోయారా?
కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల అందరికి వచ్చిన గ్యాప్.. నాకు వచ్చింది. కానీ నేను నటించిన అనగనగా ఓ అతిథి రావడంతో ఆ గ్యాప్‌ను నేను ఫీల్ కాలేదు. అయితే గత రెండేళ్లుగా నేను నటుడిగా సాధించిన విజయాలను నెమరు వేసుకొని.. నటుడిగా కొత్త మార్గాన్ని అన్వేషించే పనిలో పడ్డాను. లాక్‌డౌన్ సమయం చిక్కడంతో ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, నాగయ్య, కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్, సముద్ర ఖని, హిందీలో అమితాబ్ బచ్చన్ నుంచి నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి పాతతరం, న్యూ జనరేషన్ నటుల సినిమాలను చూసి.. మరింత రీఛార్జ్ అయ్యాను. వారి నటనా స్పూర్తితో కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాను అని ఆనంద చక్రపాణి తెలిపారు.

ఎమోషనల్ ఫాదర్ అనే ఇమేజ్‌లో ఇరుక్కుపోయారా?
అలాంటి ఇమేజ్ లభించడం నటుడిగా కొందరికే దక్కుతుంది. అలాంటి గుర్తింపు రావడం హ్యాపీగా ఉంది. మల్లేశం సినిమా నాకు మంచి గుర్తింపును ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో ఎమోషనల్ ఫాదర్ అంటే.. మీరే అంటూ చాలా మంది సినీ ప్రముఖులు నాతో అనడం గర్వంగా అనిపిస్తుంది. అయితే తండ్రి పాత్రలతో బిజీగా ఉంటూనే.. విలన్, భారమైన క్యారెక్టర్ పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. నటుడిగా మరో లెవెల్‌కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నాలోని నటుడిని ప్రేక్షకులకు చూపించాలని అనుకొంటున్నాను. పాత్రలతో ప్రయోగం చేయడానికి ఇష్టపడుతాను. ఇటీవల కొన్ని చిత్రాల్లో నేను పోషించిన పాత్రలు ఇప్పటి వరకు నాపై కొందరి అభిప్రాయాలను మార్చేస్తాయి అని ఆనంద చక్రపాణి అన్నారు.

ఓటీటీ, వెబ్ సిరీస్ ప్రభావం ప్రేక్షకులపై భారీగా ఉంది? ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా?
సినిమా రంగానికి సమాతరంగా ఓటీటీ ఇండస్ట్రీ ఎదుగుతున్నది. లాక్‌డౌన్‌లో ప్రేక్షకులు విపరీతంగా అలవాటు పడిపోయారు. మంచి కంటెంట్, ఇతర భాషల సినిమాలు టిప్ ఆఫ్ ది ఫింగర్ దూరంలో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఓటీటీకి ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. వెబ్ సిరీస్, ఓటీటీ కోసం చేసే సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఒకట్రెండు వెబ్ సిరీస్‌లలో నటించాను. కొన్ని చర్చల దశలో ఉన్నాయి అని ఆనంద చక్రపాణి చెప్పారు.
తెలుగు సినీ రంగానికి ఎందుకు పరిమితమయ్యారు?
లాక్‌డౌన్‌కు ముందు తెలుగులో బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో తమిళ, కన్నడ చిత్రాల్లో నటించేందుకు ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలో చర్చలు జరుగుతుంటే.. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమ స్తంభించింది. దాంతో ఒక్క అడుగు వెనక్కు పడింది. అనగనగా ఓ అతిథి తర్వాత కన్నడలో ఆఫర్లు వస్తున్నాయి. తమిళ సినిమా నుంచి అడుగుతున్నారు. విభిన్నమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను అని ఆనంద చక్రపాణి తెలిపారు.

ప్రస్తుతం మీ సినిమాల లైనప్ గురించి చెప్పండి?
వేణు ఊడుగుల దర్శకత్వంలో సాయిపల్లవి, రానా నటించిన విరాట పర్వం సినిమాలో మంచి పాత్రలో కనిపిస్తాను. అలాగే ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వంలో 5Ws, శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో జెండా, నవీన్ బేతిగంటి దర్శకత్వంలో రామన్న యూత్, కృష్ణమాచారి దర్వకత్వంలో రాజు యాదవ్, ఓం ప్రకాష్ మార్త దర్శకత్వంలో గుణసుందరి కథ, విజయ్ కట్ల దర్శకత్వంలో సుగ్రీవ, విజయ్ రాఘవేంద్ర దర్శకత్వంలో జీవో 111 చిత్రం, తిరుపతి రావు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్క్ బ్యానర్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాను. వంశీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో, అలాగే సుధీర్ రాజు దర్శకత్వంలో రాజ్ తరుణ్, జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ కలిసి నటిస్తున్న మాస్ మహారాజా చిత్రంలో నటిస్తున్నాను. పలు చిత్రాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











