What is Operation Numkhor? దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై దాడులు.. మాలీవుడ్‌కు షాక్!
కేరళలో సినీ తారల ఇళ్లపై కస్టమ్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. వాహనాల స్మగ్లింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సోదాలు, తనిఖీలలో భాగంగా మలయాళ సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై తనిఖీలు చేపట్టారు. విలాసవంతమైన వాహనాలను భూటాన్ నుంచి దిగుమతి చేసుకొన్నారు. టాక్స్ నిబంధనలకు విరుద్ధంగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ తారలు, ఇతర ప్రముఖుల నివాసాలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల వివరాల్లోకి వెళితే..
హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా భూటన్ నుంచి అక్రమ మార్గంలో విలాసవంతమైన, అత్యంత ఖరీదైన వాహనాలను అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే కుంభకోణం బయటకు వచ్చింది. ఈ క్రమంలో నుమ్కూర్ (భూటాన్ భాషలో వాహనం) పేరుతో భారతీయ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించారు. కేరళలో పృథ్వీరాజ్, దుల్కర్ నివాసాలపై దాడుల చేయడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

దేశంలో సంపన్న వర్గాలు వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకొని ట్యాక్స్ ఎగవేతకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కొన్ని ముఠాలపై నిఘా పెట్టారు. ఆ నేపథ్యంలోనే లభించిన సమాచారం ఆధారంగా కోచిలోని పనమ్‌పిల్లి నగర్‌లోని దుల్కర్ సల్మాన్ నివాసంపై, థేవరలోని పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటితోపాటు తిరువనంతపురంలోని మరో నివాసంపై దాడాలు చేశారు. అయితే అక్కడ ఎలాంటి వాహనాలు లభ్యం కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, కోచి, కోజికోడ్, మలప్పురంతోపాటు కేరళలోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సోదాల్లో దుల్కర సల్మాన్ నుంచి ఓ వాహనాన్ని సీజ్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.
ఆపరేషన్ నమ్కూర్ విషయానికి వస్తే..భూటాన్ ఆర్మీ నుంచి తొలగించిన వాహనాలను వేలంపాటలో తక్కువ రేటుకు కొందరు కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఎలాంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా వాటిని భారత్‌లోకి అక్రమంగా తరలించి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తాత్కాలిక అడ్రస్‌తో వాహనాలను రిజిస్టర్ చేసి.. హిమచల్ ప్రదేశ్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతుంది. ఇలాంటి వాహనాలను, సినీతారలు, వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాలు కొనుగోలు చేస్తున్నారనే విషయం నిఘా వర్గాల దర్యాప్తులో వెల్లడైంది.


Click it and Unblock the Notifications











