రిలీజ్ రోజు సినిమా టికెట్ దొరకలేదని స్టార్ హీరో అభిమాని ఆత్మహత్యాయత్నం
సూపర్ స్టార్ రజిని కాంత్, విశ్వ నాయకుడు కమల్ హాసన్ తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అజిత్ కుమార్. స్టైలిష్ లుక్, విలక్షణమైన నటనతో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ మధ్య అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడడం లేదు. దీంతో అజిత్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.
వరుస పరాజయాల తర్వాత అజిత్ నటించిన చిత్రం 'నెర్కొండ పార్వాయి'. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ - తాప్సీ పన్ను కలయికలో వచ్చిన చిత్రం 'పింక్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. దీన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించారు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ భార్యగా విద్యా బాలన్ నటిస్తుంది. ఈమెకి ఈ చిత్రం తమిళంలో తొలి మూవీ . గిబ్రాన్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా గురువారం (ఆగస్టు 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అజిత్‌తో పాటు ఆయన అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ దురదృష్ట సంఘటన కూడా జరిగింది. అజిత్ సినిమా మొదటి రోజు టికెట్ దొరకలేదని ఓ అభిమాని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











