»   » 'వరుడు' లో అల్లు అర్జున్ పాత్ర ఏమిటంటే...

'వరుడు' లో అల్లు అర్జున్ పాత్ర ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'వరుడు' చిత్రంలో అల్లు అర్జున్ సందీప్ అనే పాత్రను పోషిస్తున్నారు. మంచి కుటుంబ వాతావరణంలో పుట్టి పెరిగిన యువకుడు సందీప్‌ (అల్లు అర్జున్‌). సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తాడు. అలాగని రాముడు మంచి బాలుడు లాంటివాడూ కాదు. నవతరం ఆలోచనలకి ప్రతినిధిలాంటివాడు. ఇక దివాకర్‌ (ఆర్య)...ఓ అక్రమ సంతానం. అతని ప్రవర్తన, ఆలోచన సందీప్‌ తీరుకి పూర్తి విరుద్ధం. ఈ కథలో విలన్ దివాకరే. ఈ రెండు పాత్రల ద్వారా కథాంశాన్ని ఎలా నడిపారన్నది తెర మీదే చూడాలి. ఇక ఈ చిత్రం ఈ రోజు (బుధవారం)రిలీజ్ అవుతోంది. మంచి వివాహమే మంచి దాంపత్యం. మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. మంచి సమాజమే మంచి ప్రపంచం - అనే అంశాన్ని ఈ కథలో చెప్పే 'వరుడు' రూపుదిద్దుకొంది.

ఇక ఈ చిత్ర విశేషాలను మీడియాకు వివరిస్తూ గుణశేఖర్....''కొన్ని దశాబ్దాల కిందట మన తెలుగు లోగిళ్లలో అయిదు రోజుల పెళ్లి చేసేవారు. ఈ అయిదు రోజులూ ఎన్నెన్నో సంప్రదాయాలూ, ఆచారాలూ ఉండేవి. పచ్చటి పొలాల మధ్య పందిరి వేసి ఎంతో చక్కగా అలంకరణ చేసి పెళ్లి వేడుకను చేసేవారు. ఇక తెల్లవారుజాము ముహూర్తమైతే మరింత అందంగా ఉంటుంది. ప్రకృతి నడుమ ఆనందోత్సాహాలతో సాగే అయిదు రోజుల పెళ్లి అనేది మా చిత్రంలో కీలకాంశం. ఇంతటి భారీ సన్నివేశాల్ని అవుట్‌డోర్‌లో చిత్రించాలి. అయితే స్టూడియోలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ వేడుకని చిత్రించాం. సహజమైన బంధాల్ని, భావోద్వేగాల్ని తెరకెక్కించేందుకు ఇందులో ఓ ప్రయోగం చేశాం అన్నారు.

ఇక ఈ చిత్రం కోసం వంద కుటుంబాల్ని ఎంపిక చేసి...ఆ కుటుంబ సభ్యుల్నే పాత్రధారులుగా చేసి కథను నడిపించారు. మోడల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ నటులూ ఉంటే సహజమైన భావోద్వేగాలు రాకపోవచ్చునని ఈ ప్రయోగం చేసామంటున్నారు. అలాగే ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాతో నటుడయ్యారు. ఆయన పాత్ర. కథలోని ముఖ్యాంశాన్ని ప్రభావశీలంగా చెబుతుంది. అలాగే "కథ ప్రకారమే హీరోయిన్ వివరాల్ని వెల్లడించలేదు. తెర మీద చూశాక ప్రేక్షకులు ఒకటే మాట అంటారు...రహస్యంగా ఉంచడమే సరైన నిర్ణయమని. మేం ప్రచారం కోసం అలా దాచి ఉంచలేదు" అన్నారు గుణశేఖర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu