బాహుబలిలో చిక్కు ప్రశ్నలు.. శివగామి చేసిన పాపాలు ఏంటీ? బిజ్జాలదేవ ఎందుకు చంపాలనుకొన్నాడు?
బాహుబలి ది బిగినింగ్ విడుదలైన తర్వాత ప్రేక్షకులను వెంటాడే ఒకే ప్రశ్న 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?'. ఆ ప్రశ్న రాజకీయ నేతల్ల నోళ్లతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో నానింది. ప్రస్తుతం ఆ ప్రశ్నకు సమాధానం కేవలం మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నది. అయితే బాహుబలి కథకు సంబంధించిన మరెన్నో అంశాలు ప్రేక్షకులకు ప్రశ్నలుగా మిగిలాయి. వాటికి దర్శకుడు రాజమౌళి తెరమీద అందించే సన్నివేశాలే సమాధానం చెప్పనున్నాయి. ప్రధానంగా బాహుబలి చిత్రంలో సందేహాలు రేకెత్తించే అంశాలు ఇవి.

రాజమాత శివగామి చేసిన పాపాలు ఏమిటి?
బాహుబలి1 సినిమా ప్రారంభం కాగానే శివగామి (రమ్యకృష్ణ) బాబును ఒడిలో పెట్టుకొని జలపాతం వద్దకు పరుగెత్తుకొంటూ వస్తుంది. బాహుబలి కుమారుడిని రక్షించడానికి శివగామి తన ప్రాణాలను పణంగా పెట్టి నదిలో మునిగిపోతుంది. ‘నేను చేసిన పాపాలకు నా ప్రాణాలు తీసుకొండి' అని మహేంద్ర బాహుబలిని కాపాడాలని శివుడ్ని శివగామి కోరుకొంటుంది. ఈ నేపథ్యంలో శివగామి చేసిన పాపాలు ఏమిటి అనేది ఓ బలమైన ప్రశ్నగా మారింది.

బాహుబలి నిజంగా చనిపోయాడా?
దేవసేన (అనుష్క)ను 20 ఏళ్లుగా బంధించిన భళ్లాలదేవ వేధిస్తుంటాడు. మహిష్మతి సామ్రాజ్యంలో నన్ను తప్ప బాహుబలిని ఎవరూ గుర్తుంచుకోరు అని భళ్లాలదేవ చెప్తుంటాడు. బాహుబలి మళ్లీ తిరిగి వస్తే నా చేతుల్తో స్వయంగా చంపుతాను అని భళ్లాలదేవ మధ్య మధ్యలో అంటుంటాడు. అంటే తొలి ప్రయత్నంలో బాహుబలిని చంపలేదని అర్థమవుతుంది. భారీ విగ్రహం ఏర్పాటు కార్యక్రమంలో బాహుబలి పేరును స్మరించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా బాహుబలిని ఎవరైనా చూశారా అని అడుగడం తెలిసిందే. అయితే అమరేంద్ర బాహుబలి నిజంగానే చనిపోయాడా లేదా అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తింది.

భళ్లాలదేవ భార్య ఎవరు?
భళ్లాలదేవకు ఓ కొడుకు ఉంటాడు. అతడి పేరు ప్రిన్స్ భద్ర. కట్టప్ప ఖడ్గంతో భద్ర తలను శివుడు తెగనరుకుతాడు. అయితే భళ్లాలదేవ భార్య ఎవరు అనే మరో ప్రశ్న.

శివగామిని ఎందుకు చంపాలని..
బాహుబలి ప్రోమోలో బిజ్జాలదేవ పాత్ర మరో బాంబు పేల్చింది. శివగామిని అంతమొందించాలని బిజ్జాలదేవ కోరుకొంటాడు. అదే విషయాన్ని భళ్లాలదేవతో చర్చిస్తాడు. అయితే తన భార్య శివగామిని బిజ్జాలదేవ ఎందుకు చంపాలనుకొంటాడు.

అవంతిక సీక్రెట్ సేన ఎందుకు?
భళ్లాలదేవ చెరలో ఉన్న దేవసేనను రక్షించడానికి అవంతిక(తమన్నా)తో కూడిన ఓ సీక్రెట్ సేన పనిచేస్తుంటుంది. అయితే ఎందుకు దేవసేనను రక్షించాలనుకొంటున్నారు అనేది ఎక్కడ ఓ చిన్న ఆధారం కూడా కనిపించదు. దేవసేన రక్షించడానికి ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్దమవ్వడం వెనుక ఉన్న కథేంటి. దేవసేనతో వారికి ఉన్న అనుబంధమేమిటీ? అనే మరో ప్రశ్న.

భళ్లాలదేవ అసలు రూపం తెలుసా?
మహిష్మతి సామ్రాజ్యానికి రాజును కావాలన్నది భళ్లాలదేవ కోరిక. బాహుబలి ఉండగా అది సాధ్యపడదనే భావనలో ఉంటాడు. అందుకే అతడ్ని తన దారి నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. బాహుబలిని చంపడానికి భళ్లాలదేవ ప్రయత్నం కూడా చేస్తాడు. అయితే భళ్లాలదేవ దుష్టప్రయత్నాలు బాహుబలికి నిజంగా తెలిసే ఉంటాయా అనేది మరో ప్రశ్న.

అనేక ప్రశ్నలకు సమాధానమే..
బాహుబలి రెండోభాగంలో ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకులను ఇలా వెంటాడుతుంటాయి. వీటన్నింటికి దర్శకుడు రాజమౌళి ఎలా తెరమీద సమాధానం ఇచ్చాడు అనే బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్ర కథ. ఇన్ని ట్విస్టులున్న కథ కోసం రెండేళ్లుగా ప్రేక్షకులు ఎదురు చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











