పద్మభూషణ్‌కు దర్శకుడు బాపు పేరు
గాయని సుశీల, జస్టిస్ అంబటి లక్ష్మణరావు, గుడిపూడి శ్రీహరి, క్రీడాకారుడు ఎం.శ్రీనివాసరావు, కొలకనూరి ఇనాక్, చాట్ల శ్రీరాములు తదితర పేర్లు పద్మ పురస్కారాలకు సిఫార్సు చేసిన జాబితాలో ఉన్నట్లు తెలిసింది. సినీ, వైద్యరంగ ప్రముఖులు, సాహిత్య, సేవారంగాల్లోని వారి పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.
పింగిళి వెంకయ్యకు భారతరత్నపై పరిశీలన
జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగిళి వెంకయ్య పేరును భారతరత్న పురస్కారానికి పంపాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. పద్మ పురస్కారాల కోసం తమ పేర్లను పరిశీలించాలని కోరుతూ ప్రభుత్వానికి ఇంకా అభ్యర్థనలు అందుతున్నాయి.
బాపుకు పద్మ అవార్డు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికి ఏడుసార్లు సిఫార్సు చేసిందట. అయినా కేంద్రప్రభుత్వంలోని పద్మ అవార్డుల ఎంపిక సంఘం సభ్యుల కంటికి ఆయన ఆనలేదు. పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలు తమవారికి జాతీయ పురస్కారాలు ఇప్పించడంలో చూపించే చొరవ, పట్టుదల మన రాష్ట్ర ప్రభుత్వంలో లోపించాయన్న విమర్శ ఈనాటిదికాదు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ, ప్రసిద్ధ నేపథ్యగాయని పి. సుశీల తెలుగువారైనా తమ వారుగా భావించి పద్మభూషణ్‌కు సిఫార్సు చేసి సాధించిన ఘనత తమిళపాలకులది.
పద్మ అవార్డుల చుట్టూ అల్లుకున్న ఇతరేతర వివాదాలను చూస్తే... క్రిమినల్ కేసులున్న ఒక గొలుసు హోటళ్ల యజమానికి పద్మవిభూషణ్ ఇవ్వడం గతంలో తీవ్ర వివాదాస్పదమైంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మోకాలికి వైద్యం చేసిన డాక్టర్‌కు పద్మ అవార్డును సిఫార్సుచేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. సినిమా అనే దృశ్యకావ్యాన్ని చిత్రకావ్యంగా తెరకెక్కించడంలోనూ బాపు ముద్ర బాపుదే. సాధారణ నటులను కూడా నటశిల్పాలుగా మలచిన ఆయన దిగ్దర్శకప్రతిభకు ఎన్నో సినిమాలు సాక్ష్యాలు. ఈ సారన్నా ఆయనకు పద్మ అందుతుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications












