»   » అల్లరి నరేష్ 'బెట్టింగ్‌ బంగార్రాజు' రిలీజ్ డేట్

అల్లరి నరేష్ 'బెట్టింగ్‌ బంగార్రాజు' రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్ హీరోగా ఉషాకిరణ్ మూవీస్ నిర్మిస్తున్న 'బెట్టింగ్‌ బంగార్రాజు' చిత్రం ఏప్రియల్ తొమ్మిదవ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మీడియాకు దర్శకుడు ఇ సత్తిబాబు తెలియచేసారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మాణ విలువలకు ఏ మాత్రం తగ్గని చిత్రమిది. ఇటీవల విడుదలైన సంగీతానికి చక్కని స్పందన వచ్చింది. అదే మా తొలి విజయం. ఇప్పుడిప్పుడే విద్యార్థుల పరీక్షలు పూర్తవుతున్నాయి. ఆ ఒత్తిడి నుంచి మా బంగార్రాజు తన వినోదంతో ఉపశమనం కలిగిస్తాడు. సెన్సార్‌ పూర్తయింది. ఒక్క కట్‌ కూడా లేకుండా క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ లభించింది. వేసవిలో వినోదాన్నిచ్చేలా, ఇంటిల్లిపాదీ చూడదగ్గ విధంగా ఉంటుంది మా చిత్రం'' అన్నారు.

హీరో నరేష్ మాట్లాడుతూ.. ''ఇందులో ఓ సుమో ఛేజ్‌ ఉంటుంది. నరేష్‌ సినిమాలో యాక్షన్‌ ఏంటీ..? అనుకోకండి. అది కూడా కితకితలు పెట్టేలానే ఉంటుంది. ప్రతి సన్నివేశం మిమ్మల్ని హాయిగా నవ్విస్తుంది. కావాలంటే బెట్‌'' అన్నారు. ఇక ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన 84వ చిత్రం 'బెట్టింగ్‌ బంగార్రాజు'. నరేష్‌ కథానాయకుడు. నిధి నాయికగా పరిచయం అవుతోంది. ఇ.సత్తిబాబు దర్శకుడు. రామోజీరావు నిర్మాత. కథగా చూస్తే...ఆధ్యంతం కామిడీగా సాగుతుంది.

'కాదేదీ బెట్టింగ్‌కి అనర్హం' అని నమ్మినవాడు బంగార్రాజు. పందెం పావలా అన్నా సరే... బరిలోకి దిగిపోతాడు. గెలవడానికి ఉన్న అన్ని మార్గాలు తెలిసినవాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పాట.... సచిన్‌కి ఆటా నేర్పగలవా? అంటే సై అనగలడీ బంగార్రాజు. ఇతగాడి సుడి కూడా బాగా కలిసొచ్చేది. దాంతో పందెం వేసిన వాళ్లంతా అతని 'సుడి' గుండంలో చిక్కుకుపోయారు. మన బంగార్రాజు మాత్రం ఓ అమ్మాయి ప్రేమలో చిక్కుకుపోయాడు. ఆ ప్రేమ పందెంలో గెలిచాడా..? ఓడిపోయాడా..? ఈ విషయాలన్నీ 'బెట్టింగ్‌ బంగార్రాజు' సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ 'బెట్టింగ్‌ బంగార్రాజు'లో కోట శ్రీనివాసరావు, చలపతిరావు, గిరిబాబు, ఎల్బీ శ్రీరామ్‌, కృష్ణభగవాన్‌, రఘుబాబు, సామ్రాట్‌, జై వేణు, విజయ్‌సాయి, ప్రగతి, కల్పన, జ్యోతి, హేమ, సురేఖావాణి తదితరులు నటించారు. కథ: లంకపల్లి శ్రీనివాస్‌, మాటలు: నాగరాజు గంధం, ఛాయాగ్రహణం: కరుణమూర్తి, కూర్పు: గౌతమ్‌రాజు, నిర్మాత: రామోజీరావు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu