For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లరిగా పల్లవించిన భానుమతి ‘ఫిదా’ చేసింది

  By Lakshmisurya
  |

  'డాలర్ డ్రీమ్స్' కోసం అమెరికా వెళ్ళిన 'శేఖ‌ర్ క‌మ్ముల‌' రీల్ డ్రీమ్స్ కోసం 'హైదరాబాద్'కు వచ్చేసాడు. పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు బోర్ కొట్టి ఆవకాయ రుచి కోసం కన్నభూమికి వచ్చి కాఫీ లాంటి 'ఆనంద్' నిచ్చాడు.

  కాంక్రీట్ జంగల్‌ను వదిలిపెట్టి మ‌ట్టి గుభాళింపుల్ని ప్రేమిస్తూ 'గోదావరి' పరవళ్ళు చూపించాడు. స్వచ్చమైన స్నేహానికి పడి చస్తాడు కాబోలు 'హ్యాపీ డేస్'ను ఆవిష్కరించాడు.

  శేఖ‌ర్ రాక‌తో తెలుగు తెర‌పై చాలా మారిపోయాయి. స‌హ‌జ‌త్వం చూసే అవ‌కాశం, అదృష్టం ద‌క్కింది. కానీ మ‌ధ్య‌లో కొంత గ్యాప్ తీసుకున్నాడు. మూడేళ్ళ విశ్రాంతి నుండి ఆకలితో లేచాడు. నెమ్మదైన అబ్బాయికి, దూకుడైన అమ్మాయిని జోడీ చేసి 'ఫిదా' చేసాడు.

  ‘ఫిదా'లో ఏముంది..

  ‘ఫిదా'లో ఏముంది..

  ఫిదాలో కధగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. స‌హ‌జంగా న‌డిచే రోజులో, జీవితంలో క‌థ ఉండ‌దు. సంఘ‌ట‌న‌లు, భావోద్వేగాలు, అల‌క‌లు, క‌వ్వింత‌లు, క‌ల‌లు ఉంటాయి. `ఫిదాలో కూడా అవే ఉన్నాయి. ఒక నెమ్మదైన అబ్బాయి, ఆలోచించి అరుస్తాడు. ఒక దూకుడైన అమ్మాయిక.. అరిచి ఆలోచిస్తుంది. ఇద్ద‌రికి ఒక‌రిపై మ‌రొక‌రికి చెప్ప‌లేనంత ప్రేమ. అమ్మాయి తొంద‌ర‌పాటు వ‌ల్ల‌.. ఆ ప్రేమ పుట్ట‌కుండానే చ‌చ్చిపోతే అబ్బాయి ఆ ప్రేమ‌ని బ‌తికించుకోవ‌డానికి కాస్త టైమ్ తీసుకొంటాడు. ఈలోగా ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఆ అబ్బాయి న‌చ్చ‌చెబుతాడు. ఇద్ద‌రూ మ‌ళ్ళీ ప్రేమించుకొంటారు. క‌థ‌గా చెప్తే అంతే, కానీ మ‌ధ్య‌లో ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో అలకలు, ఎన్నో కవ్వింతలు ..మనసుల్ని పిండేస్తాయి ..ఉక్కిరిబిక్కిరి చేస్తాయి..గిలిగింతలు పెడతాయి ..ఫిదా చేస్తాయి.

  అంతా భానుమతే.!

  అంతా భానుమతే.!

  భానుమతి.! హైబ్రీడ్ క్వాలిటీ..ఒకటే పీస్ .! సాయి ప‌ల్ల‌విని భానుమతిగా చూస్తే నిజమే అనిపిస్తుంది. తెలంగాణ ప‌ల్లెటూరికి ప‌రికిణీ వేసిన‌ట్టుంది. తెలంగాణ యాస‌కీ, సొగ‌సుకీ ఆడ‌దనం అబ్బినట్లు ఉంది. తెర‌పై ఆమె న‌వ్వుతుంటే.. మ‌న‌సులో మెటిక‌లు విరుచుకోవాల్సిందే. ఇలాంటి అమ్మాయి నాకు దొరికితేనా.! అని కుర్రాళ్ళు అనుకొని తీరతారు. పల్లవి బాపు బొమ్మ కాదు, హీరోయిన్ మెటీరియల్ అంతకన్నా కాదు. కానీ తెలిసిన అమ్మాయిలా, మ‌నింటి అమ్మాయిలా అనిపిస్తుంది. అదొక్క‌టి చాల‌దూ మలయాళం నుండి వచ్చినా మనమ్మాయి అనుకోడానికి.! భానుమతిగా సాయి ప‌ల్ల‌వి న‌టించ‌లేదు. పరకాయ ప్రవేశం చేసింది.

  ఇలా మారిపోయింది....

  ఇలా మారిపోయింది....

  జ్యోతిక చంద్ర‌ముఖిలా మారిపోయిన‌ట్టు సాయి ప‌ల్ల‌వి భానుమ‌తిగా మారిపోయిందంతే. ఈ అమ్మాయిది తెలంగాణ కాదు, అస‌లు తెలుగ‌మ్మాయే కాదు అంటే, నమ్మలేనంతగా మారిపోయింది. క్లోజ‌ప్‌ షాట్లలో ఆమె ముఖంపై మొటిమ‌లతో ఎర్ర‌గా కందిపోయిన బుగ్గ‌లు క‌నిపిస్తాయి. అయినా కూడా ఆ మొటిమ‌లూ తెగ న‌చ్చేస్తాయి. అంత బాగుంది సాయి ప‌ల్ల‌వి. సాయి ప‌ల్ల‌వి, వ‌రుణ్ తేజ్‌ కి సరయిన్ జోడీనే కాదు. తాటి చెట్టు ముందు తుల‌సి మొక్క.. మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ ఎలా అవుతుంది. కానీ ఇద్ద‌రి మ‌ధ్య పండిన కెమిస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. హీరోయిన్ హీరోని దూరం చేసుకొంటున్నా, హీరో, హీరోయిన్‌ని దూరం పెడుతున్నా ప్రేక్ష‌కుడి గుండెలు కదిలిపోతుంటాయి.

  ఎందుకు ‘ఫిదా' అవుతామంటే..

  ఎందుకు ‘ఫిదా' అవుతామంటే..

  మన తెలుగు సినిమా ప్రేమ క‌థ‌ల్లో ప్రేమ త‌ప్ప అన్నీ క‌నిపిస్తుంటాయి. శేఖ‌ర్ క‌మ్ముల ఆ పైత్యానికి ప‌డిపోలేదు, అందుకే ఫిదాలో ప్రేమే క‌నిపించింది. ల‌వ్ స్టోరీ చూసి కెమిస్ట్రీ గురించి మాట్లాడుకొని ఎంత కాలం అయ్యిందో. ఫిదా ఆ లోటు తీరుస్తుంది. ప్రేమ క‌థ‌లో క‌థ లేక‌పోయినా ఫ‌ర్లేదు. ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఈ సినిమాలో కావ‌ల్సినంత ఉంది. త‌న ప్రేయ‌సి కోసం క‌ల‌ని, క‌న్న ఊరిని, త‌న ప్ర‌పంచాన్ని వ‌దిలి ఓ ప్రేమికుడు వ‌చ్చేసినంత ఉంది. అందుకే, ఫిదా ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది.

   అందుకేనేమో...

  అందుకేనేమో...

  బ‌హుశా పాత్ర‌ల్లో ఉన్న గొప్ప‌ద‌నం అలా అనిపించేలా చేసిందేమో. వ‌రుణ్‌తేజ్‌, మరో పదేళ్ళు ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. శశికాంత్ పాట‌లు బాగున్నాయి. ఫ‌స్ట్ ఆఫ్ ఏసీ బ‌స్సులో ప్రయాణంలా ఉంటే సెకండ్ ఆఫ్‌ రైలు ప్రయాణంలా అక్క‌డ‌క్క‌డ కాస్త కుదుపులతో ‘ఫిదా' చేసేలా ఉంటుంది.

  శేఖర్ కమ్ముల ‘ఆనంద్'కు రూపనిచ్చాడు ..'రాముడి'కి సీతనిచ్చాడు ..'వరుణ్'కి భానుమతి నిచ్చాడు .. టాలీవుడ్ కి సాయి'పల్లవి' నిచ్చి ‘ఫిదా' చేసాడు.

  English summary
  Varun Tej and Sai Pallavi paired Sekhar Kammula's Fida Telugu movie may create new trend.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X