twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడని మిస్టరీ:చక్రి కేసులో కొత్త మలుపు

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు జిల్లా చక్రధర్‌ అలియాస్‌ చక్రి మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లు సహజ మరణంగా భావించినా ఆయన కుటుంబ సభ్యుల గొడవ కారణంగా అది కాస్త అనుమానాస్పద మృతిగా మారింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా ( IPC సెక్షన్ 174 ) గా కేసు నమోదు చేశారు. అందుకు గల కారణాలను పోలీసులు వివరించారు.

    గత డిసెంబరు 14న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో చక్రి తన ఇంటికి వెళ్లారు. ఉదయం నిద్ర నుంచి లేవకుండా అచేతనస్థితిలో ఉండటంతో భార్య శ్రావణి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం ఆయనకు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత రెండు రోజులకే శ్రావణి, చక్రి తల్లి తరఫున కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ వాతావరణం వెలుగుచూసింది. జనవరి 9న శ్రావణి ఏకంగా తన భర్తపై మృతిపై అనుమానాలున్నాయని జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు.

    దీంతో పోలీసులు చక్రి తల్లి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు 9 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే 11న చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్‌లు కూడా చక్రి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రావణే చక్రి మృతికి కారణమంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చక్రి మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్‌ సామల వెంకటరెడ్డి తెలిపారు.

    Chakri's death is suspicious, Police register case

    తాజా పరిణామాలను ఓ సారి పరికిస్తే...

    సినీ సంగీత దర్శకులు చక్రధర్‌ అలియాస్‌ చక్రి కుటుంబ వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. 'చక్రి మృతిపై అనుమానాలున్నాయ'ని అతని భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసిన మర్నాడే.. చక్రి తల్లి, సోదరుడు కూడా జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించి 'మాకూ అనుమానాలున్నాయి.. మృతిపై విచారణ చేపట్టండి' అంటూ ఫిర్యాదు చేశారు.

    చక్రి మృతిచెందిన వారంలోపే ఆస్తి కోసం అత్త, మరిది వేధిస్తున్నారంటూ చక్రి సతీమణి శ్రావణి ఆరోపించారు. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్‌నూ ఆశ్రయించారు. సరిగ్గా నెల రోజులు స్తబ్ధుగా ఉన్న తర్వాత శనివారం చక్రీ భార్య శ్రావణి 'తన భర్త మృతికి ఆయన తల్లి తరఫు కుటుంబ సభ్యులే కారణ'మంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆదివారం చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్‌ నారాయణ్‌లు జూబ్లీహిల్స్‌ ఇన్స్‌పెక్టర్‌ సామల వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు.

    విద్యావతి ఇచ్చిన ఫిర్యాదులో 'చక్రి అనుమానస్పద మృతికి 20రోజుల ముందు నన్ను, మహిత్‌ను ఇళ్లు వదిలి వెళ్లాలంటూ శ్రావణి గొడవ చేసింది. తనకు చిత్రపరిశ్రమలో, పోలీసుశాఖలో పరిచయాలున్నాయంటూ బెదిరించింది. ఈ కారణంగానే నవంబరు 28న నేను, మా అబ్బాయి మహిత్‌ ఇళ్లు విడిచి వెళ్లాం. ఆ గొడవ ఫొటోలూ ఉన్నాయి. విషప్రయోగం కారణంగానే తన కుమారుడు మరణించి ఉంటాడు. కేవలం ఆస్తికోసమే శ్రావణి తల్లిదండ్రులతో కలిసి పథకం ప్రకారం ఇదంతా చేశారు. వైద్యపరీక్షల్లో ఎలాంటి రుజువులు లభించకుండా వాళ్లు జాగ్రత్తలు తీసుకొన్నారు. మాట వినకుంటే మాకు అదే గతి పడుతుందంటూ శ్రావణి బెదిరించింది.

    శ్రావణికి సంబంధించి మూడు ఫోన్‌ నెంబర్లు, ఆమె తల్లిదండ్రుల, సోదరుడి ఫోన్‌ నంబర్ల కాల్‌ డాటా పరిశీలించాలి. అలాగే అపోలో ఆసుపత్రి నుంచి వైద్య పత్రాలు (మెడికల్‌ సర్టిఫికెట్ల)ను సైతం తీసుకున్నారు. ఇదంతా బయటకు రాకుండా మీడియా ముందుకు వచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలో డ్రైవర్‌, మేనేజర్‌, మరికొంతమందిని అనుకూలంగా మలచుకుంది. శ్రావణి మమ్మల్ని తొందరపెట్టి శవపంచనామా జరగకుండా అంత్యక్రియలు పూర్తయ్యేలా చేసింది.

    చక్రి మృతిలో అతని భార్య శ్రావణి, ఆమె తండ్రి మధుసూదన్‌రావు, తల్లి అన్నమరాజు సురేఖ, సోదరుడు భరద్వాజలతోపాటు వారితో ఫోన్‌ సంభాషణలతో సంబంధం ఉన్న వారిపై విచారణ జరిపి మృతి వెనుక ఉన్న కారణాలను వెలికితీయాలి. తనకు, తన కుమారుడికి, కూతుళ్లకు రక్షణ కల్పించాల'ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సెక్షన్ల నమోదుకు న్యాయసలహాను తీసుకుంటున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ పేర్కొన్నారు.

    చక్రి...జగపతిబాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బాచి సినిమాతో సంగీత దర్శకుడు అయ్యారు. ఆయన వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో 1974 జూన్ 15న జన్మించారు.

    చక్రి సంగీతం సమకూర్చిన పాటల్లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, ఈ మధ్య కాలంలో సింహా వంటి అనేక సూపర్ హిట్స్ ని ఇచ్చారు. అలాగే తమిళం,కన్నడ చిత్రాల్లో కూడా ఆయన సంగీతం అందించారు. ఆయన నటుడుగానూ రంగ ది దొంగ(శ్రీకాంత్) చిత్రంలో కనిపించారు.

    ఆయన సంగీతం అందించిన రేయ్(సాయి ధరమ్ తేజ), తను మొన్నే వెళ్లిపోయింది(వంశీ దర్శకత్వం) ఇంకా విడుదలకావాల్సి ఉన్నాయి. వన్ ఇండియా తెలుగు చక్రి మృతికి సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తోంది.

    English summary
    Late Music Director Chakri's death has been reconsidered and a 'suspicious death' case is filed by police on 'unknown' under IPC section 174 in Jubilee hills police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X