»   » పైరసీ డబ్బు దొంగతనం లాంటిదే: చిరంజీవి

పైరసీ డబ్బు దొంగతనం లాంటిదే: చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిలీంనగర్ ‌లో పైరసీకి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు కూర్చున్న 'మాయగాడు' చిత్ర నిర్మాత రవిచంద్‌కు బుధవారం పీఆర్‌పీ అధినేత చిరంజీవి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...జేబులో నుంచి డబ్బు దొంగతనం లాంటిదే పైరసీ అని పీఆర్‌పీ అధినేత చిరంజీవి అన్నారు. పైరసీ గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించానని తెలిపారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు పైరసీని పీడీయాక్ట్‌లో చేర్చి అరికట్టగలిగిందని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా చిత్రపరిశ్రమకు తగిన న్యాయ చేయాలన్నారు.

గూండాయాక్ట్‌ కిందకు పైరసీని తీసుకురావాలని, చట్టంలో సవరణలు చేసి దోషులకు కఠిన శిక్ష అమలయ్యేలా చూడాలన్నారు. వైట్‌ కాలర్‌ నేరంగా దీన్ని పరిగణించాలని సూచించారు. పైరసీ అరికట్టే విషయంలో చిత్ర పరిశ్రమకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. పైరసీకి వ్యతిరేకంగా సినీ నిర్మాత వై. రవిచంద్ తలపెట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. రవిచంద్ దీక్షకు చిత్ర పరిశ్రమలోని వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్‌న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్, సినీ రచయితల సంఘంతో పాటు పలు సంఘాలు రవిచంద్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.

ఒకరోజు షూటింగ్‌ను నిలిపివేసి సినీ రంగం యావత్తూ ర్యాలీగా తరలివెళ్ళి పైరసీపై ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫిల్మ్‌నగర్‌లోని రవిచంద్ దీక్షా శిబిరాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు ఆయనకు మద్దతు ప్రకటించారు. పైరసీని తరిమి కొట్టడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu