»   » ప్రముఖ హాస్యనటుడు మాడ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు మాడ కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు మాడా(66) కన్ను మూశారు. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు మాడా వెంకటేశ్వర రావు. మాడాగా ఆయన అశేష తెలుగు ప్రేక్షకులను తన సినిమాల ద్వారా అలరించారు.

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన1950 అక్టోబరు 10న జన్మించారు. దాదాపు 300 పైగా చిత్రాల్లో తనదైన శైలిలో విభిన్న పాత్రలు పోషించి అశేష అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా రంగ ప్రవేశం చేయకముందు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలో ఇంజనీర్‌గా విధులు నిర్వహించారు.

Mada

నాటకాలపై మోజుతో ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయా ప్రదర్శనలను చూసిన ప్రముఖ దర్శకుడు దివంగత బాపూ తన చిత్రాల్లో మాడాకు అవకాశం కల్పించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హాస్యనటుడుగా మాడా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ' మంచి బ్రేక్‌ ఇచ్చింది. చూడు పిన్నమ్మా పాడు పిన్నడు అనే పాటకు నటన ద్వారా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.

ప్రముఖ దర్శకుడు దివంగత బాపూ దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాల ముగ్గు' చిత్రంలో మాడా కేవలం రెండు నిమిషాల పాత్రకే పరిమితమైనా.. ఆ చిత్రంలోనూ ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. అభిమానులు ఆయనను ‘అభినవ కళానిధి' అనే బిరుదుతో సత్కరించారు. తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, అల్లు రామలింగయ్య, శోభన్‌బాబు తదితరుల కాంబినేషన్‌లో ఆయన నటించారు. బుధవారంనాడు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

English summary
Telugu film comedian Mada Venkateswar Rao passed away last night in Appollo hospital.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu