»   » రెండేళ్ళు కష్టపడ్డ కథ అది: దిల్ రాజు

రెండేళ్ళు కష్టపడ్డ కథ అది: దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథ గురించి రెండున్నరేళ్ళ సమయాన్ని వెచ్చించాము. ప్రతి సన్నివేశం తాజాగా అనిపిస్తుంది అంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తాజా చిత్రం 'రామ రామ... కృష్ణ కృష్ణ' గురించి చెప్పుకొచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రామ్‌ హీరోగా దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ పై విధంగా చెప్పుకొచ్చారు. అలాగే 'లక్ష్యం.. తర్వాత శ్రీవాస్‌ చేస్తోన్న సినిమా ఇది. పరిశ్రమలో చాలామంది దర్శకులకి ద్వితీయ విఘ్నం ఉంటుంది. శ్రీవాస్‌ దాన్ని అధిగమించి మంచి విజయాన్ని సాధిస్తాడన్న నమ్మకం ఉంది. కీరవాణి చాలా వైవిధ్యమైన బాణీలను ఇచ్చారు. సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇక దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...నా తొలి చిత్రం 'లక్ష్యం' కన్నా ఎక్కువ కష్టపడి రాసుకున్న కథ ఇది. ఫలితం కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. హీరో తండ్రికి రాముడు, తల్లికి కృష్ణుడు అంటే ఇష్టం. అందుకే రెండు పేర్లను కలుపుకుని రామకృష్ణ అయ్యాడు. రామకృష్ణ పాత్ర చాలా కీలకమైంది. రాముడు, కృష్ణుడు చెప్పిన సారం ఒకటే అని తెలుసుకున్న రామకృష్ణ చేసిన మాయలేంటో తెరపై చూస్తేనే బాగుంటుంది. దీంట్లో అర్జున్‌ పాత్ర ప్రధానమని చెప్పుకొచ్చారు.

అనంతరం రామ్‌ మాట్లాడుతూ..శ్రీవాస్‌ చాలా గొప్పగా సినిమాను తీర్చిదిద్దారు. రత్నం మాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమాతో కీరవాణి స్వరకర్తగా డబుల్‌ సెంచురీని పూర్తిచేస్తున్నారు. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే సినిమా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిందు మాధవి, ప్రియా ఆనంద్‌, శిరీష్‌, లక్ష్మణ్‌, శేఖర్‌.వి.జోసెఫ్‌, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక రామ్ సరసన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్‌, బిందు మాధవి హీరోయిన్స్ గా చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu