»   » తెలంగాణా నాయకులను పోలిన పాత్రలతో సినిమా

తెలంగాణా నాయకులను పోలిన పాత్రలతో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేటి తెలంగాణ ఉద్యమంలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న నాయకులను పోలిన పాత్రలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. వర్తమానంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమంతోపాటు, చరిత్రలో జరిగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఈ చిత్రంలో ఉంటుంది అంటున్నారు దర్శకుడు ఎన్.శంకర్. ఆయన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో, అందర్నీ ఆకట్టుకునే అంశాలతో ఒక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ విశేషాలను తెలపటానికి గురువారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యూనివర్సల్ అంశాలతో రూపొందే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాం అన్నారు.

అలాగే నేను గతంలో చేసిన చిత్రాలన్నీ ఏదో ఒక నేపథ్యంతో రూపొందినవే. తెలంగాణ లోని కన్న తల్లుల కడుపు కోతకు నిలువుటద్దంగా 'ఎన్‌ కౌంటర్‌' తీశాను. రాయలసీమలోని వాస్తవిక అంశాలకు ప్రతిబింబంగా 'శ్రీరాములయ్య' రూపొందించాను. యమలోకం గురించి ఎంతో పరిశీలన చేసి 'యమజాతకుడు', జ్యోతీరావు పూలే స్ఫూర్తితో 'జయం మనదేరా', గోదావరిలాంటి మనసున్న ఓ అమాయకుడి కథా నేపథ్యంలో 'భద్రాచలం', పేద ప్రజల తిరుగుబాటును ఆవిష్కరిస్తూ 'ఆయుధం', సమసమాజస్థాపనను ఆకాంక్షిస్తూ 'రామ్‌' చిత్రాలు రూపొందించాను అన్నారు.

ఇక ఈ కొత్త చిత్రం మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందనీ, ప్రజాకవులు, కళాకారుల సేవలు వినియోగించుకుంటాంమనీ తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రూపొందించే చిత్రమైనప్పటికీ అన్ని ప్రాంతాల వారూ ఈ చిత్రానికి పనిచేస్తారు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిఫలించే చిత్రమే తప్ప ఎవరి మనోభావాలనూ అగౌరవపరిచే చిత్రం కాదు. గతంలో నేను రూపొందించిన చిత్రాలన్నీ సామాజిక అంశాలకు కమర్షియల్ విలువలను జోడించి రూపొందించినవే, ఈ చిత్రమూ వాటి సరసన నిలిచే చిత్రమే అవుతుంది. హీరో, హీరోయిన్, హీరో తల్లి పాత్రలు ప్రధాన పాత్రలుగా ఉండే ఈ సినిమాలో మొత్తం 64 కేరెక్టర్లుంటాయి. ఈ పాత్రలన్నిటినీ కొత్తవారి చేత ధరింపజేయాలని అనుకుంటున్నాను. దీనికోసం ఒక ఛానెల్ సహకారంతో ఆడిషన్ జరుపనున్నాను. ఒక కమిటీ మా చిత్రంలో నటించే నటీనటులను ఎంపిక చేస్తుంది' అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu