»   » నకిలీ పత్రాలతో బ్యాంకులకు టోకరా: సినీ నిర్మాత అరెస్టు

నకిలీ పత్రాలతో బ్యాంకులకు టోకరా: సినీ నిర్మాత అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయల రుణం తీసుకుని ఎగగొట్టిన సినిమా నిర్మాతను గురువారం అరెస్ట్‌ చేసినట్లు హైదరాబాద్ సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. ఈ కేసులో గోయల్‌ అనే వ్యక్తిని ఇప్పటికే ఆరెస్ట్‌ చేశారు. ఈ నిర్మాత రెండో నిందితుడు అని డీసీపీ వివరించారు.

షేక్‌ బషీద్‌ (42) వ్యాపారి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబరు 26లోని ప్లాట్‌ నెంబరు 304లో ఉంటున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఇతడు సినిమాపై మక్కువతో చదువు మధ్యలోనే ఆపేసి, సినీ విభాగాల్లో శిక్షణ పొంది హైదరాబాద్‌ చేరాడు.

Film producer arrested in cheating case

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అల్లరే అల్లరి, మెంటల్‌పోలీస్‌, నోటుకు పోటు సినిమాలు తీశాడు. ఇతరుల పేరిట వున్న ఖరీదైన ఆస్తులకు నకిలీపత్రాలను సృష్టించి నకిలీ కంపెనీల పేరుతో కుదువ పెట్టి రుణాలు పొందుతున్నారు.

విమల్‌ గోయల్‌, బషీద్‌ తదితరులు భాగస్వాములుగా జి.ఎం.జువెలర్స్‌ వ్యాపారం ప్రారంభించినట్లుగా పేర్కొంటూ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హిమాయత్‌నగర్‌ బ్రాంచ్‌లో రూ. 2కోట్ల రుణం పొందారు. దీనికి ష్యూరిటీగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 7లో ఉన్న విలువైన భూమిని తనఖా ఉంచారు. ఆ ఆస్తి హైమావతి అనే మహిళ పేరిట ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే తరహాలో జూబ్లీహిల్స్‌ సిండికేట్‌ బ్యాంకులో షేక్‌పేట్‌ ప్రాంతంలోని ఇంటిని గ్యారంటీగా ఉంచి బజ్జు ఎర్త్‌ మూవర్స్‌ పేరిట రూ.65లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. హెచ్‌ఎస్‌బీసీలో రూ.70లక్షలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల నుంచి రూ.70లక్షలు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ద్వారా రూ.35లక్షలు వేర్వేరుగా అప్పులు తీసుకున్నాడు. అనంతరం విలువైన ఆస్తులన్నీ వేరేవారి పేరుతో ఉన్నట్లు గుర్తించిన ఆయా బ్యాంకుల నిర్వాహకులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటీవలే గోయల్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం బషీద్‌ను అరెస్ట్‌ చేసి జుడిషియల్‌ రిమాండ్‌కు పంపారు. సినీ నిర్మాత బషీద్‌పై ఏపీ, కర్ణాటక, హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ స్టేషన్స్‌లో పాత కేసులున్నాయి. రెండు కేసుల్లో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్స్‌ పెండింగ్‌లో ఉన్నట్లు డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.

English summary
A Film producer Shaik Bashid has been arrested in Hyderabad for cheaing banks with fake docments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu