twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య‌... 'డామిట్‌ కథ అడ్డం తిరిగింది'

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వ్యవహారంలో రోజుకో వార్త హైలెట్ కావటం తర్వాత అది కాదు అని తేలటం గత వారం రోజులుగా జరుగుతోంది. గత రెండు రోజులుగా ఉదయ్ కిరణ్ ఆత్మ హత్యకు...ఆయన ఆఖరి చిత్రం 'డామిట్‌ కథ అడ్డం తిరిగింది' లింక్ గురించి మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిపైనా వివరణ రావటంతో మరింత లోతుకు వెళ్లాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    'డామిట్‌ కథ అడ్డం తిరిగింది' చిత్రానికి సంభందించి ఓ మహిళా ఫైనాన్షియర్‌ ఒత్తిళ్ల వల్లే ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పైనాన్షియర్‌గా పేర్కొంటున్న సంగీత స్పష్టం చేశారు. మున్నాకు తానిచ్చిన డబ్బుకు సంబంధించి ఉదయ్‌కిరణ్‌ ఎలాంటి ప్రామిసరీ నోట్‌ రాసివ్వలేదని, తమ మధ్య ఆయన హామీదారు కూడా కాదని ఆమె తెలిపారు. డబ్బు చెల్లించాలని తాను ఏనాడూ ఉదయ్‌ కిరణ్‌పై ఒత్తిడి తీసుకురాలేదన్నారు.

    Financiar Sangeetha about Uday Kiran Suicide

    ఆదివారం రాత్రి నారాయణగూడలో అఖిలభారత మానవహక్కుల సంస్థ (ఆంధ్రప్రదేశ్‌) మాజీ చీఫ్‌ వసంత్‌కుమార్‌గౌడ్‌, మరో ఫైనాన్షియర్‌ శివతో కలిసి సంగీత విలేకరులతో మాట్లాడారు. తనకు చిత్తూరు జిల్లా కుప్పంలో 'సంగీత చీరల దుకాణం' ఉందని, ఇటీవల నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన లక్షదీపారాధన ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు తెలిసిన వ్యక్తి ద్వారా మున్నా పరిచయం అయ్యాడని తెలిపారు.

    తాను ఉదయ్‌కిరణ్‌ హీరోగా 'డామిట్‌ కథ అడ్డం తిరిగింది' నిర్మిస్తున్నట్లు మున్నా చెప్పాడని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా.. ''మా చీరల దుకాణం నుంచి తన చిత్రానికి కాస్ట్యూమ్స్‌ ఇవ్వాలని అడిగాడు. తన చిత్రంలో బాలనటుడిగా మా అబ్బాయికి అవకాశం ఇస్తాను''అని మున్నా చెప్పాడని సంగీత వివరించారు.

    ''కొంత మొత్తం ఇస్తే షూటింగ్‌ మొదలవుతుంది. సహ నిర్మాతగా నా పేరు వేస్తానంటూ మున్నా నమ్మించాడు. దీంతో తెలిసిన వారి నుంచి 5 నుంచి 7 శాతం వడ్డీతో డబ్బు అప్పుగా తీసుకొచ్చి మున్నాకు రూ.17 లక్షలు ఇచ్చాను''అని సంగీత తెలిపారు. ''డబ్బులు తీసుకోవటానికి ముందు మున్నా.. హీరో ఉదయ్‌కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడించాడు. అప్పుడు ఉదయ్‌... మున్నా తీస్తున్న చిత్రంలో తానే హీరోనని, నమ్మదగిన వ్యక్తి, డబ్బు ఇవ్వవచ్చునని చెప్పారు''అంటూ సంగీత వెల్లడించారు.

    మూడునెలల్లో డబ్బు తిరిగి ఇస్తానన్న మున్నా.. అయిదు నెలలు కావొస్తున్నా ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. పైగా ఫోన్‌ చేసినా స్పందించలేదని, రిజెక్ట్‌ కాల్‌లో పెట్టాడని ఆమె వాపోయారు. ఈ క్రమంలోనే తనకు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిందని, తాను తీసుకొచ్చిన రూ.17 లక్షలు వడ్డీతో కలిపి రూ.27 లక్షలు అయ్యిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో హైదరాబాద్‌లోని మున్నా ఆఫీసుకు వెళితే..తాళం వేసి ఉందని, అతడి ఆచూకీ అడిగి తెలుసుకునేందుకే ఉదయ్‌కిరణ్‌ ఇంటికి వెళ్లినట్లు సంగీత వివరించారు.

    ఆ సమయంలో ఉదయ్‌ కిరణ్‌ చెన్నైలో ఉన్నారని వాచ్‌మెన్‌ చెప్పాడని సంగీత తెలిపింది. మరోమారు వచ్చినప్పుడు ఉదయ్‌ కిరణ్‌ బయటే నిలబెట్టి మాట్లాడి పంపించారన్నారు. తను ఫోన్‌ చేసినా మున్నా స్పందించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉండి, తిరుగుతున్నట్టుగా ఉన్నాడని, కంగారు పడొద్దంటూ ఉదయ్‌ ధైర్యం చెప్పారని వివరించారు. ఆ రోజు తరువాత ఉదయ్‌ను ఫోన్‌లోగానీ, ఇంటికి వెళ్లిగానీ కలవలేదని ఆమె చెప్పారు.

    ''తెచ్చిన రుణాలకు వడ్డీ పెరిగిపోవడం, మున్నా మోసం చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాను''అని సంగీత వాపోయారు. వాస్తవానికి ఉదయ్‌ భార్యను తానింత వరకు చూడలేదని ఆమె స్పష్టం చేశారు. కానీ, ఉదయ్‌ కిరణ్‌ భార్య తన పేరెందుకు చెప్పారో తెలియదని సంగీత అన్నారు. దాంతో పత్రికల్లో, మీడియాలో 'ఫైనాన్షియర్‌ సంగీత ఒత్తిళ్ల వల్లే' ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నారని వార్తాకథనాలు వచ్చాయని, అది నన్ను మరింత కృంగదీశాయని అన్నారు.

    ఈ మధ్య పోలీసుల నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్‌ వచ్చానని, బంజారాహిల్స్‌ ఎస్సై సంతోషం అసలు ఏం జరిగిందో తెలిసుకోకుండా నన్ను రెండు రోజులుగా తిప్పుకొన్నారని సంగీత మీడియాకు చెప్పారు. చివరకు అఖిలభారత మానవహక్కుల సంస్థ (ఆంధ్రప్రదేశ్‌) మాజీ చీఫ్‌ జి.వసంత్‌కుమార్‌గౌడ్‌ సహయంతో బయటపడ్డానన్నారు. తాను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నానని, హైదరాబాద్‌లోని ఆశ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నానని సంగీత చెప్పారు.

    వాస్తవానికి ఉదయ్‌కిరణ్‌.. మున్నా మంచివాడనే చెప్పారు కానీ.. ఆయన మాకు హామీదారు కాదు.. ప్రామిసరీ నోటూ రాసివ్వలేదు. అలాంటప్పుడు డబ్బులు చెల్లించమని ఉదయ్‌ కిరణ్‌పై ఒత్తిడి పెంచాల్సిన అవసరం తనకేమిటని సంగీత ప్రశ్నించారు. మున్నానే తనను నమ్మించి మోసం చేశాడని గద్గద స్వరంతో చెప్పారు.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో మా వూరికి వెళ్లాలన్నా భయంగా ఉందని, మరో వైపు వ్యాపారం కుప్పకూలిపోయిందని అన్నారు. మరో ఫైనాన్షియర్‌ శివ మాట్లాడుతూ.. 'డామిట్‌ కథ అడ్డం తిరిగింది' చిత్రం దాదాపు 40 శాతం పూర్తి చేశామన్నారు. ఆ సమయంలో ఉదయ్‌ కిరణ్‌ బాధల్లో ఉన్నట్టుగానీ, దిగాలుగా కానీ కనిపించలేదు. హుషారుగానే కనిపించేవారనని శివ తెలిపారు. ఉదయ్‌కిరణ్‌..ఫైనాన్షియర్ల ఒత్తిడి వల్లే చనిపోయారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని శివ అన్నారు.

    English summary
    woman financier Sangeeta clarified that she did not lend any money to Uday Kiran. It was his former manager Munna to whom she loaned Rs 17 lakhs for Uday’s film and in return Munna, who was producing the film promised her to cast her son in the film. But later when Munna absconded, the financiar went to Uday Kiran’s flat at Srinagar Colony twice only to inquire about the film’s progress as the interest rate was going up. She said that she was shocked to learn about Uday's death on January 6th morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X