»   »  సూపర్ స్టార్ కి ....బర్త్ డే విషెష్!

సూపర్ స్టార్ కి ....బర్త్ డే విషెష్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Krishna
ఎందరు స్టార్లు వచ్చినా సూపర్ స్టార్ మాత్రం కృష్ణ మాత్రమే అనేది తెలుగువాడి నమ్మకం. వారి నమ్మకాన్ని చెక్కుచెదరనీయకుండా సాహసమే తన ఊపిరిగా చేసుకుని 43 ఏళ్ళ తన నటనాజీవితాన్ని సార్ధకం చేసుకున్న ఈ నటశేఖరుడు ఈ రోజు తన 65 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.

కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని రామకృష్ణ. గుంటూరు జిల్లా బుర్రిపాలెం లో జన్మించి... ప్రాథమిక విద్యను తెనాలిలో పూర్తి చేసుకున్నారు. తరువాత ఏలూరు సిఆర్‌రెడ్డి కళాశాలలో బి.యస్సీ పూర్తి చేశారు. అక్కడ చదువుతున్నప్పుడే ఆయన మనస్సు సినిమాలమీద మళ్ళింది. ఆ కలను నిజం చేయటానికి చెన్నై చేరుకొని తేనె మనసులు (1965) చిత్రంతో వెండి తెర ప్రవేశం చేశారు.ప్రారంభ చిత్రం పెద్ద పేరు తేకపోయినా నటుడుగా గుర్తింపుతెచ్చిపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాలలో చేసినా స్టార్‌డమ్‌... మాస్‌ ఫాలోయింగ్‌... ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పేరుతెచ్చిన సినిమా మాత్రం 'గూడచారి 116'. ఆ సినిమా ఘన విజయంతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.

తర్వాత వచ్చిన జగత్‌ కిలాడీలు... పచ్చని సంసారం... ఏజెంట్‌ గోపీ... మోసగాళ్ళకు మోసగాడు...అవే కళ్ళు... వింత కాపురం.... జేమ్స్‌బాండ్‌ 777... అల్లూరి సీతారామరాజు... అగ్నిపర్వతం... సింహాసనం... ఈనాడు... చిత్రాలు కృష్ణకు లక్షల్లో అభిమానులను సంపాదించి పెట్టాయి. అలాగే ఆయనకున్న మరో క్రెడిట్...ఎక్కువ మల్టీస్టారర్‌ చిత్రాలలో నటించటం. ఆయన కౌబాయ్‌గా నటించిన చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు'..మరో రికార్డు. ఇంగ్లీషులో ట్రెజర్‌ హంట్‌ పేరుతో 52 దేశాలలో ప్రదర్శించారు. బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ప్రయోగ చిత్రం 'సాక్షి' .... మాస్కో ఫిలిం ఫెస్టివల్‌ వరకు వెళ్లింది. ఆ సినీ హీరోయిన్ విజయనిర్మలనే కృష్ణ వివాహం చేసుకున్నారు. ఇక టెక్నికల్ గా తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్ళిన ఘనతా ఆయనదే. తెలుగు సినిమాకు స్కోప్‌ను పరిచయం చేసిందీ కృష్ణే.

స్వీయ నిర్మాణంలో రూపుదిద్దుకొన్నఅధ్బుతం 'అల్లూరి సీతారామరాజు' .ఆ సినిమా ఆయనకు వందవ చిత్రం. ఈ సినిమాకు బంగారు నంది లభించింది. పండంటి కాపురం చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు, కథానాయకుడు చిత్రానికి రజిత నంది లభించాయి. 1972లో 18 చిత్రాలలో నటించి ప్రపంచ రికార్డు సృష్టించారు. తమ అభిమాన కధానాయకుడు కృష్ణను 1976లో అభిమానులు నటశేఖర బిరుదుతో సత్కరించారు. తెలుగులో 70 ఎంఎం చిత్రంగా సింహాసనం పరిచయం చేశారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించి సంచలనం సృష్టించారు. 1983లో విజయవాడలో కృష్ణ నటించిన ఆరు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ హీరోకు దక్కలేదు. అతి తక్కువ సమయంలో 330 చిత్రాలలో పైగా నటించి మెప్పించారు..

సినిమాల లోనే కాకుండా రాజకీయాల్లోనూ తన సత్తాను చాటుకున్నారు. జై ఆంధ్రా ఉద్యమానికి సినిమా పరిశ్రమ నుంచి మద్దతు తెలిపింది ఒక్క కృష్ణ మాత్రమే. 1989లో ఏలూరు నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. తన నట జీవితంలో వంద మంది దర్శకులు, 70 మంది కథానాయికలు, 52 మంది సంగీత దర్శకులతో పనిచేశారు. . హీరోగా, నిర్మాతగానే కాకుండా 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 336 చిత్రాలలో హీరోగాను... 20 సినిమాలలో అతిథి నటునిగాను నటించారు. 48 చిత్రాలలో విజయనిర్మల, 42 చిత్రాలలో జయప్రద, 31 చిత్రాలలో శ్రీదేవి, 23 చిత్రాలలో రాధ హీరోయిన్లుగా నటించారు.

సుప్రసిద్ద హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరిని తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిందీ ఆయనే. జాతీయ విపత్తుల సమయంలో స్పందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వగ్రామం బుర్రిపాలెంలో తన తల్లి నాగరత్నమ్మపేరు జిల్లా పరిషత్‌ పాఠశాలను నిర్మించారు. 2003లో ఎన్టీఆర్‌ స్మారక అవార్డు లభించగా.. ఇటీవల ఆంధ్రా యూనివర్సిటీ కళాప్రపూర్ణతో సత్కరించింది.

ప్రస్తుతం రవితేజ హీరోగా చేస్తున్న బలాదూర్...లోనూ,విక్రమ్ ...మల్లన్న లోనూ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.అలాగే బొల్లిముంత నాగేశ్వరరావు నవల వల ఆథారంగా విజయనిర్మల దర్శకత్వంలో సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

పిల్లలంతా చక్కగా సెటిలై...తన కుమారుడు మహేష్ తెలుగు పరిశ్రమను యోలుతూంటే చక్కగా హ్యాపీగా ఉన్నారాయన.దీనికంతటికి ప్రధాన కారణం ఆయనలోని దాతృత్వ గుణం...మంచితనం...కలుపుగోలుతనం .అటువంటి అరుదైన హీరో తెలుగు పరిశ్రమకు దొరకటం అదృష్టం. ఆయన ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని దట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తోంది

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X