»   » నటుడు 'కళ్లు చిదంబరం' ఆరోగ్యం విషమం

నటుడు 'కళ్లు చిదంబరం' ఆరోగ్యం విషమం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రంగస్థల, సినిమా నటుడు కళ్లు చిదంబరం ఆరోగ్యం విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


చిత్ర పరిశ్రమలో వివిధ రకాల పాత్రలను పోషించడానికి విశాఖపట్నం నుంచి వెళ్లిన ఎందరో నటుల్లో చిదంబరమూ ఉన్నారు. అంతకు ముందు ఆయన నాటక రంగంపై మక్కువతో దాదాపు 14 ఏళ్లపాటు సాంస్కృతిక కార్యకలాపాలలో అవిశ్రాతంగా అన్ని ప్రాంతాలూ తిరిగారు. దీని వల్ల ఒక కంటి నరం దెబ్బతిని పక్కకు లాగేయడంతో 36వ ఏట వరకు సాధారణంగా ఉన్న అతని కన్ను పూర్తిగా మెల్లకన్నుగా మారిపోయింది.

అలా కలిగినందుకు బాధపడకుండా 'కళ'కు దూరం కాకుండా యథాతథంగా నాటకాలు వేయసాగారు. అప్పట్లో ఆయన పేరు కొల్లూరు చిదంబరం. మొట్టమొదట ప్రసిద్ధ దర్శకులు సత్యానంద్‌, మిశ్రో తదితరుల బృందాలతో నాటకాలు వేసేవారు. కొద్ది కాలం అనంతరం వాణి ఆర్ట్స్‌ అసోసియేషన్‌ పేరుతో వివిధ నాటికలు, నాటకాలను ప్రదర్శించారు. వివిధ పరిషత్‌లలో పాల్గొని బహుమతులు పొందారు.

chidambaram kallu

1960లో ''భజంత్రీలు'' అనే నాటికలో తొలిసారిగా నటించారు. ఆ తర్వాత బ్రహ్మచారులు నాటికలో నటించారు. తోలు బొమ్మలాట, ట్రీట్‌మెంట్‌, పండగొచ్చింది, రైలుబండి, సిప్పొంచింది, గప్‌చిప్‌ వంటి నాటికల్లో నటించి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎవ్వనిచే జనించు, వశీకరణం నాటికలు కూడా అతనికి పేరు తెచ్చాయి.

36వ ఏట ఒక కన్ను మెల్ల కన్నుగా మారటడంతో విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అసిస్టెంటు ఇంజినీర్‌ ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. 1987లో ఉద్యోగానికి, కళారంగానికి దూరమై ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు.

ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ రఘు కళ్లు అనే సినిమా తీయడానికి ప్రయత్నించిన సందర్భంలో అందులో నటించాలని ప్రముఖ దర్శకుడు ఎల్‌ సత్యానంద్‌ కోరగా కొల్లూరు చిదంబరం అందుకు అంగీకరించారు. ఆ ఒక్క సినిమాతోనే నటునిగా సత్తా చాటుకున్న కొల్లూరు చిదంబరం కాస్త 'కళ్లు' చిదంబరంగా ఖ్యాతిగాంచారు.

అనంతరం ఒక దాని తర్వాత మరొకటిగా సినీ రంగంలో అవకాశాలు రావడంతో 300 వరకు చిత్రాల్లో నటించారు. ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్‌ ఒకటి విడుదల, అమ్మోరు, మనీ, గోవిందా గోవిందా, పవిత్ర బంధం, అనగనగా ఒకరోజు వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.

కళ్లులో పాత్రకు నంది పురస్కారం, కళాసాగర్‌ (మద్రాస్‌) పురస్కారం లభించడం తనకు ఎంతో సంతోషం కలిగిందని చిదంబరం చెబుతుంటారు. ప్రస్తుతం సకల కళాకారుల సమాఖ్య వ్యవస్థాపకునిగా వ్యవహరిస్తూ, నగరంలోని ప్రహ్లాదపురంలో ఆయన నివసిస్తున్నారు.

English summary
Telugu Comedian Kallu Chidambaram hospitalised in Vizag.
Please Wait while comments are loading...