»   » సాహసాల యువరాజు కోసం ఒక కుటీరం .... ఆనాటి స్టార్ హీరో కత్తి కాంతారావు కుటుంబం కొసం

సాహసాల యువరాజు కోసం ఒక కుటీరం .... ఆనాటి స్టార్ హీరో కత్తి కాంతారావు కుటుంబం కొసం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తాడేపల్లి లక్ష్మీ కాంతారావు ఈయనే కత్తి కాంతారావు అంటారు. తెలుగు ఇండస్ట్రీలో జానపద చిత్రాల్లో ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు వచ్చింది ఈయనకే..అంతే కాదు ఎన్టీఆర్ మెచ్చిన నటుడు కూడా కాంతారావు కావడం విశేషం. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. కాంతారావు 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు.

  ఇక ఇండస్ట్రీలో విఠలాచార్య, కాంతారావు కాంబినేషన్ అంటే అప్పట్లో భలే క్రేజ్ ఉండేది. మాయలు..మంత్రాలు, దెయ్యాలు వాటితో పోరాటాలు అప్పట్లోనే చాలా వరకు గ్రాఫిక్స్ ఉపయోగించి చిత్రాలు తీశారు. అందుకే కాంతారావు అప్పట్లో గండర గండడు,కత్తి కాంతారావు అని పిలిచే వారు. ఒక్క నటుడిగానే కాకుండా సప్తస్వరాలు (1969),గండర గండడు (1969),ప్రేమ జీవులు (1971),గుండెలు తీసిన మొనగాడు (1974),స్వాతి చినుకులు (1989) చిత్రాలు కూడా నిర్మించారు. అయితే వీటిలో ఒకటి రెండు బాగా హిట్ అయిన చిత్రాలుగా ఉన్నా మిగిలినివి చాలా నష్టాల్లోకి తీసుకు వెళ్లాయి. తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చారు. తోటి నటులు ఆర్థికంగా బాగా సెటిల్ అయినా కాంతా రావు మాత్రం కాలేక పోయారు. ఒక దశలో చెప్పాలంటే ఆయన చివరిరోజుల్లో చాలా దుర్భర పరిస్థితిలో జీవించినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటారు. కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులో ని యశోద హాస్పిటల్ లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు. ఇప్పుడు కాంతారావు ఫ్యామిలీ చాలా దీనావస్థలో ఉంది. ఆర్థికంగా చాలా దీనావస్థలో కాంతారావుగారి కుటుంబం ఉంది.

  అంత గొప్పగా ఎదిగి నిలిచిన రావు గారి కుటుంబం ఇప్పటికి అద్దె ఇంట్లోనే . ఆస్తులు లేవు.. సొంత ఇల్లూ లేదు.. మన నేల నుండి ఎదిగిన ఆయన, అయన కుటుంబం మాకొక ఇల్లు కావాలని దేబిరించి మనల్ని అడగాల..మన పాత తరం చేసిన తప్పుల్లో/వివక్ష లో కొట్టుకుని విలవిలలాడిన ఆయనని మనమేలాగూ వెనక్కు తెచ్ఛుకొలేం.. కానీ అయన కుటుంబాన్ని ఆదుకుని ఆ తరం చేసిన తప్పుని ఈతరం గా సరి దిద్దలేమా... అన్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానం లభించింది... రవీంద్రభారతిలో తెలంగాణ బాష సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో బహు ప్రజ్ఞాశాలి సహజనటుడు డాక్టర్.ఎం.ప్రభాకర్ రెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు.ఈ సమావేశంలో చిత్రపురి హిల్స్ అధ్యక్ష్యుడు కొమర వెంకటేష్ గారు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఇటీవల ఇదే వేదిక పై సినీ నటుడు కత్తి కాంతారావు గారి వేడుకలు నిర్వహించారు.ఈ సమావేశంలో చివరి రోజుల్లో కాంతారావు గారు పడిన ఇబ్బందులు,అయన కుటుంబ ప్రస్తుతం పడుతున్న దిన స్థితి పలువురిని బాధించింది . ఈ సమావేశంలో పాల్గొన్న మిత్రుడు నరేందర్ అయన కుటుంబ పరిస్థితి వివరిస్తూ తన వంతు భాద్యతగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం నిర్వహించాడు, ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ కాకుండా, ప్రభుత్వానికి సినీ పెద్దలకు వారికీ హైద్రాబాద్ లో సొంత ఇల్లు కేటాయించాలి అని విజ్ఞప్తి చేసారు.

  ఈ క్రమంలో జరిగిన సమావేశం లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు ఈ విషయాన్ని చిత్రపురి హిల్స్ అధ్యక్ష్యుడు కొమర వెంకటేష్ గారి దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన అయన త్వరలోనే కాంతారావు గారి కుటుంబాన్ని కలిసి వారికీ చిత్ర పురి హిల్స్ లో ఇల్లు కేటహిస్తామని ప్రకటన ఇచ్చారు. వారి కుటుంబానికి త్వరలోనే ఇల్లు కేటాయిస్తామన్న కొమర వెంకటేష్గారినీ, మామిడి హరికృష్ణ గారికీ కృతఙ్నతలు తెలుపుతూ వచ్చే పోస్టులు కాంతారావుగారిని తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోదని ౠజువు చేస్తున్నాయి...

  అగ్ర హీరోగా:

  అగ్ర హీరోగా:

  టి.ఎల్‌. కాంతారావు పేరు చెప్పగానే మనకు సుమారు 50 జానపద సినిమాలు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వస్తాయి. ధైర్యవంతుడు, సాహసవంతుడు అయిన రాకుమారుడు మాంత్రికుని మాయజాలం నుండి తన రాజ్యాన్ని, రాకుమారిని ఎలా రక్షిస్తాడో కాంతారావు సినిమాలు చూస్తే మనకు ఒక స్వాప్నిక జగత్తు ఆవిష్కారమవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వారి చేతుల్లో, ఒకే సామాజిక వర్గం కనుసన్నల్లో నడిచే తెలుగు సినిమా రంగంలో ఒక తెలంగాణవాడిగా ఒక అగ్ర హీరోగా కాంతారావు నిలద్రొక్కుకుని మనగలిగాడంటే అదొక అరుదైన జీవన విజయ గాథ. అతడు మనవాడు. మన కథానాయకుడు. అచ్చ తెలంగాణవాడు.

  రంగస్థలంపై చిన్న చిన్న వేశాలు :

  రంగస్థలంపై చిన్న చిన్న వేశాలు :

  నల్గొండ జిల్లా కోదాడ దగ్గరలోని గుడిబండ గ్రామంలో తాడేపల్లి కేశవరావు - సీతారామమ్మ దంపతులకు 1923 నవంబర్‌ 16న జన్మించారు కాంతారావు. మూడేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయారాయన. కోదాడలోనే ఉర్దూభాషలో వస్తానియా (7వ తరగతి) వరకు చదువుకున్నారాయన. చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్న కాంతారావు రంగస్థలంపై చిన్న చిన్న వేశాలు వేశారు. తన 15వ ఏట చదువు చాలించిన ఆయన సొంతవూరిలోనే వంశపారం పర్యంగా సంక్రమించే ‘పటేల్‌'గా ఉద్యోగంలో చేరారు. బహుశా ఈ ఉద్యోగం వల్లనే ఆయన నటనకాంక్షను నెరవేర్చుకోగలిగారనిపిస్తుంది

  ఖర్చులకు పదెకరాల భూమి అమ్మి:

  ఖర్చులకు పదెకరాల భూమి అమ్మి:

  తొలిసారిగా సురభి నాటక సమాజం వారి నాటకంలో బ్రహ్మదేవుని వేషం వేశారు కాంతారావు. ఆ తరువాత మధుసేవ, కనకతార, గయోపాఖ్యానం వంటి తెలుగు నాటకాల్లో, హిందీలో మేవాడ్‌, బొబ్బిలి వంటి నాటకాల్లో నటించారు. ఇంతలో ఆయన మనసు సినిమాలవైపు మళ్లింది. అప్పటికే ఖర్చులకు పదెకరాల భూమి అమ్మివేశారాయన. ఆ డబ్బుతో మద్రాసు వెళ్లారు. 1952 డిసెంబర్‌లో విడుదలైన ‘ఆదర్శం' సినిమాలో ఇద్దరు హీరోల్లో ఏదో ఒక వేషం వస్తుందని ఆశించినా ఏ అవకాశం రాలేదాయనకు. ఆ రెండు వేషాలూ జగ్గయ్య, రామశర్మలకు దక్కినవి. ఇది తెలంగాణ నిర్మాతలు తీసిన తొలిచిత్రం.

  ఇంటికి తిరిగి వెళ్లాలని:

  ఇంటికి తిరిగి వెళ్లాలని:

  మద్రాసులో సినిమాల్లో నటించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్యకాలంలో మద్రాసులో వేసిన ‘మేవార్‌' నాటకంలో ‘మొహబ్బుత్‌ఖాన్‌' వేషం వేయవలసిన టి.కృష్ణ (ఎడిటర్‌) కారణాంతరాల వల్ల పాల్గొనలేకపోతున్నానని ఆ పాత్రను కాంతారావును వేయవలసిందిగా కోరారు. అప్పటికే పలు హిందీ నాటకాల్లో నటించిన అనుభవం ఉండటం వల్ల ఆ వేషం కాంతారావు వేశారు. నాటకంలో ఆయన నటన చాలామంది ప్రశంసలందుకున్నది.

  సరదా తీరకుండానే:

  సరదా తీరకుండానే:

  అప్పుడు టి. కృష్ణ రోహిణీ వారి ‘నిర్దోషి' సినిమాకు పనిచేస్తున్నాడు. సినిమాల్లో నటించాలనే సరదా తీరకుండానే ఎట్లా పోతావని ‘నిర్దోషి'లో ఒక పల్లెటూరి రైతు వేషం వేయించాడు. ఒకే ఒక్క డైలాగ్‌ ఉన్న పాత్ర! కానీ నటన, పలుకు రెండూ నచ్చి వెంటనే ఆ పాత్రకు నాలుగు డైలాగులు రాయించి రీషూట్‌ చేయించారు దర్శకుడు హెచ్‌.ఎం. రెడ్డి. సరిగ్గా ఇక్కడే కాంతారావు నట జీవితం మలుపు తిరిగింది. నటనలో నిగూఢమైన మెరుపును కనిపెట్టిన రెడ్డిగారు కెమెరామెన్‌ పి.ఎల్‌. రాయ్‌ని పిలిచి ముఖవర్చస్సును, సౌండ్‌ ఇంజనీర్‌ని పిలిచి డైలాగ్‌ డెలివరి పరిశీలించి ఇతడే నా తరువాతి సినిమా హోరో అని ప్రకటించారు. అట్లా తెలుగు సినిమా రంగంలోకి తొలి తెలంగాణ హీరో ప్రవేశం జరిగింది. దాదాపుగా ఇదే కాలంలో ఆర్‌. నాగేశ్వరరావు వచ్చినా అతడు విలన్‌ వేషాలకు ఎంపికైనారు.

  హీరోయిన్‌గా సావిత్రి:

  హీరోయిన్‌గా సావిత్రి:

  "ప్రతిజ్ఞ" సినిమాతో మన కాంతారావు హీరోగా వెండితెరకు పరిచయమైనారు. అదీ తెలుగు, తమిళ భాషల్లో. తమిళంలో బాగా ఆడకపోయినా తెలుగులో శతదినోత్సవాలు జరుపుకున్నది. హీరోయిన్‌గా సావిత్రి. ప్రతి నాయకునిగా నెల్లూరు రాజనాల కల్లయ్య నటించాడు. అయితే రాజనాలకు హీరో వేషంపై మోజు ఉండటంతో తనకు విలన్‌ వేషం వచ్చినా యూనిట్‌ వారిని మేనేజ్‌ చేసుకుని టైటిల్స్‌లో తన పేరు ముందుగా తరువాత కాంతారావు పేరు వచ్చేటట్లు చేశారు. దాంతో కాంతారావును విలన్‌గా అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి చాలాకాలమే పట్టింది మన కాంతారావుకి. తెలుగు సినిమా రంగంలో తెలంగాణ వారి పట్ల ఎలాంటి వివక్షత వుంటుందో ఈ సంఘటన మనకు నిదర్శనంగా నిలుస్తుంది.

  జయసింహ:

  జయసింహ:

  ‘ప్రతిజ్ఞ' తెలుగులో విజయవంతమైనా ఆ వెంటనే రెండో సినిమాకు అవకాశం రాలేదు. రెండేళ్ల తరువాత గాని విఠలాచార్య ‘కన్యాదానం' (1955)లో నటించారాయన. ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఎన్‌.టి.ఆర్‌. తీసిన ‘జయసింహా' (1955)లో తమ్ముడు విజయసింహుడు వేషం ఇచ్చారు. జయసింహ గొప్పవిజయం సాధించి కాంతారావుకి మంచి పేరు రావడమే గాక భవిష్యత్తుకు ఆటంకాలు లేని బాట వేసిపెట్టింది. ఆ తరువాత ‘భక్తమార్కండేయ', ‘గౌరీమాహత్మ్యం' (శివునిగా) ‘ఇలవేలుపు'లో గెస్ట్‌రోల్‌లో (1956), ‘సతీ అనసూయ' (1957), శ్రీరామాంజనేయ యుద్ధం, గంగా గౌరీ సంవాదం (1959) పౌరాణిక చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న వేషాలు వేసిన కాంతారావు నట జీవితాన్ని మలుపుతిప్పిన దర్శకుడు విఠలాచార్య. తక్కువ ఖర్చుతో, తక్కువ టైమ్‌లో సినిమాలు నిర్మించి విడుదల చేయడం ఆయనలోని ప్రత్యేకత.

  కాంతారావు - విఠలాచార్యల కాంబినేషన్‌:

  కాంతారావు - విఠలాచార్యల కాంబినేషన్‌:

  విఠలాచార్య తానొక జానపదం తీయాలనుకుని కాంతారావును హీరోగా ఎంపిక చేసుకుని ‘జయ-విజయ' (1959) తీశారు. ఈ సినిమా విజయం సాధించడంతో కాంతారావు - విఠలాచార్యల కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ జానపదాలు రూపొంది తెలుగు సినిమారంగంలో జానపద చిత్రాలకు ఒక అధ్యాయం ఏర్పడింది. విఠలాచార్య డైరెక్షన్‌లో కాంతారావు ‘కనకదుర్గ పూజా మహిమ' (1960), ‘వరలక్ష్మీ వ్రతం' (1961) ‘మదన కామరాజు కథ' (1962), గురువును మించిన శిష్యుడు' (1963), ‘నవగ్రహ పూజా మహిమ' (1964), విజయసింహ (1965), ‘జ్వలాద్వీప రహస్యం' (1966), ‘ఇద్దరు మొనగాళ్లు' (1967) ‘భలే మొనగాడు', ‘పేదరాశి పెద్దమ్మ' (1968) చిత్రాలతో కలిపి మొత్తం డజన్‌ సినిమాల్లో హీరోగా నటించారు. కాంతారావు పక్కన నాయికలుగా కృష్ణకుమారి, రాజశ్రీలను తప్ప మరొకరిని ఆ రోజుల్లో ఊహించేవారు కారు.

  చిక్కడు-దొరకుడు:

  చిక్కడు-దొరకుడు:

  కాంతారావు జానపద చిత్రాల విజయ పరంపర అటు ఎన్‌.టి.ఆర్‌. పౌరాణిక చిత్రాలకు, ఇటు నాగేశ్వరరావు విషాద నాయక చిత్రాలకు సమాంతరంగా సాగింది. అదొక ప్రభంజనం. ఆ ప్రభంజనం ఎన్‌.టి.ఆర్‌.ని సైతం జానపదాల్లో నటించక తప్పని, పరిస్థితిని కల్పించింది. కాంతారావుతో కలిసి ‘చిక్కడు-దొరకుడు', ‘మర్మయోగి' జానపదాల్లో నటించారాయన.

  తెలుగులో భారీ కలెక్షన్లు చేసిన

  తెలుగులో భారీ కలెక్షన్లు చేసిన

  అగ్గిదొర (1967)ను తమిళంలో ‘మాయా మోదరం' (మాయా ఉంగరం) పేరుతో డబ్‌ చేశాడు తమిళనాడులో ఎమ్‌.జి.ఆర్‌., శివాజీ గణేషణ్‌ల మాదిరిగా మన కాంతారావు భారీ కటౌట్లు పెట్టారు. డబ్బింగ్‌ చిత్రం స్ట్రైట్‌ చిత్రం కన్నా అధిక వసూలు చేసింది. అంతకుముందే గురువును మించిన శిష్యుడు సినిమా కూడా ‘వీర మనోహర' పేరుతో డబ్‌ అయి బాగా ఆడింది. దాంతో తమిళంలో జానపదాలకు పెట్టింది పేరైన ఎం.జి.ఆర్‌.తో మన కాంతారావును పోల్చుతూ నీరాజనాలు పట్టారు. సేలమ్‌లోని డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఆయన్ను అక్కడికి తీసుకెళ్లి శతదినోత్సవాలు చేసి ఆంధ్రా ఎమ్‌.జి.ఆర్‌. అని ఘనంగా సత్కరించారు.

  కాంతారావు - ఎన్టీఆర్‌:

  కాంతారావు - ఎన్టీఆర్‌:

  ఒకవైపు సాంఘికాలలో అక్కినేని - జగ్గయ్యల కాంబినేషన్‌ మరోవైపు జానపద, పౌరాణిక, సాంఘికాలన్నింటిలోనూ కాంతారావు - ఎన్టీఆర్‌ల జోడి విజయయాత్ర సాగించినవి. కంచుకోట, మర్మయోగి, చిక్కడు దొరడు వంటి జానపదాలు ఇక పౌరాణికాలు సరేసరి. సాంఘికాలలో రక్త సంబంధం (1961), భీష్మ (1962), ఆప్తమిత్రులు (1963), దేశద్రోహులు (1964), ఆడ బ్రతుకు (1965), పల్నాటి యుద్ధం (చారిత్రాత్మకం - 1966), ఏకవీర (1969 వంటి చాలా చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో ఉప్పునూతల పురషోత్తమరెడ్డి తన మిత్రులతో కలిసి బెంగాలీ సినిమా ‘దీప్‌ జాలాజాయ్‌' ను తెలుగులో ‘చివరకు మిగిలేది'గా తీశారు. ఇందులో కాంతారావుది ప్రత్యేక పాత్ర. సినిమా కళాత్మకంగా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్నది. సావిత్రి నటన ఉన్నత శ్రేణికి చెందినదిగా విమర్శకుల ప్రశంసలందుకున్నది. కానీ ఆర్థికంగా ఫెయిలైంది.

  ప్రాంతీయ భావాలు:

  ప్రాంతీయ భావాలు:

  కాంతారావు సినిమాల్లోకి పదిహెకళ్లు గడిచాక నెమ్మదిగా పరిశ్రమలో విభేదాలు మొదలయ్యాయి... ప్రాంతీయ భావాలు కూడా దానికి తోడయ్యాయి... కాంతారావు గారిని పక్కకు పెట్టడం మొదలయ్యింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన స్వంతంగా సినిమా నిర్మాణం తలపెట్టారు. ఇక పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే సినిమా నిర్మాణ మొక్కటే మార్గమని 1969లో తానే హీరోగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘సప్తస్వరాలు' చిత్రం నిర్మించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా నడుస్తున్నది. ఆ సమయంలో భావ నారాయణ పోటీగా కృష్ణ హీరోగా ‘లక్‌ ఇన్‌ ఆంధ్రా' తీసి "ఒక తెలంగాణ వాడి సినిమా చూస్తారా ఆంధ్రావాడి సినిమా చూస్తారా" అని పోటీగా విడుదల చేసినట్టు చెప్పుకుంటారు . కానీ రెండు సినిమాలు పరాజయం పొందాయి.

  ఆఖరి చిత్రం శంకర్‌ దాదా :

  ఆఖరి చిత్రం శంకర్‌ దాదా :

  క్యారెక్టర్‌ రోల్స్‌లో ఆయనది విలక్షణమైన ముద్ర. దేవుడు చేసిన మనుషులు. సాహసవంతుడు వంటి చిత్రాల్లో విలన్‌గా కూడా నటించిన కాంతారావు - బాల భారతం, మహాకవి క్షేత్రయ్య, నేరము - శిక్ష, అల్లూరి సీతారామారాజు, దేవదాసు, ఓ సీత కథ, గాజుల కిష్టయ్య, పాడిపంటలు, ముత్యాలముగ్గు వంటి సుమారు 200 చిత్రాల్లో కారెక్టర్‌ రోల్స్‌ చేశారు. ఇక డజన్ల కొద్ది టి.వి. సీరియల్స్‌లో నటించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం శంకర్‌ దాదా జిందాబాద్‌

  ఏట్లాంటి గుర్తుంపు రాలేదు:

  ఏట్లాంటి గుర్తుంపు రాలేదు:

  సంపాదించినదంతా నిర్మాతగా పోగొట్టుకుని 1990లో హైదరాబాద్‌కు తమ మకాం మార్చిన కాంతారావు ఏ ఆదెరువులేక చిన్న చిన్న వేషాలు వేస్తూ కాలం గడిపారు. అప్పటికే ఆయనకు నలభై ఏండ్ల సినీ జీవితం ముగిసింది. ప్రభుత్వాల తరుఫున ఏట్లాంటి గుర్తుంపు రాలేదు. ఎందరో శ్రేయోభిలాషులు చేసిన సాయంతోనే జీవికను గడిపారు. ఆయనకన్నా తరువాత పరిశ్రమలోకి వచ్చిన చిరంజీవి, బాల సుబ్రహ్మణ్యం, మోహన్‌బాబు, చివరికి బ్రహ్మనందానికి కూడా ‘పద్మ' అవార్డులు వచ్చినవి. కానీ కాంతారావు సీమాంధ్ర సర్కారు వారి దృష్టికి ఆనలేదు. కడాకు ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఆయనను పక్కకు పెట్టి బాపు-రమణ, కె. విశ్వనాథ్‌, దాసరి నారాయణరావు వంటి జూనియర్లకు ఇచ్చి కాంతారావును అవమానపరిచారు. చివరికి 2000 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డును ప్రకటించారు. కనీసం పద్మశ్రీ అవార్డు కైనా ఆయనను సిఫార్సు చేయకపోవడం వివక్షకు నిదర్శనం. చివరికి ఎన్టీఆర్‌తో మరుపురాని చిత్రాల్లో నటించినందుకైనా ఎన్టీఆర్‌ జాతీయ అవార్డుతో గౌరవించలేదు.

  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు:

  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు:

  అంతటి మహా నటున్ని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు... యువ నటులూ, సాంకేతిక నిపుణులూ ఆయనని స్మరిస్తూనేఉన్నారు. ఇప్పుడు ప్రతీ శనివారమూ సినీవారం గా ప్రకటించుకొని మామిడి హరికృష్ణ గారి సహకారంతో చిన్న సినిమాలు నిర్మించే యువ దర్శకులకోసం నిర్వహించే కార్యక్రమం లో జరిగిన సమావేశం లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు ఈ విషయాన్ని చిత్రపురి హిల్స్ అధ్యక్ష్యుడు కొమర వెంకటేష్ గారి దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన అయన త్వరలోనే కాంతారావు గారి కుటుంబాన్ని కలిసి వారికీ చిత్ర పురి హిల్స్ లో ఇల్లు కేటహిస్తామని హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి త్వరలోనే ఇల్లు కేటాయిస్తామన్న కొమర వెంకటేష్గారినీ, మామిడి హరికృష్ణ గారికీ కృతఙ్నతలు తెలుపుతూ వచ్చే పోస్టులు కాంతారావుగారిని తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోదని ౠజువు చేస్తున్నాయి...

  Video

  English summary
  Director of language and Culture Mamidi Harikrishna brought Mr. kantha Rao's issue to the notice of Sri Komra Venkatesh (President of Chitrapuri Hills) . then he immediately accepted to arrange the house to Mr. kantha Rao's family.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more