లత మంగేష్కర్ సైతం ఇరుక్కుంది
ముంబయి : వివాదాస్పద క్యాంపాకోలాలో గానకోకిల లతా మంగేష్కర్ పేరిట రెండు ఫ్లాట్లున్నాయి. ఇషా-ఏక్తా భవనం ఎనిమిదో అంతస్తులో 801, 802 ఫ్లాట్లల్లో లత మంగేష్కర్ సోదరుడి కుమారుడు ఆదినాథ్ మంగేష్కర్ ఉంటున్నట్లు సమాచారం. ఈ రెండు ఫ్లాట్లను పడగొట్టనున్నారు. క్యాంపాకోలా వాసులకు అనుకూలంగా ఆమె ట్వీట్ చేశారు.
అక్రమ అంతస్తులపై చర్యలను ఉపసంహరించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ చర్యల్లో అనేకమంది నిరాశ్రయులవుతారని తెలిపారు. ఈ షాక్‌తో ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. బిల్డర్ల మోసపూరిత చర్యలతో సాధారణ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయమని అభిప్రాయపడ్డారు.

క్యాంపాకోలా సొసైటీ ఆవరణలో అక్రమంగా నిర్మించిన 35 అంతస్తుల్లో ఉంటున్న 96 ఫ్లాట్లను కూల్చివేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఆదేశించింది. ఈ ఫ్లాట్లను ఖాళీ చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మున్సిపల్ అధికారులు వాటిని కూల్చివేయడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీయడం తెలిసిందే.
గతంలో ముంబయిలోని క్యాంపాకోలా సొసైటీ నివాసాల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలు తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కూల్చివేసే అపార్ట్‌మెంట్లలోని వారికోసం ప్రత్యేక బిల్డింగ్‌ను అదే ప్రాంతంలో నిర్మించడానికి చేసిన ఒక ప్రతిపాదనను పరిశీలించడానికి కూడా కోర్టు అంగీకరించింది.
అక్రమ నివాసాలకు బదులుగా కొత్త ఇళ్లను నిర్మించేందుకు వీలుగా బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఒక కొత్త ప్లాన్‌ను అందజేస్తుందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలియజేసారు. ఇళ్ల కోసం కొత్త భవనాన్ని నిర్మించడానికి సొసైటీ ఆవరణలో తగినంత చోటు ఉందని కూడా ఆయన చెప్పారు. కొత్త ప్రతిపాదనలను సమర్పించాలని కోర్టు అటార్నీ జనరల్‌ను కోరింది.


Click it and Unblock the Notifications











