»   » వేణువై వచ్చిన వేటూరికి శతమానంభవతి!

వేణువై వచ్చిన వేటూరికి శతమానంభవతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా చేసుకొన్న గొప్ప అదృష్టం ఘనాసాటీలన తగ్గ మహాకవుల సముదాయాన్ని కలిగి వుండటం. సముద్రాల, పింగళి, మల్లాది, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సినారె, వీటూరి, వీరంతా తెలుగు పాటకు ప్రాణ ప్రతిష్ట చేసిన వారే. వీరిలో కొందరు పాటకు పరిమళాన్ని అద్దిన వారైతే మరికొందరు పాటకు పులకరింత నేర్పిన వారూ వున్నారు. వేటూరి ఆగమనంతో పాటకు పలవరింతలు మొదలయ్యాయి. పాట పరవశంతో నాట్యం చెయ్యడమూ మొదలైంది.

తెలుగు సంస్కతం భాషల మీద మంచి పట్టు వుండటంతో అనర్గళంగా మాట్లాడుతూ అశువుగా కవిత్వం చెప్పేవారు.'ఓ సీత కథలో 'నిను కన్న కథ పాటతో ప్రారంభమైన వేటూరి పాటల పల్లకీ ప్రపంచం చుట్టూ తనదైన హంసగమనంతో ఊరేగి సినీ ప్రేమికుల్ని ఆనందపరుస్తూ ఆశ్చర్యపరుస్తూ 28.01.10 డెభ్బై అయిదవ వసంతంలోకి అడుగు పెట్టారు. నిజంగా ఎవరికైనా దొరుకునా ఇటువంటి సేవ? సందర్భం వచ్చింది కనుక ప్రస్థావించాలి గానీ, ఎన్నని చెప్పగలం? ఏమని చెప్పగలం? ఆయన పాటల ఝరీ రసగంగ ప్రవాహం.

'సిరిసిరి మువ్వలో ఝుకారంతో పల్లి ప్రారంభించే గుండె దైర్యం ఎందరికుంటుంది?(ఝుమ్మంది నాదం) 'శంకరాభరణం అక్షర సరస్వతికి కంఠాభరణం 'సాగర సంగమం నవరస భావోద్వేగాల సంగమం. 'స్వాతిముత్యం నేటికీ ఆణిముత్యమే. వేటూరిలో రెండు డైమన్షన్స్ వున్నాయి. ఆరేసుకోబోయి పారేసుకున్నా, చిలక్కొట్టుడు కొట్టినా, ఆకు చాటూ పిందె తడిసినా, సీమ నుండి వచ్చి చిట్టి గారె తిన్నా ఆ పాట మీద వేటూరి ముద్ర చెరగదు.

ఇది ఓ కోణమైతే మాతృదేవత చిత్రం కోసం వేణువై వచ్చానూ.." ఇంటింటి రామాయణంలో 'వీణ వేణువైనా", ఆకాశ దేశానా అంటూ 'మేఘసందేశం పంపించినా అది వేటూరికే చెల్లింది. సందేహం లేదు. వేటూరి సరస్వతీ పుత్రుడు పది పదుల కాలాలు నిలిచిపోయే పాటలు రాశాడు. భావి తరాల కవులకు స్పూర్తిదాయకంగా నిలిచిపోయాడు. వేటూరి మన తెలుగు జాతి సంపద. డెబ్బై అయిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శతమానంభవతి పలుకుదాం!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu