»   » ఊయలలూగే జగాలు, వెన్నెలకురిసే పగళ్లు, సినారె కవితలు

ఊయలలూగే జగాలు, వెన్నెలకురిసే పగళ్లు, సినారె కవితలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎస్ ఎన్ రెడ్డి అని తనను ఇంగ్లీషులో పిలుచుకోకుండా సి నారాయణ రెడ్డి అని సినారె అని తెలుగుపేరుతో వెలిగిన వ్యక్తి లేడన్న వార్త తెలియగానే కొన్ని పాటలు గుర్తుకు వచ్చాయి ఆ తలపుల నివాళి.

ఊహలు. అవి కదులుతూ ఉంటాయి, వాటికి కన్నులు కూడా. అప్పుడు పగలే వెన్నెల జగమే ఊయల. కదిలే ఊహల కన్ను సి నారాయణ రెడ్డి.

ఆ కన్ను మూతబడినా ఆయన ఊహించిన ఊహలు పాటలై మనలను ఊపుతూనే ఉంటాయి. సినారె సినీ గీతాలను మామూలు మనిషి మరిచిపోవడం కష్టం.

ఆయన భావాలను అందుకున్న మాటలు

ఆయన భావాలను అందుకున్న మాటలు

మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి, కవితలకందని భావాలు కంటిపాపలే చెబుతాయి అన్న మరోపాట కూడా ఇంతటి భావబంధురమైనదే.
పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో కోటి రాగమాలికలు ....హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం ....
కనగలిగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం ....
చదువురాని వాడవని దిగులుచెందకు అనేపాటలో మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు అని సినారె పాట ప్రశ్నిస్తుంది.

పైసలల్ల ఏమున్నది

పైసలల్ల ఏమున్నది

పొట్టచేతబట్టుకుని దుబాయికెల్లిపాయె... ఏడున్నడో నాకొడుకు ఏం తిన్నడో నాకొడుకు
కొత్తలు పంపుతనని కారటేసిండు...పాణాలకు బట్టనపుడు పైసలల్ల ఏమున్నది
అని తెలంగాణ మాండలికంలో పల్లెటూరి తల్లి కష్టాలు కనిపెట్టి రాసినాడు, సినారె.

కీర్తన వలె

కీర్తన వలె

వటపత్రశాయికీ వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలీ ... అని వట పత్రం మీద పడుకున్న పరమాత్ముడికి లాలి పాటలో ఒక వరుస, శిల్పం, పద్ధతి ఆకట్టుకుంటాయి. నవరత్నాలతో పోలిన లాలి పదాల పల్లవి తో మొదలైన ఈ పాటకు తొలిచరణంలో మాతృమూర్తుల లాలి ఉంటుంది... కల్యాణ రామునికి కౌసల్య లాలి, యదువంశ విభునికి యశోద లాలి, కరిరాజ ముఖునికి గిరితనయ లాలి, పరమాత్మ భవునికి పరమాత్మ లాలి అని. చివరి చరణంలో వాగ్గేయకారులను స్మరిస్తాడు. అలమేలు పతికి అన్నమయ్య లాలి, కోదండరామునికి గోపయ్య లాలి, శ్యామలాంగునికి శ్యామయ్య లాలి, ఆగమనుతునికి త్యాగయ్య లాలి. తండ్రిలేని తనయుడికి తల్లి నిద్రబుచ్చే సన్నివేశానికి ఇంత గొప్ప పాటను రచించాడు సినారె. స్వాతిముత్యం సినిమాలో ఈ పాట ఒక స్వాతి ముత్యం.

ఏకవీరలో మాటల వీరుడు

ఏకవీరలో మాటల వీరుడు

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచన ఏకవీర చిత్రానికి మాటలు పాటలు రాసిన సినారె పద్యమూ పాటా కాని ఒక గేయ ప్రయోగం చేశారు.
కలువ పూల చెంత జేరి కైమోడుపు సేతును, నా కలికిమిన్న కన్నులలో కలకల మని విరియాలని...మబ్బులతో ఒక్కసారి మనవి చేసికొందును నా అంగన ఫాలాంగణమున ముంగురులై మురియాలని, చుక్కలతో ఒక్కసారి సూచింతును నా చెలి నల్లని వాల్జడ సందుల మల్లియనై మెరియాలని, పూర్ణసుధాకర బింబమ్మునకు వినతిసేతును నా సుదతికే ముఖబింబమై కళలు దిద్దుకోవాలని, ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థింతును కడసారిగా నా రమణికే బదులుగా ఆకారమ్ము ధరియించాలని....

గాలికీ కులమేది...

గాలికీ కులమేది...

గాలికి కులమేది నేలకు కులమేది అని కర్ణ అనే డబ్బింగ్ సినిమాకు అద్భుతమైన గీతాన్ని రాసారు సినారె.
రాలలో మునులనుచూసిన కనులు కదలలేవు మెదల లేవు పెదవి విప్పి పలుకలేవు.... కాని.....ఉలి అలికిడి ఉన్నంతనే గలగలమని పొంగిపొరలే నల్లని రాల వెనుక కన్నులూ ఉన్నాయి, ఆ బండల వెనుక గుండెలూ ఉన్నాయంటాడు కవి. రాళ్లలో రాగాలున్నాయనే భావన కు పదాల కూర్చి రాగాలు చేర్చి పాటగా మార్చడం ఎందరినో అలరించింది. మునుల వోలె కారడవుల మూలలందు పడి ఉన్నవి అనే పోలిక కొందరికి నచ్చలేదు. మునులను రాళ్లతో పోల్చడమా అని ప్రశ్నించారు. మౌనంగా నిశ్చలంగా ఉన్న రాయి లక్షణాలు మునులతో సమానమనడం ఔచిత్యమే నని రాళ్లలో జీవలక్షణాలను వివరిస్తున్నసందర్భానికి సరైనదేనని మరికొందరన్నారు.

మీమాంస ఉండనే ఉంది...

మీమాంస ఉండనే ఉంది...

ఆయన జ్ఞాన పీఠం ఇవ్వడం సమంజసమా ఆయనకుమించిన జ్ఞానులకు ఎవరై పీఠాలు ఇస్తున్నారా అనే మీమాంస ఉండనే ఉంది. సిద్ధాంతాలు సరిపోకపోవడం కూడా ఉంది. పాలకుల ప్రాపకం వల్ల బిరుదులు పదవులు వచ్చాయనే నిందలూ ఉన్నాయి. ఉంటాయి. 86 ఏళ్ల దాకా తెలుగు పదంపైన భావం పైన గేయం పైన పదకవితలపైన జీవనాన్ని సాగించిన ఒక కవి అస్తమించిన సమయం ఇది.

- మాడభూషి శ్రీధర్

English summary
MadaBhushi sridhar in his condolence message appreciated the aesthetics of C Narayana Reddy's songs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu